శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మూడు రాళ్ల తీర్పు

1 గంట క్రితం

mos
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 03:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

రామాపురంలో వేణుగోపాలుడు అనే వృద్ధుడు ఉండేవాడు. అతని దగ్గర పూర్వీకుల నుండి సంక్రమించిన ఒక అమూల్యమైన బంగారు నాణెం ఉండేది. దేశసంచారం చేయాలని అనుకున్న వేణుగోపాలుడు ఆ నాణాన్ని బాల్యమిత్రుడు దామోదరుడికి ఇచ్చి ‘నేను వచ్చే వరకు జాగ్రత్తగా ఉంచు’ అని చెప్పాడు. నెల రోజుల తర్వాత యాత్ర ముగించుకుని తిరిగి వచ్చిన వేణుగోపాలుడు దామోదరుడి ఇంటికి వెళ్లాడు. ‘నా బంగారు నాణం ఇవ్వు మిత్రమా’ అనగానే దామోదరుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ.. ‘ఏమిటి? మూడు రోజుల క్రితమే వచ్చి తీసుకెళ్లావు కదా! ఇప్పుడు మళ్లీ ఎందుకు అడుగుతున్నావు?’ అన్నాడు. ఆ మాటలు వేణుగోపాలుడి గుండెల్లో పిడుగులా పడ్డాయి. ‘నేనా? ఇప్పుడే మొదటిసారి నీ ఇంటికి వచ్చాను. నా నాణం ఇవ్వు’ అని గట్టిగా అన్నాడు. ‘అబద్ధం చెప్పకు. నేను నీకు ఇచ్చేటప్పుడు గిరి, మల్లేశం, కోటయ్య ముగ్గురూ అక్కడే ఉన్నారు. వాళ్లను అడుగు’ అని దామోదరుడు ఎంతో నిక్కచ్చిగా మాట్లాడాడు.

న్యాయం కోసం ఇద్దరూ గ్రామ పెద్ద ధర్మన్న ఎదుట నిలబడ్డారు. ధర్మన్నకు తొందరపాటు తీర్పులు చెప్పే అలవాటు లేదు. మనుషుల మాటలకన్నా వారి అబద్ధాల్లోని చీలికలను గుర్తించడంలో ఆయనకు అసాధారణమైన నేర్పు ఉంది. దామోదరుడు చెప్పిన ముగ్గురు సాక్షులను వేర్వేరు గదుల్లో ఉంచాడు. ముందుగా గిరిని పిలిచాడు. ‘ఆ బంగారు నాణం చూశావా?’ అని అడిగాడు. ‘చూశాను’ అని గిరి చెప్పాడు. ‘అయితే అదే పరిమాణంలో ఒక గులకరాయి తీసుకురా’ అని ధర్మన్న అన్నాడు. అదే ప్రశ్నను మల్లేశానికి.. తర్వాత కోటయ్యకు.. ఒక్కొక్కరిని విడివిడిగా అడిగాడు. సభలో కూర్చున్నవారందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కొద్దిసేపటికి ముగ్గురూ తిరిగి వచ్చారు.

మొదటివాడు, కోడిగుడ్డు పరిమాణంలో రాయి తెచ్చాడు. రెండోవాడు, ఉసిరికాయంత రాయి చూపించాడు. మూడోవాడు, చింతపిక్కంత చిన్న రాయి తీసుకొచ్చాడు. సభలో ఒక్కసారిగా గుసగుసలు మొదలయ్యాయి. దామోదరుడి ముఖం పాలిపోయింది. ధర్మన్న మాత్రం ప్రశాంతంగా లేచాడు. అబద్ధం చెప్పి బంగారు నాణెం కాజేయాలనుకున్న దామోదరుడికి తగిన శిక్ష విధించాడు. తప్పుడు సాక్ష్యం చెప్పిన ముగ్గురికీ జరిమానా విధించాడు. బంగారు నాణాన్ని వేణుగోపాలుడికి తిరిగి అందజేశాడు.

నీతి: అబద్ధం తాత్కాలికంగా గెలిచినట్లు కనిపించవచ్చు. కానీ వివేకంతో కూడిన న్యాయం ముందు అది శాశ్వతంగా ఓడిపోతుంది.


- డా. సారిపల్లి నాగరాజు,

80083 70326.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్