అమ్మ, అమ్మమ్మ, మనవరాలు కలిసి క్రీడా మైదానానికి వెళితే సాధారణంగా ఏం చేస్తారు..! మనవరాలు ఆటలు ఆడుకుంటుంది. అమ్మ వాకింగ్, రన్నింగ్ లాంటి వ్యాయామాలు చేసుకుంటుంది. మరి అమ్మమ్మ.. ఓపిక ఉంటే అమ్మతో పాటు వ్యాయామం, లేకపోతే ఎక్కడో ఓ చోట కూర్చొని వచ్చి పోయేవారిని చూస్తుంటుంది. కానీ తమిళనాడు కోయంబత్తూరు క్రీడా మైదానాలలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. అక్కడ మూడు తరాల మహిళలు ఎంచక్కా తమకిష్టమైన వాలీబాల్, త్రోబాల్ ఆటల్లో శిక్షణ తీసుకుంటున్నారు. పోటీల్లో కూడా పాల్గొంటున్నారు.
కోయంబత్తూరులోని యమునానగర్, సోమయాంపాల్యం క్రీడా మైదానాల్లో సాయంత్రం అయ్యే సరికి మొత్తం 65 మంది మహిళలు సమావేశమవుతారు. వారిలో 50 ఏళ్లు పైబడిన వాళ్లు కూడా ఉన్నారు. 9 మంది చొప్పున నాలుగు జట్ల వారీగా శిక్షణ తీసుకుంటున్న ఈ మహిళలకు క్రీడాకారులు ధరించే ఫార్మల్ యూనిఫామ్స్ ఉండవు. చీరలు, చుడీదార్లు, క్యాజువల్ డ్రెస్సుల్లోనే ఉంటారు. శిక్షణ తీసుకుంటున్న వారిలో ఎక్కువ మంది చుట్టుపక్కల గ్రామాల నుండి, దిగువ మధ్యతరగతి కుటుంబాల నుండి వస్తున్నారు.
శిక్షణ ఇస్తున్న కోచ్ ఎస్.ఆర్. అరుచామీ తన క్రీడాకారుల గురించి ఇలా చెబుతున్నారు. క్రీడల్లో పాల్గొంటున్న మహిళల్లో కొంతమందికి ఆయా విభాగాల్లో అనుభవం ఉంది. ఇంకొంతమందికి అసలు అనుభవం లేదు. అయినా నేర్చుకోవాలనే తపన ఉంది’ అంటున్నారు. 75 ఏళ్ల అరుచామీకి వాలీబాల్ క్రీడాకారుడిగా 18 ఏళ్ల అనుభవం ఉంది. కోచ్‌గా 15 సంవత్సరాలుగా శిక్షణ ఇస్తున్నారు. ఐటీ డిపార్ట్‌మెంట్, సెంట్రల్ రెవిన్యూ డిపార్ట్‌మెంట్ టీమ్స్‌కు కోచ్‌గా వ్యవహరించారు. వాలీబాల్ అసోసియేషన్‌లో వివిధ పదవులు నిర్వహించారు. 2018లో వాటన్నింటికీ స్వస్తి పలికి సామాజిక సేవ వైపు అడుగులు వేశారు.
‘క్రీడల్లో రాణించాలనుకున్న ఎందరో మహిళలు పెళ్లి, పిల్లల బాధ్యతల్లో మునిగిపోయి వారి కలలకు దూరం అవుతున్నారు. చాలామంది క్రీడల వైపే రావడం లేదు. వారి కోసమే నేను శిక్షణ ఇస్తున్నాను’ అని చెబుతున్న అరుచామీ ఈ 65 మంది మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. మైదానం నిర్వహణకు, కరెంటు వంటి ఇతర ఖర్చులకు గాను నెలకు రూ.10 వేలు అతని సొంత ఖర్చుల నుండి వెచ్చిస్తున్నారు. దాతల నుండి నిధులు వచ్చేది అరకొరే. అయినా అరుచామీ శిక్షణను ఎక్కడా ఆపడం లేదు. ఇటీవల ఈషా ఫౌండేషన్ నిర్వహించిన క్రీడా పోటీల్లో అరుచామీ బృందం పాల్గొని మూడో బహుమతి కూడా గెలుచుకుంది.
రోజూ సాయంత్రం 4 గంటలకు మైదానానికి ఈ మహిళలు వస్తున్నారు. వారితో పాటు పిల్లలు, తల్లులు కూడా కలుస్తారు. రాత్రి 8-9 గంటల వరకు వీరంతా శిక్షణ తీసుకుంటారు. మైదానం నుండి బయటకు వెళ్లే సమయానికి పిల్లలు, వారితో పాటు తండ్రులు తమ తల్లుల కోసం, భార్యల కోసం వేచి చూస్తుంటారు. క్రీడల వైపు భార్యలను, తల్లులను ప్రోత్సహిస్తున్న పురుషులు తక్కువ మందే ఉంటారు. సాధారణంగా ఇలాంటి దృశ్యాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి.
ఆర్. మలర్విజి (56) ఈ మైదానంలో శిక్షణ తీసుకుంటున్నారు. తన అనుభవాన్ని ఆమె ఇలా చెప్పారు. ‘ఇది నా 30 ఏళ్ల కల. స్కూలు రోజుల్లో వాలీబాల్ బాగా ఆడేదాన్ని. నాకు ఆటలంటే చాలా ఇష్టం. కానీ పెళ్లయ్యాక వాటిని దూరం పెట్టాల్సి వచ్చింది. మళ్లీ ఇన్నేళ్లకు అది సాధ్యమైంది’ అని సంతోషంగా చెబుతున్నారు. శిక్షణ కోసం వస్తున్న మలర్విజి స్థానికురాలు కాదు. తిరుప్పూర్ జిల్లాలో నివసిస్తున్నారు. శిక్షణ కోసం కోయంబత్తూరులో ఉన్న కూతురు ఇంటికి వారానికి మూడు రోజులు వస్తున్నారు. అలా వచ్చినప్పుడల్లా ఆమెతో పాటు ఆమె కూతురు, మనవరాలు కూడా మైదానానికి వచ్చి తమకిష్టమైన క్రీడల్లో శిక్షణ తీసుకుంటున్నారు. అరుచామీతో పాటు శిక్షణ ఇస్తున్న పీఈటీ టీచర్ పి. రాధామణి దీని గురించి మాట్లాడుతూ.. ‘మా పనులన్నీ ముగించుకుని సాయంత్రం మైదానానికి వస్తాం. రాత్రి 9 గంటల వరకు ఉంటాం. మా కలలను సాకారం చేసుకునేందుకు ఇదే సరైన సమయమని మేము బలంగా నమ్ముతున్నాం’ అని అంటున్నారు. నేర్చుకోవాలనుకున్న పట్టుదల, నేర్పించాలన్న ఉత్సాహం ఉన్న వ్యక్తులు వయసుతో సంబంధం లేకుండా విజయాలు సాధిస్తూనే ఉంటారు. అరుచామీ, రాధామణి, 65 మంది మహిళలు ఆ కోవలోని వారే!








కామెంట్‌లు (0)