సోమవారం, 14 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ధర్మాగ్రహ స్వరం, ప్రజాపక్ష గళం

4 గంటల క్రితం

nalli
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 14, 2026, 04:00 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

నల్లి ధర్మారావు పాటల సంపుటానికి ముందుమాట రాయడం నాకు చాలా సంతోషంగా ఉంది. దాదాపు నలభై ఏళ్ల కిందట ప్రజాశక్తిలో ఆయన పాటలను, కవితలను ప్రచురించడం మొదలు పెట్టినప్పటి నుంచీ - ఇప్పుడు మోటూరు హనుమంతరావు స్మారక పురస్కార కమిటీలో ఉత్తమ జర్నలిస్టుల కథనాల ఎంపిక కమిటీ వరకూ ఆయనను చూస్తున్నాను. విషయాన్ని పాటగా మలిచేందుకు, పదాల ప్రాసతో ఆకర్షించేందుకు చాలామంది ప్రయత్నిస్తారు గానీ, వారిలో కొద్దిమంది మాత్రమే భావ బలాన్ని, పదామృత ఫలాన్ని సమపాళ్లలో రంగరించి, రాగయుక్తంగా ఉత్తేజభరితంగా ప్రజా గీతాలు అందించగలరు. ఆ కోవలో ఈ కాలంలో ముందు పీఠిన వుంటాడు మిత్రుడు ధర్మారావు.

ఉపన్యాసాలలోనూ, వ్యాఖ్యానంలోనూ తక్కువ సమయంలో ప్రగాఢ భావం చేరవేయడానికి పాటను మించిన భావసాధనం లేదు. నా దైనందిన వ్యాఖ్యానాలలో, దశాబ్దాల ప్రసంగాలలో నిరంతరం వేమననూ, శ్రీశ్రీనీ, గురజాడనూ కోట్ చేస్తుంటానని మిత్రులందరికీ తెలుసు. అది పాండిత్య ప్రకర్ష కోసం కాదు. పని తగ్గించుకోవడానికీ, పదునుగా చెప్పడానికీ మాత్రమే. ఆ కవులు, పాటగాళ్లకు మనం ఎంత కృతజ్ఞత చెప్పుకున్నా తక్కువే. అలా ఎక్కువగా ఉటంకించే వాళ్లలో నల్లి ధర్మారావు ఒకరని సన్నిహిత మిత్రులకూ, ప్రజా కళాకారులకూ తెలుసు.​

'దేశ రాజధాని నొసట చెరగని నెత్తుటి తిలకం హష్మీ

భావిస్వర భాస్వరాన్ని మండించే సూర్యరశ్మి హష్మీ'

​1988 ముగిసిపోతున్న సమయంలో దేశ రాజధాని పరిసరాల్లో, హల్లా బోల్ వీధి నాటిక ప్రదర్శిస్తున్న సఫ్దర్ హష్మీని యజమానుల గూండాలు దారుణంగా హత్య చేసిన ఘటన దేశాన్ని కుదిపేసింది. ఎవరో అన్నట్టు కల్హణుడు, కాళిదాసు నడయాడిన ఉజ్జయిని వంటి చోట కిరాయి మూకలు ఒక కళాకారున్ని బలిగొనడంపై జరిగిన సభలన్నిటిలోనూ ఈ పల్లవి చెప్పేవాణ్ణి. హష్మీ బలిదానం తర్వాత కొద్ది కాలంలోనే మతశక్తుల పెరుగుదల, అధికార పీఠాలను ఆక్రమించడం కొత్త పరిస్థితిని సృష్టించింది.

​'ముంచుకొస్తున్నాది మతోన్మాద గండం

ముందుకొచ్చి ఆపండి అందరికీ దండం'

'హిందూ, ముస్లిం, క్రైస్తవుడు

ఎవరైతేనేం మానవుడే

జీవన సమరపు గమనంలో

అలుపు ఎరగని యాత్రికుడే'

టీవీలలో నా రోజువారి విశ్లేషణలు వినే వారంతా, ఎప్పుడో ఒకసారి ఈ పల్లవులు ఆలకించి ఉంటారు. బాబరీ మసీదు విధ్వంసం తరువాత ఆయన వాక్యాలు-

​'మసిబారిన చెక్కిలి పై జారుతున్న కన్నీరు

మన యదలో సృష్టించెను ఎన్నో ప్రశ్నల హోరు..'

​ఆ ప్రశ్న ఇప్పుడు విశ్వరూపం దాల్చిందని అందరూ గుర్తిస్తున్నారు. ప్రత్యమ్నాయం కోసం అనేకులు అన్వేషిస్తున్నారు కూడా.

​సందర్భోచితంగా, సత్వరంగా.. అయినా అర్థవంతంగా ఆర్ధ్రతా స్వరంతో రాయడం ధర్మారావు ప్రత్యేకత. ఈ సంపుటిలో డజన్ల పాటలు మతతత్వంపై పోరాటం, మతసామరస్యం ఆవశ్యకత గురించి చెబుతున్నాయంటే, ఆయన ఈనాడు దేశం ముందున్న ప్రమాదమేంటో చక్కగా గ్రహించి అక్షర రూపం ఇచ్చారన్నమాట. ఇదే తరహాలో యుద్ధం, శాంతి, ఉగ్రవాదం, అవినీతి, ఉద్యోగులు, కార్మికుల సమస్యలు, అణగారిన తరగతులు, ప్రజలు మరీ ముఖ్యంగా దళిత గిరిజన వర్గాలపై ఆయన ప్రత్యక్ష జీవితానుభవంతోనూ, నిజమైన సంఘీభావంతోనూ రాశారు. గనకనే శక్తివంతంగా రూపొందాయి. వివక్షతలనూ, అసమానతలనూ కొద్ది పదాలలోనే గట్టిగా చెప్పగలరు. ​దేవేంద్ర, ధర్మారావు, అంతకు ముందు కాలంలో వడ్లమూడి నాగేశ్వరరావు ఇంకా కొందరు ప్రజానాట్యమండలి ప్రజాస్థాన కవులు. ఎన్నికలు, ఉద్యమాలు, యాత్రలు ఏవి వచ్చినా ఇలాటి ప్రజాకవులు వర్క్ షాప్‌లకు వెళ్లి తమతో పాటు మరో 10 మందితో రాయించి ప్రజా గీతాలను పరిపుష్టం చేస్తూ వచ్చారు. అంత సంఖ్యలో పాటలు రాయకపోయినా, ఆ జాబితాలో నాకూ కొంత చోటుంది. ఇలా సందర్భం ఏదైనా ముందు మాకే తాఖీదు వచ్చేది.

నల్లి ధర్మారావు కేవలం పాటలు రాసే వ్యక్తి మాత్రమే కాదు. చాలాకాలం ప్రజాశక్తి విలేకరిగా విధులు నిర్వహించారు. తరువాత కూడా పత్రిక రంగంలోనూ, సంఘాలలోనూ క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నాయకుడు. ఆయన లేకుండా ఉత్తరాంధ్రలో సాహిత్య పరంగా, జర్నలిస్టుల పరంగా సభలు జరగడం అరుదు.

​నా వరకు నాకు ఆయన పాటలన్నిటిలోకి బాగా ఇష్టమైంది సుందరయ్య గారి మీద రాసింది.

​'జోహారు జోహారు

మా సుందరయ్య

నీవంటి త్యాగధనులు

విశ్వంలో ఎందరయ్య

స్వార్థము నీవెరుగవు ప్రకృతిలా పసిపాపలా

కల్మషమే ఎరుగవు

కాంతిలా కనుపాపలా

స్వచ్ఛము నీ జీవితం

హిమములా సుమములా

మహోన్నతం నీ త్యాగం

అరుణారుణ పతాకంలా'

​సుందరయ్య గారి త్యాగాన్ని అరుణారుణ పతాకంతో పోల్చడం గొప్ప సృజన. అరుణ పతాకమంటేనే త్యాగాలకు మారు పేరన్న భావన అందులో అంతర్లీనంగా ఉంది. సుందరయ్య గారితో పాటు ఎందరో అమరనేతలపైన, నేలకొరిగిన ప్రజా యోధుల పైన, సాహసికులైన సామాన్యుల పైన ధర్మారావు పదునైన పాటలు కట్టారు. అది ఆయన రచనా పటిమనే కాదు. ఉద్యమాలతో మమేకతను కూడా చెబుతుంది. నాటి, నేటి రైతాంగ పోరాటాల నుంచి ఉక్కు ఉద్యమం దాకా ఏ అంశం పైనా ఆయన స్పందించకుండా వుండలేదు. వాటిలో ఉటంకించాల్సినవి చాలా ఉన్నాయి. 2015లో విశాఖలో సిపిఎం జాతీయ మహాసభల కోసం పాటలు సిద్ధం చేసినప్పుడు ధర్మారావు-

​'పద పద పద పద కామ్రేడా

పదాతి దళమై కామ్రేడా' ​అని ఉత్తేజకరమైన గీతం రాశారు. పదాల పోహళింపు, రాగం దెబ్బ తినకుండా రాజకీయ సందేశం, సామాజిక వాస్తవికత, బాధాతప్త జీవిత సమర సందేశం కలగలిపిన కవనం ఈ పాటలకు ప్రాణం. వీటిని చూడగానే మీకు సభల్లో విన్న పాటలెన్నో మదిలో మెదులుతాయి. ఉత్తరాంధ్ర ఉజ్వల వారసులైన సుబ్బారావు పాణిగ్రహి, వంగపండు ప్రసాదరావుల నుంచి గంటేడ గౌరునాయుడు, సన్యాసిరావు దాకా ఉత్తమ వారసత్వాన్ని, వీరతత్వాన్ని పుణికి పుచ్చుకున్న స్వరం నల్లి ధర్మారావు.

​'ఏ సంధ్య వెలుగుల్లో

సమరభేరి మోగిందో

గాయపడిన చరణాలతో

పాట దారి సాగిందో'

​పాత్రికేయులుగా వుండి కవితలు రాసిన వారు అనేకులున్నారు. గానీ, పాటలు కట్టి నిలబెట్టినవారు తక్కువ. అలాంటి ఆయన పాటల సంపుటి వెలువడుతున్న సమయంలో, మరోసారి నల్లి ధర్మారావును అభినందిస్తూ, ఆయన నుంచి మరిన్ని మంచి గీతాలు వెలువడాలని ఆశిస్తున్నాను.

('మౌనమిప్పుడు పగిలిపోనీ' పాటల సంపుటం - ముందు మాట. ఈ పుస్తకం విశాలాంధ్ర పుస్తక షాపుల్లో లభ్యం.)

​- తెలకపల్లి రవి


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్