నేడు చాలామంది తమకు ఏ సమాచారం కావాలన్నా, రాయాలన్నా చాట్ జిపిటిని వినియోగిస్తున్నారు. దీనివల్ల క్షణాల్లో సమాచారం వస్తుంది. పని త్వరితంగా పూర్తవుతుంది. కానీ ఎఐ టూల్స్ వల్ల జ్ఞాపకశక్తి, అభ్యాస సామర్థ్యం తగ్గుతుందని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి) ల్యాబ్ పరిశోధన తాజాగా సూచించింది. ఒక వ్యాసం రాయడానికి, ఎవరికైనా ఇమెయిల్ పంపడానికి.. వెంటనే చాట్ జిపిటిని ఆశ్రయించడం ఇప్పుడు చాలా మందికి సాధారణమైపోయింది. దీనివల్ల మెదడు పని క్రమేణా తగ్గుతుందని ఈ అధ్యయనం చెబుతోంది.
చాట్ జిపిటి, గూగుల్ సెర్చ్ వంటి వాటిని ఉపయోగించేవారు, సొంతంగా సమాచార సేకరణ చేసేవారు.. ఈ ఇద్దరి జ్ఞాపకశక్తిని పరిశోధకులు అధ్యయనం చేశారు. ఎఐ టూల్స్‌ని ఉపయోగించకుండా సమాచారాన్ని విశ్లేషించే వారిలో నాడీ వ్యవస్థ బాగా పని చేసినట్లు గుర్తించారు. గూగుల్‌లో శోధించి రాసిన వారిలో మెదడు, నాడీ వ్యవస్థ పనితీరు మధ్యస్థంగా ఉంది. చాట్ జిపిటిని ఉపయోగించిన వారిలో నాడీ వ్యవస్థ చాలా తక్కువగా పనిచేస్తోందని ఈ పరిశోధన వెల్లడించింది. చాట్ జిపిటిని అనుసరించే వారిలో, అనుసరించని వారిలో విషయ పరిజ్ఞానం, మరలా గుర్తు తెచ్చుకోవడం వంటి విషయాల్లో స్పష్టమైన తేడా ఉన్నట్లు పరిశోధన వెల్లడించింది. నేర్చుకోవడం అనేది శ్రద్ధ పెట్టడం, సమాచారాన్ని గుర్తుచేసుకోవడం, పోల్చడం, తప్పులను సరిదిద్దుకోవడం, పునర్నిర్మించడం వంటి చర్యల సమాహారం. ఒక వ్యక్తి తను చెప్పేది సరైనదని వాదించడం లేదా దానిని రుజువు చేయడానికి చేసే ప్రయత్నాన్ని పరిశీలిస్తే మెదడులో మంచి పని జరుగుతున్నదని అర్థం అని న్యూరాలజిస్టులు తెలిపారు. అలా అని ఎఐకి దూరంగా ఉండాల్సిన పనిలేదు. కానీ దానిని ఎలా, ఎప్పుడు, ఎంతమేర వినియోగిస్తున్నామన్నదే అసలు ప్రశ్న.







కామెంట్‌లు (0)