శనివారం, 28 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కొనుగోళ్ల మాయలో మనసు!

4 గంటల క్రితం

కొనుగోళ్ల మాయలో మనసు! image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 03:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

పండగ సేల్‌ అని ఫోన్‌కు సందేశం వస్తుంది. ఆన్‌లైన్‌ యాప్‌ తెరిస్తే ఆకర్షణీయమైన ఆఫర్లు కనిపిస్తాయి. 'ఇప్పుడు కొనకపోతే ఈ ఆఫర్‌ ఉండదు' అన్న ప్రకటనలు తొందరపెడతాయి. చివరకు అవసరం ఉందో లేదో ఆలోచించకుండానే ఆర్డర్‌ పెట్టేస్తాం. వస్తువు ఇంటికి చేరినప్పుడు ఆనందం కలుగుతుంది. కానీ కొద్దిరోజులకే అది మామూలైపోతుంది. మరో కొత్త వస్తువు కొనాలన్న ఆలోచన మొదలవుతుంది. మధ్య తరగతి కుటుంబాల్లో ఈ అనుభవం చాలామందికి ఎదురవుతూనే ఉంటుంది. నెలవారీ బడ్జెట్‌, ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, ఈఎంఐల మధ్య ప్రతి రూపాయినీ లెక్కపెట్టుకోవాల్సి ఉన్నా, ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఆకర్షణకు లోనై అనవసర ఖర్చులు చేయడం పెరుగుతోంది.

కొనుగోలు ఉత్సాహం

కొత్త వస్తువు కొనాలన్న ఆలోచన వచ్చినప్పటి నుంచే మనసులో ఉత్సాహం మొదలవుతుంది. ధరలు చూడటం, వివిధ బ్రాండ్లతో పోల్చడం, నచ్చిన వస్తువును కార్ట్‌లో పెట్టడం, ఆఫర్‌ కోసం ఎదురుచూడటం.. ఇవన్నీ షాపింగ్‌ అనుభవంలో భాగమే. ఆర్డర్‌ చేసిన తర్వాత వస్తువు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తాం. ఈ సమయంలో మెదడులో డోపమైన్‌ అనే రసాయనం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మన కోరికలు, ప్రేరణ, బహుమతి పొందబోతున్నామన్న ఎదురుచూపును ప్రభావితం చేస్తుంది. అందుకే కొన్నిసార్లు వస్తువును కొనడం అనేది దాన్ని ఉపయోగించడం కంటే ఎక్కువ ఆనందాన్నిస్తుంది. ఈ ధోరణిని ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థలు ఉపయోగించుకుంటున్నాయి. పరిమిత సమయం ఉండే ఆఫర్లు, ఫ్లాష్‌ సేల్స్‌, మన అభిరుచులకు అనుగుణంగా చూపించే ప్రకటనలు, సులభమైన డిజిటల్‌ చెల్లింపులు వెంటనే కొనుగోలు చేసేలా ప్రేరేపిస్తాయి. 2024లో 1,39,545 మందిపై జరిపిన అధ్యయనంలో- మార్కెటింగ్‌ పద్ధతులు, షాపింగ్‌ వేదికలు, వ్యక్తిగత అలవాట్లు ముందస్తు ఆలోచన లేకుండా కొనుగోళ్లు చేయడాన్ని ప్రభావితం చేస్తున్నట్లు వెల్లడైంది. అంటే మన కొనుగోలు నిర్ణయాలను మనకు తెలియకుండానే అనేక అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.

భావోద్వేగాల ప్రభావం

ప్రతి కొనుగోలు వెనుక అవసరం ఉండకపోవచ్చు. కొన్నిసార్లు అసంతృప్తి, ఒత్తిడి, ఒంటరితనం కూడా షాపింగ్‌ వైపు నడిపిస్తాయి. కార్యాలయంలో గొడవ జరిగినా, ఇంట్లో సమస్యలు ఎదురైనా, రోజంతా అలసిపోయినా కొత్త వస్తువు కొనాలనిపించవచ్చు. కొద్దిసేపు మనసు మరో విషయంపైకి మళ్లి, ఏదో ఒకటి కొనుక్కున్నామన్న సంతృప్తి కలుగుతుంది. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలవదు. ఒత్తిడికి, అదుపు తప్పిన కొనుగోళ్ల అలవాటుకు మధ్య సంబంధం ఉన్నట్లు ఒక అధ్యయనంలో గుర్తించారు. ఎక్కువ ఒత్తిడిని అనుభవించే వారిలో ఇలాంటి కొనుగోళ్ల లక్షణాలు ఎక్కువగా కనిపించాయట! 2026లో 364 మంది పెద్దలపై నిర్వహించిన అధ్యయనం ప్రకారం, కొందరు భావోద్వేగ అవసరాలను తీర్చుకోవడానికి వస్తువులు కొంటారని తేలింది. మరికొందరు ఇతరుల గుర్తింపు, ప్రశంసలు పొందాలనే ఉద్దేశంతో ఖరీదైన లేదా ప్రత్యేకంగా కనిపించే వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ ధోరణులు ఆన్‌లైన్‌ షాపింగ్‌ వ్యసనంతో సంబంధం కలిగి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

అలవాటే సమస్య

షాపింగ్‌ చేయడం తప్పు కాదు. కానీ కొనుగోళ్లపై నియంత్రణ కోల్పోయినప్పుడు సమస్య మొదలవుతుంది. నెలాఖరులో ఇంటి ఖర్చులకు డబ్బు సరిపోకపోవడం, క్రెడిట్‌ కార్డు బకాయిలు పెరగడం, అవసరం లేని వస్తువుల కోసం ఈఎంఐలు కట్టడం, కుటుంబ సభ్యులతో ఖర్చుల విషయంలో గొడవలు రావడం వంటి పరిణామాలు ఎదురవుతాయి. 'ఇకపై అనవసరంగా కొనకూడదు' అని నిర్ణయించుకున్నా, కొద్దిరోజులకు మళ్లీ అదే అలవాటు కొనసాగవచ్చు. అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ సైకియాట్రీలో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం, జనాభాలో సుమారు ఐదు శాతం మందిలో అదుపు తప్పిన కొనుగోళ్లకు సంబంధించిన సమస్య కనిపిస్తోంది. ఇది డబ్బు నష్టానికే పరిమితం కాదు. అప్పులు, కుటుంబ విభేదాలు, ఉద్యోగంపై ప్రభావం, కొనుగోళ్ల తర్వాత కలిగే అపరాధభావం వంటి సమస్యలకూ దారితీయవచ్చు.

ఈ అలవాటును నియంత్రించుకోవడానికి నెలవారీ షాపింగ్‌ బడ్జెట్‌ నిర్ణయించుకోవాలి. ఆఫర్‌ ఉందని వెంటనే కొనకుండా ఒకటి రెండు రోజులు ఆగి ఆలోచించాలి. వస్తువు నిజంగా అవసరమా, ఇంట్లో అలాంటిది ఇప్పటికే ఉందా అని చూసుకోవాలి. ఒత్తిడిగా ఉన్నప్పుడు షాపింగ్‌ యాప్‌లకు దూరంగా ఉండటం మంచిది. కొనాలన్న కోరిక వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొంత సమయం ఇవ్వాలి. మనసుకు ఉపశమనం కావాలంటే కుటుంబ సభ్యులతో మాట్లాడటం, స్నేహితులను కలవడం, నడకకు వెళ్లడం వంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవచ్చు.

ప్రతి కొనుగోలుకు ముందు ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి:

'నాకు నిజంగా ఈ వస్తువు అవసరమా?'

ఈ చిన్న ప్రశ్న మన ఖర్చులనే కాదు, మన భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి కూడా తోడ్పడుతుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్