అంగరంగ వైభవంగా స్వాగత ఏర్పాట్ల మధ్య మండపాల్లో కొలువు తీరటానికి ఎప్పటిలాగానే ఈసారీ విచ్చేశాడు వినాయకుడు. ఏటా తనను ఎంతో భక్తిశ్రద్ధలతో ఆహ్వానిస్తారు. పూజలు చేస్తారు. ఊరేగిస్తారు. చివరికి నిమజ్జనం చేస్తారు. తిరిగి వెళ్లాక భూలోకంలోని విశేషాలు ఏమిటని వివరంగా అడుగుతోంది తల్లి పార్వతి. అందుకని సాధారణ పౌరుడిలా ఐదు రోజులు జనంలో తిరిగి, తాను చూసినవన్నీ డైరీలో రాసుకోవడం మొదలెట్టాడు.
మొదటి రోజు
మండపానికి చేరుకున్న వెంటనే పెద్ద సందడి కనిపించింది. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, బ్యానర్లు, విద్యుద్దీపాలు. కొన్ని చోట్ల తన విగ్రహం కంటే నాయకుల ఫొటోలే పెద్దగా కనిపించాయి. ఒక నాయకుడు వచ్చి వినాయకుడి పాదాల దగ్గర పూలు పెట్టి నమస్కరించాడు. వెంటనే ఫొటోలు, వీడియోలు మొదలయ్యాయి.
“స్వామీ, మా అన్నదానం, పూజాకార్యక్రమాలు విజయవంతం చేయాలి” అని మొక్కుకున్నాడు.
వినాయకుడు చిరునవ్వు నవ్వాడు.
“అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు మంచివే. కానీ మీ ప్రాంతంలోని పేద పిల్లల చదువు, వైద్యం కోసం డబ్బుల్లేని కుటుంబాలు, తాగునీటి కోసం ఎదురుచూస్తున్న ప్రజల కోసం కార్యక్రమాలు ఏమన్నా చేపట్టారా?” అనడిగాడు.
నాయకుడు మౌనంగా ఉండిపోయాడు.
ఆ రాత్రి డైరీలో వినాయకుడు రాశాడు: “నన్ను పూజించడానికి ఏర్పాట్లు ఘనంగా ఉన్నాయి. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి.”
రెండో రోజు
మండపం బయట ఓ యువకుడు చేతిలో ఫైలు పట్టుకుని కనిపించాడు. సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు, ఉద్యోగ దరఖాస్తులు అందులో ఉన్నాయి. ముఖంలో మాత్రం ఉత్సాహం లేదు. ఇంజినీరింగ్ పూర్తిచేసినా ఉద్యోగం దొరకలేదు. కొద్దిదూరంలో మరో యువకుడు మొబైల్‌లో ఉద్యోగ ప్రకటనలు చూస్తున్నాడు. మండపం నుంచి భక్తి గీతాలు వినిపిస్తుండగా, ఆ యువకులు మాత్రం తమ భవిష్యత్తు కోసం వెతుకుతున్నారు. ఆ రోజు డైరీలో వినాయకుడు రాశాడు: “యువత నా దగ్గర అద్భుతం కోరడం లేదు. తమ చదువుకు తగిన అవకాశం మాత్రమే కోరుతున్నారు. ఆ అవకాశం కల్పించాల్సిన వ్యవస్థ మాత్రం నా విగ్రహం ముందు కొబ్బరికాయలు కొడుతోంది. నన్ను పూజించటమే గొప్ప దేశోద్ధరణగా ప్రచారం చేసుకుంటోంది.”
మూడో రోజు
వినాయకుడే స్వయంగా వెళ్లి ఓ రైతును కలిశాడు. అతడి చేతులకు మట్టి అంటుకుని ఉంది. కళ్లలో నిద్రలేని అలసట. మాట్లాడాడు. అతని కోరిక ఒక్కటే! పంట బాగా పండాలి, పండిన పంటకు న్యాయమైన ధర రావాలి, అప్పులు తీరాలి. రైతు కష్టాన్ని చూసిన వినాయకుడు మార్కెట్ వైపు వెళ్లాడు. రైతు అమ్మే ధరకు, వినియోగదారుడు కొనే ధరకు మధ్య ఉన్న అంతరాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. పంట పండించేవాడికి లాభం తక్కువ. కొనేవాడికి భారం ఎక్కువ. మధ్యలో మాత్రం ఎన్నో దశలు!ఎవరెవరికో లాభాలు...!
ఆ రాత్రి డైరీలో రాశాడు: “రైతు ప్రకృతితో పోరాడుతున్నాడు. మార్కెట్‌తో పోరాడుతున్నాడు. అప్పుతో పోరాడుతున్నాడు. అయినా అతని కోరిక మాత్రం చిన్నదే... తన కష్టానికి తగిన విలువ. ఎన్నేళ్లు గడుస్తున్నా ఇదే చక్రం నడుస్తోంది. అన్నదాతకు ఆసరా లేకపోవడం అత్యంత దారుణం.”
నాలుగో రోజు
దేశ రాజధాని నగరంలో పెద్ద సదస్సు జరుగుతోంది. రోడ్లు ధగధగా మెరుస్తున్నాయి. విద్యుద్దీపాలు, పూల కుండీలు... నిలువెత్తు బ్యానర్ల మీద నవ్వులు చిలకరిస్తున్న నాయకులు... నగరం కొత్త పెళ్లికూతురిలా తయారై ఉంది. సంగతి ఏమిటని అడిగితే, “బ్రిక్స్ సదస్సు స్వామీ. ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు వస్తున్నారు” అని ఓ అధికారి చెప్పాడు. వినాయకుడు కొద్దిదూరం వెళ్లాడు. రోడ్డు పక్కన చిన్న చిన్న గుడిసెల వరుస. ఆ రోడ్డుమీద వెళ్లేవారికి ఆ ఇళ్లు, అక్కడి మనుషులు కనపడకుండా అడ్డంగా పెద్ద పెద్ద తెరలు కట్టారు. వినాయకుడు ఆ తెరను దాటి లోపలికి వెళ్లాడు. దిగాలుగా ముఖాలు వేసుకొని కొంతమంది పిల్లలు, వారి తల్లులు కనిపించారు.
అక్కడే ఓ చిన్నారి అడిగాడు: “మమ్మల్ని ఇలా ఎందుకు దాచి పెట్టారు?” అని.
ఆ ప్రశ్నకు వినాయకుడి దగ్గర సమాధానం లేదు.
ఓ తల్లి చెప్పింది: “తెర వేస్తే మనం కనిపించం. మన ఇరుకు మురికి ఇళ్లు కనిపించవు. మొత్తంగా మన బతుకులు కనిపించవు. అందుకే.”
“మనల్ని ఇలా కనిపించకుండా చేసే బదులు బాగా కనిపించేలా చేయొచ్చు కదా?” అనడిగాడు పిల్లాడు.
“దానికన్నా ఇలా దాచిపెట్టటం వాళ్లకి సులువుగా ఉంటుంది కాబోలు” అందామె నిరాశగా.
వారి మాటలు వినాయకుడి మనసును కలచివేశాయి. ఆ రాత్రి డైరీలో రాశాడు: “నగరాన్ని అందంగా చూపించడానికి తెరలు వేశారు. కానీ ఆ తెరల వెనుక దాచింది మురికివాడ కాదు. అభివృద్ధి ఎంత మందిని వెనక్కి వదిలేసిందో కనిపించకుండా చేశారు. ప్రపంచ నాయకులు నగరాన్ని చూడడం, చూడకపోవడం సమస్య కాదు. ఇక్కడి పాలకులు తమ ప్రజలను చూడకపోవడమే అసలు సమస్య.”
డైరీ చివర్లో మరో వాక్యం రాశాడు: “విదేశీయుల కళ్లకు కనిపించకుండా తెర వేయగలరు. కానీ ఆ పిల్లవాడి ప్రశ్నకు మాత్రం ఏ తెర వేయగలరు?” అని.
ఐదో రోజు
నిమజ్జనానికి ఏర్పాట్లు మొదలయ్యాయి.
డీజేలు, నృత్యాలు, నినాదాలు, పూల వర్షం. తనను మోసుకెళ్లడానికి సిద్ధమవుతుండగా ఓ చిన్న పిల్లవాడు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు.
“అందరూ నీ దగ్గర ఏదో అడుగుతున్నారు. నువ్వు మాత్రం ఎవరి దగ్గరా ఏమీ అడగడం లేదు” అనడిగాడు.
వినాయకుడు నవ్వాడు.
“నాకు ఒకటే కావాలి. మీరు నన్ను పూజించినట్టే మీ చుట్టూ ఉన్న మనుషుల జీవితాలను కూడా గౌరవించాలి.”
ఊరేగింపు మొదలైంది. నది వైపు కదులుతూ వినాయకుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. నాయకుడు కనిపించాడు.
“ఐదు రోజులు జనం మధ్య తిరిగాను. వారి సమస్యలు చూశాను. విన్నాను. ఇప్పుడు నన్ను నీటిలో కలిపేసి, సమస్యలను మాత్రం అలాగే ఉంచితే వచ్చే ఏడాది మళ్లీ ఇదే కథ కదా!”
ఉత్సవాన్ని ఆడంబరంగా చేయిస్తున్న నాయకుడు మౌనంగా ఉన్నాడు. మాట్లాడలేదు.
వినాయకుడే మళ్లీ మాట్లాడాడు.
“రైతు ధర అడిగితే వినండి. యువకుడు ఉద్యోగం అడిగితే వినండి. ఒక కుటుంబం విద్య, వైద్యం, ఇల్లు, ఉపాధి కోసం పోరాడుతుంటే చూడండి. రోడ్డుపక్కన గుడిసెలో నివసించే మనిషిని తెర వెనుక దాచాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో ఆలోచించండి. ప్రశ్నించేవారిపై తిరిగి నిందలు వేయడం కాదు. వాళ్ల ప్రశ్నలను, బాధలను అణచేయడం కాదు. ఆలకించండి. ఆలకిస్తే అర్థమవుతుంది. అర్థమైతే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది...”
వినాయకుడి మాటలు కొనసాగుతూనే ఉన్నాయి. డీజే సౌండు పెంచాడు నాయకుడు. ఉత్సవ ఉత్సాహ వాతావరణం ఉవ్వెత్తున పెరిగింది. వినాయకుడి మాటలు ఆ గుండెలదిరే సౌండులో కలిసిపోయాయి.
నిమజ్జనం ఘనంగా మొదలైంది!
నీటిలోకి వెళ్లే ముందు వినాయకుడు తన డైరీ చివరి పేజీ తెరిచాడు.
“ఈ ఐదు రోజులూ నన్ను దేవుడిగా పూజించినవాళ్లను చూశాను. తమ జీవితాలను గౌరవంగా నిలబెట్టుకోవడానికి పోరాడుతున్న మనుషులను చూశాను. పెద్ద పెద్ద సదస్సుల కోసం నగరాన్ని అలంకరించడం చూశాను. అదే నగరంలో పేదరికాన్ని తెరల వెనుక దాచడం చూశాను. నగరాన్ని నిజంగా అందంగా మార్చాలంటే తెరల వెనుక ఉన్న మనుషులను బయటకు తీసుకురావాలి. వాళ్ల జీవితాలను మార్చాలి. అప్పుడే నన్ను నిజంగా పూజించినట్టవుతుంది.”
తరువాత కొద్ది నిముషాల్లో వినాయకుడు నీటిలో కలిసిపోయాడు.
నాయకుడు మాత్రం లడ్డూల పంపిణీ, ఫొటోలు, ప్రచారం వల్ల వచ్చే ఎన్నికల్లో తనకు ఎన్ని ఓట్లు వస్తాయో లెక్కలు వేసుకోవడంలో మునిగిపోయాడు!
- సత్యాజీ







కామెంట్‌లు (0)