ఒక తరానికి స్వాతంత్ర్యం అంటే పోరాటం.. మరో తరానికి అభివృద్ధి.. నేటి తరానికి స్వేచ్ఛ. నిర్వచనాలు మారుతున్నా.. ఎనిమిది దశాబ్దాల భారత ప్రయాణంలో మారనిది ఒకటుంది. అదే సామరస్యం. కులం, మతం, ప్రాంతం, భాషల పేరుతో దేశాన్ని విడదీయాలని ప్రయత్నించిన ప్రతిసారీ.. వాటన్నింటినీ దాటి భారతీయులు ఒక్కటిగా నిలిచిన సందర్భాలు ఎన్నో! ఆ ఐక్యతే స్వాతంత్ర్య స్ఫూర్తికి అసలు అర్థం చెబుతోంది.
1947 నాటి విభజన మంటల్లో మనిషిని మనిషి కాపాడటం అంటే ఏమిటో ఎన్నో ఘటనలు చాటిచెప్పాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అప్పటివరకు కలిసిమెలిసి పెరిగిన కుటుంబాలు మతాల వారీగా సరిహద్దులు దాటాల్సి వచ్చింది. దేశం రెండు ముక్కలైంది. మతం పేరుతో హింస చెలరేగింది. అయినా.. ఆ మంటల మధ్య మానవత్వాన్ని కాపాడిన మనుషులు ఎందరో కనిపించారు. సునీల్ చంద్ర ఘోష్ కుటుంబం తూర్పు పాకిస్థాన్ నుంచి భారత్‌కు రావాల్సి వచ్చినప్పుడు.. అల్లర్ల భయంతో ఉన్న ఆ కుటుంబానికి సునీల్ స్నేహితుడు హమీద్ సురక్షితంగా భారత్ చేరేందుకు సహాయం చేశాడు. మరోవైపు లాహోర్‌లో నివసించిన అమర్ కౌర్ కుటుంబాన్ని వారి ముస్లిం పొరుగువారే రక్షించారు. భారత్‌కు చేరిన అమర్ కుటుంబానికి ఇక్కడ ఒక సిక్కు కుటుంబం.. ముస్లిం కుటుంబాన్ని క్షేమంగా సరిహద్దు దాటించడం కనిపించింది. దేశం సరిహద్దులు గీసినా.. మానవత్వం ఆ రేఖలను తుడిపేసిన ఇలాంటి ఘటనలు విభజన సమయంలో అనేకం వెలుగుచూశాయి. ఆ కాలంలోనే కుల్సుమ్ నక్వీ కుటుంబం కోహట్‌లో హింసను ఎదుర్కొన్నప్పుడు.. తమ చుట్టూ ఉన్న ముస్లిం కుటుంబాల ఇళ్లలో ఆశ్రయం పొందింది. ప్రాణాలు కాపాడుకోవాల్సిన ఆ సమయంలో మతం కంటే ముందుగా మానవత్వం కనిపించింది.
అల్లర్ల మధ్యా.. సామరస్యమే!
1992-93 ముంబయి అల్లర్లు నగరాన్ని భయంతో వణికించాయి. మతఘర్షణలు తీవ్ర రూపం దాల్చిన ఆ సమయంలోనూ.. ఒకరినొకరు కాపాడిన మనుషులు ఉన్నారు. హిందువులు అధికంగా ఉండే ప్రాంతంలో నివసించిన ఫిరోజ్ ఖాన్ కుటుంబాన్ని స్థానిక శివసేన నాయకుడు, కార్యకర్తలు అల్లర్ల నుంచి కాపాడిన ఘటన అందుకు ఉదాహరణ. బైకుల్లాలో హనుమాన్ మందిరం, మోతీ మసీదు ఒకే గోడను పంచుకునేవి. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నా.. అక్కడ మాత్రం నమాజ్, హారతి కొనసాగాయి. స్థానిక మొహల్లా కమిటీ ప్రజలను శాంతింపజేయడానికి ప్రయత్నించింది. హిందూ దుకాణదారులు దుకాణాలు తెరవాలని కమిటీ నాయకులు ధైర్యం చెప్పగా.. ఆలయ నిర్వాహకులు తమ ముస్లిం పొరుగువారిపై నమ్మకం ఉందని ప్రకటించారు. ఈ ఉదంతాలపై అప్పటి వార్తాపత్రికల్లో అనేక కథనాలు వచ్చాయి. ఇంకా ఇలాంటి సంఘటనలు ఎన్నో!
మంటల మధ్య మానవత్వం
2002 గుజరాత్ అల్లర్లు దేశం చూసిన మరో భీకర విషాదం. మతం పేరుతో చెలరేగిన హింసలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణలూ కనిపించాయి. వడోదరలో ప్రొఫెసర్ బందూక్‌వాలా ఇంటిపై దాడి జరిగినప్పుడు.. అందులో చిక్కుకున్న ముస్లిం ప్రజలకు పక్కనే ఉన్న హిందూ కుటుంబాలు అండగా నిలిచాయి. దాడి చేసిన గుంపు ఆ ఇంటిని తగలబెట్టేందుకు ప్రయత్నించినా.. తమ ప్రాణాలకు ప్రమాదం ఉన్నప్పటికీ పొరుగువారు వారికి సహాయం చేశారు. ఈ ఘటనను కన్సర్న్డ్ సిటిజన్స్ ట్రిబ్యునల్ నివేదిక కూడా నమోదు చేసింది. ఆనాటి అల్లర్లను గుర్తుచేసుకున్న ప్రతిసారీ.. హింసను మాత్రమే కాదు.. ఆ హింస మధ్య మనిషిని కాపాడేందుకు ముందుకొచ్చిన మనుషులనూ గుర్తు చేసుకుంటుంటాం.
విపత్తుల్లో.. ఒకటైన మనుషులు
సామరస్యం కేవలం మతఘర్షణల సమయంలోనే కనిపించలేదు. విపత్తులు వచ్చిన ప్రతిసారీ భారతీయులు ఒకరికొకరు అండగా నిలవడంలోనూ అది కనిపించింది. 2018 కేరళ వరదల్లో ఇళ్లు, పొలాలు కొట్టుకుపోయాయి. కుటుంబాలకు కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి. ఆ సమయంలో దేశం నలుమూలల నుంచి ఆపన్న హస్తాలు కేరళకు చేరాయి. సహాయం అందించేటప్పుడు కులం ఏమిటి? మతం ఏమిటి? అనే ప్రశ్నలు అడగలేదు. కష్టంలో ఉన్న మనిషిని కాపాడటమే లక్ష్యంగా నిలిచారు.
కోవిడ్ సమయంలోనూ ఇదే మానవత్వం కనిపించింది. వైరస్ భయంతో ప్రపంచం వణికిపోతున్నప్పుడు.. మందులు, ఆహారం, నిత్యావసరాలు అందించేందుకు ఎన్నో చేతులు ముందుకొచ్చాయి. పొరుగువారి తలుపు తట్టి వారి అవసరాలు అడిగినవారూ ఉన్నారు. ఊరంతా ఏకమై ఒకరికొకరు సాయం చేసుకున్న ఘటనలూ ఉన్నాయి. విపత్తు మనల్ని పరీక్షించిన ప్రతిసారీ.. మనలోని మానవత్వం గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. స్వాతంత్ర్యం మనకు హక్కుల కోసం పోరాడటం నేర్పింది.. భిన్నత్వంలో కలిసి నిలబడటం నేర్పింది. స్వాతంత్ర్యం వచ్చాక దేశం ఎన్నో పరీక్షలు ఎదుర్కొంది. మతం, కులం, ప్రాంతం, భాష పేరుతో మనుషుల మధ్య గీతలు గీయాలని అనేక ప్రయత్నాలు జరిగాయి.. జరుగుతున్నాయి. కానీ ప్రతిసారీ ఆ గీతలను చెరిపేస్తూ ఎన్నో చేతులు సామరస్యాన్ని చూపించాయి.
ఎనిమిది దశాబ్దాల భారత ప్రయాణంలో స్వాతంత్ర్యం రూపాలు మారాయి. పోరాటం నుంచి అభివృద్ధికి.. అభివృద్ధి నుంచి స్వేచ్ఛకు నిర్వచనాలు మారాయి. కానీ మనిషి పట్ల మనిషికి ఉండాల్సిన బాధ్యత మాత్రం ఒక్కటే. ఈ స్వాతంత్ర్య దినోత్సవాన జెండా ఎగరేయడంలోనే కాదు.. ఆ జెండా కింద మనుషులంతా సమానమేనని నిరూపించడంలోనూ మన దేశభక్తి కనిపించాలి. కష్టంలో ఉన్నవారికి చేయూతనివ్వాలి. భిన్నంగా ఉన్నవారిని దూరం చేయకుండా.. మనతో పాటు నిలబెట్టుకోవాలి. దేశం ఒక్కటిగా ఉండటమే స్వాతంత్ర్యం కాదు.. దేశంలోని మనుషులంతా ఒకరికొకరు అండగా నిలబడటమే అసలు సిసలు స్వాతంత్ర్యం.
- జ్యోతిర్మయి







కామెంట్‌లు (0)