మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఒక గ్రామీణ వైద్యుడి కథ!

12 జులై, 2026

doctor
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 05:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రస్తుతం చాలామంది వైద్యులు కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ బీహార్‌కు చెందిన డాక్టర్ రమణ్ కిషోర్ మాత్రం అందుకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఎలాంటి వైద్య సదుపాయాలు లేని మారుమూల గ్రామాలకు వెళ్లి తన సొంత ఖర్చుతో పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. తన తల్లిలా మరెవరూ వైద్యం అందక ప్రాణాలు కోల్పోకూడదనే సంకల్పమే ఆయన జీవిత లక్ష్యంగా మారింది. విరాళాలు తీసుకోకుండా, ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకుండా తన జీతంలో ఎక్కువ భాగాన్ని గ్రామీణ ప్రజల వైద్య సేవలకే వెచ్చిస్తున్నారు. ఆయన సేవలను గుర్తిస్తూ ప్రముఖ టెలివిజన్ కార్యక్రమం కౌన్ బనేగా కరోడ్‌పతికి కూడా ఆహ్వానించారు. అక్కడ అమితాబ్ బచ్చన్ ఆయన సేవలను ప్రశంసించారు.

తల్లి మరణంతో...

బీహార్‌లోని దర్భంగా జిల్లా భురావాన్ గ్రామంలో సాధారణ కుటుంబంలో జన్మించిన రమణ్ కిషోర్, పోఖీవాలాలోని కిసాన్ ఉచ్చయ విద్యాలయంలో పదో తరగతి పూర్తి చేశారు. ఆయన తండ్రి గ్రామంలో చిన్న ప్రాథమిక పాఠశాలను నిర్వహించేవారు. చిన్నప్పటి నుంచే డాక్టర్ కావాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకున్నా, కుటుంబ ఆర్థిక పరిస్థితులు అందుకు సహకరించలేదు. డబ్బుల్లేక ఎంబీబీఎస్ ఎలా చదువుతావని స్నేహితులు, బంధువులు నిరుత్సాహపరిచినా వెనక్కి తగ్గలేదు. ఉన్నత విద్య కోసం పాట్నాకు వెళ్లి, కుటుంబంపై భారం వేయకుండా కొన్ని సంవత్సరాల పాటు ట్యూషన్లు చెబుతూ చదువు కొనసాగించారు. చివరకు 2012లో మెడికల్ కళాశాలలో ప్రవేశం పొందారు. అయితే అదే సమయంలో జీవితంలో అతిపెద్ద విషాదం ఎదురైంది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో ఆయన తల్లి లివర్ క్యాన్సర్‌తో మరణించారు. సమీపంలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆమె సకాలంలో చికిత్స పొందలేదు. ముంబయిలోని టాటా మెమోరియల్ ఆసుపత్రిలో చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. ఈ సంఘటన రమణ్ జీవితాన్నే మార్చేసింది. మొదట కార్డియాలజిస్టు కావాలనుకున్న ఆయన, వ్యాధిని ముందుగానే గుర్తించి చికిత్స అందించే డయాగ్నొస్టిక్ వైద్యుడిగా మారాలని నిర్ణయించుకున్నారు. అనంతరం ఎయిమ్స్ పాట్నాలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు చాలా ఆలస్యంగా గుర్తిస్తున్నారని గమనించిన ఆయన, ముందస్తు నిర్ధారణపై ప్రజల్లో అవగాహన కల్పించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

​సొంత ఖర్చుతో సేవ

వైద్య వృత్తిలో చేరిన తర్వాత ప్రతి వారాంతంలో మారుమూల గ్రామాలకు వెళ్లి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం ఆయన జీవితంలో భాగమైంది. ఇప్పటివరకు 296 శిబిరాలు నిర్వహించి 50 వేల మందికి పైగా రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. శిబిరాలకు అవసరమైన వైద్య పరికరాలు, మందులను కూడా తన సొంత డబ్బుతోనే సమకూరుస్తున్నారు. ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఇచ్చే మందులను పంపిణీ చేయరు. విరాళాలు కూడా స్వీకరించరు.

"ఒకసారి విరాళాలు తీసుకుంటే దాతల ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకోవాల్సి రావచ్చు. అది నా సేవా లక్ష్యానికి భంగం కలిగిస్తుంది. అందుకే నా సొంత డబ్బులతోనే ఈ సేవలను కొనసాగిస్తున్నాను. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నా జీతంలో 70 నుంచి 80 శాతం వరకు వైద్య సేవలకే ఖర్చు చేస్తాను. చాలా మంది వైద్యులు రోగులను తమ ప్రైవేట్ క్లినిక్‌లకు మళ్లించడానికి శిబిరాలు నిర్వహిస్తారు. కానీ నేను ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనుకున్నాను. అందుకే ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకూడదని నిర్ణయించుకున్నాను" అని రమణ్ కిషోర్ చెబుతున్నారు.

తాను ఎక్కడ శిబిరాలు నిర్వహించినా సొంత పరికరాలనే తీసుకెళ్తారు. అవసరమైన మందులను కూడా తన సొంత ఖర్చుతో కొనుగోలు చేస్తారు. గ్రామాల్లో పరీక్షలతో పాటు రోగులకు అవసరమైన ఆరోగ్య సలహాలు ఇస్తూ, చికిత్సను కొనసాగించేలా మార్గనిర్దేశం చేస్తుంటారు. ఆయన సేవల కారణంగా స్థానికులు ప్రేమగా "విలేజ్ డాక్టర్" అని పిలుస్తున్నారు. నిస్వార్థ సేవకు ప్రతీకగా నిలిచిన ఆయన దేశవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్