సోమవారం, 14 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జ్ఞాపకాల దారిలో జీవిత సత్యాలు "బ్యాక్ లాగ్స్"

4 గంటల క్రితం

backlogs
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 14, 2026, 04:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

కాలం కరిగిపోయినా చెరిగిపోని జ్ఞాపకాల పుస్తకమే జీవితం. అలాంటి మధురమైన కాలమే కాలేజీ రోజులు. ఆ సన్నివేశాలను, మనసుదోచే పలుకులను రచయిత విజయ్ అప్పల్ల రాసిన "బ్యాక్ లాగ్స్" నవలలో చూడవచ్చు. ఈ నవల బాల్యపు చివరి అంచుల నుంచి యవ్వనపు ఉత్సాహం వైపు సాగిన ప్రయాణంలా ఉంటుంది. పాత ఫోటో చూసినప్పుడు పెదవులపై వచ్చే చిరునవ్వు వెనుక కథలా ఈ నవల నిలుస్తుంది. ఇందులోని పాత్రలు కాలేజీ మిత్రులను తలపిస్తాయి, సంఘటనలు మన జీవితంలో జరిగినట్టే అనిపిస్తాయి.

కాలేజీ నేపథ్యంతో కథలోకి పాఠకులను నడిపించిన రచయిత, కథానాయకుడు విక్రమ్ బాల్యంలో ఎదుర్కొన్న పరిస్థితులను కూడా కళ్లకు కట్టినట్లు రాశారు. కాలేజీ జ్ఞాపకాల నుంచి వాస్తవ జీవితంలోకి తిరిగి వచ్చిన సందర్భంలో "కొన్ని తలుపులు మళ్లీ తెరవకూడదు. కొన్ని తెరవకపోతే జీవితము ముందుకు వెళ్ళదు." అంటూ గతం నుంచి బయటపడి ముందుకు సాగాల్సిన అవసరాన్ని చెబుతారు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న విక్రమ్ మిత్రులను కలవడానికి ఇండియా వస్తాడు. మరో స్నేహితుడితో కలిసి పూర్వ విద్యార్థుల కలయికలో పాల్గొని పాత జ్ఞాపకాలను పంచుకుంటాడు. సీనియర్, జూనియర్ల మధ్య గొడవలు, క్రికెట్ టోర్నమెంట్లు, గ్రూపులుగా విడిపోవడం, కలహాలు కాలేజీ జీవితానికి సహజ ప్రతిబింబంగా కనిపిస్తాయి. సీనియర్లతో గొడవలను సమయస్ఫూర్తితో ఎదుర్కొన్న తీరు, చివరికి రాజీ పడిన విధానం ఆసక్తికరంగా మలిచారు. జీవితంలో ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని, ముఖ్యంగా అకస్మాత్తుగా జీవితంలోకి వచ్చేవారిని నమ్మకూడదని సూచిస్తారు. తరగతి గదిలో విద్యార్థులకు ఇచ్చే సలహాలు కూడా ఆకట్టుకుంటాయి. "చదువులో మీ తలరాతలను మీరే దిద్దుకోండి" అంటూ యువతకు సందేశం ఇస్తారు.

నవలలో జీవితాన్ని ఆలోచింపజేసే వాక్యాలు అనేకం ఉన్నాయి. "జీవితం ముందుకెళ్లింది, మనసు మాత్రం అక్కడే ఆగిపోయింది." "గతం ఒక పాఠం, వర్తమానం ఒక అవకాశం, భవిష్యత్తు ఒక ప్రేరణ." "కొన్ని ప్రశ్నలకు సమాధానం కాలమే చెబుతుంది. అంతవరకు వేచి ఉండడం కూడా ఒక అందమైన అనుభూతే!" అంటూ గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి చెబుతారు. నవల శీర్షికకు తగినట్లుగా "కొన్ని బ్యాక్ లాగ్స్ ఎప్పటికీ తీరవు. గతంలోనివి కొన్ని తవ్వకూడదు, కొన్ని సమాధి చేయడానికి ప్రయత్నించకూడదు, మరికొన్ని పట్టుకొని ఉండకూడదు. గతాన్ని పట్టుకుని వేలాడితే వర్తమానాన్ని అనుభవించలేం. వర్తమానం మళ్లీ గతమవుతుందన్న విషయాన్ని వర్తమానంలో మర్చిపోతాం. బ్యాక్ లాగ్స్ ఎప్పుడూ బ్యాక్ లాగ్స్ లాగానే ఉండిపోతాయి." అని చెబుతారు. చదువును నిర్లక్ష్యం చేసిన కథానాయకుడు జీవితంలో ఎదురైన మలుపులతో చదువుపై దృష్టి పెట్టడం కనిపిస్తుంది. విక్రమ్ పాత్రను యువతకు స్ఫూర్తినిచ్చేలా తీర్చిదిద్దారు. "ఎవరైనా సాధించగలరు, కానీ సాధించేదాకా నమ్మకం వదలకుండా ఉండగలిగిన వాళ్లు కొందరే! ఇచ్చిన మాట మరువకూడదు, మళ్లీ వెనక్కి తీసుకోకూడదు. ఇదే మనిషి నిజమైన ఆభరణం." అంటారు.

పీకే, నీలిమ, జ్యోతి, భూమిక, లక్ష్మి పాత్రల చుట్టూ కథ నడుస్తోంది. ఒక్కొక్కరి వ్యక్తిత్వాన్ని చూపడంతో పాటు తనకు జరిగే అవమానాలను, వాటిని కథానాయకుడు ఎదుర్కొనే తీరును రచయిత ఆవిష్కరించారు. "తెలివిగా చెప్పిన మాట, కోపంతో కొట్టిన దెబ్బ కంటే ఎక్కువ గుచ్చుకుంటుంది." "ఒక్కొక్కసారి ప్రపంచం మాట వినడం కష్టమేమీ కాదు, కానీ మనసు చెప్పే మాట వినడమే నిజమైన సవాలు." అనే వాక్యం వ్యక్తిగత నిర్ణయాల ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. "ఎందుకంటే మనస్ఫూర్తిగా లేని బంధం, విరిగిన అద్దం లాంటిది; గాయపరచడం తప్ప ఇంకేం చేయదు." అంటూ బంధాల్లోని అవగాహనా లోపాలను చూపించారు.

"గెలిచినవాడు కథ అవుతాడు, ఓడినవాడు పాఠం అవుతాడు, నిలిచిన వాడు మాత్రమే ప్రేరణ అవుతాడు. జీవితం అలాగే ఉంటుంది; మనం తలుపు తెరిచినా తలుపు వెనక మరో వంద తలుపులు ఉంటాయి. అన్ని తెరవాలా వద్దా అని కాదు ప్రశ్న. తెరిచాక తట్టుకోగలమా అనేదే అసలైన ప్రశ్న!" అనే వాక్యం జీవిత పరిణామాలను స్వీకరించే ధైర్యాన్ని చెబుతుంది. ప్రేమ విఫలమైనప్పుడు కుంగిపోకుండా మరో దారి ఎంచుకోవడం, ప్రతి ముగింపును కొత్త ఆరంభంగా చూడడం నవలలో కనిపిస్తుంది. కథానాయకుడు విక్రమ్ విద్యార్థులకు ఇచ్చిన ఉపన్యాసంలో ప్రేమను ఆకర్షణగా కాక పవిత్రమైన బంధంగా వివరిస్తాడు. ప్రేమ వైఫల్యమా, విజయమా అన్నది మనసులోనే ఉంటుందని, ప్రతి ఆరంభానికి అంతం ఉంటుందని చెబుతారు. "ప్రేమిస్తే చెప్పి తీరాలి, చెప్పని ప్రేమ అందమైన ప్రేమలేఖ లాంటిది." అంటారు. తన జీవితంలో ఏర్పడ్డ వెలితులను ఒక్కొక్కటిగా గుర్తించి, పరిష్కరించుకుంటూ విక్రమ్ ముందుకు సాగుతాడు. ఆ క్రమాన్ని తెలుసుకోవాలంటే ఈ నవలను చదవాల్సిందే. లక్ష్మి, విక్రమ్ కలయికతో నవల సుఖాంతమవుతుంది.

విజయ్ అప్పల్ల నవలల్లో ప్రతి రచన ఒక ప్రయోగంలా కనిపిస్తుంది. "బ్యాక్ లాగ్స్"లో కాలేజీ జ్ఞాపకాలు, ప్రేమ, కుటుంబ బంధాలు, వ్యక్తిగత సంఘర్షణలు, జీవిత సత్యాలను ఒకే కథనంలో మేళవించారు. "మనల్ని కొందరు వదిలి పోయినా జ్ఞాపకాలలో జీవిస్తూనే ఉంటారు. కొన్నిసార్లు వెచ్చని స్పర్శలా, కొన్నిసార్లు నిద్రపోనివ్వని నీడలా..." అనే వాక్యంతో జ్ఞాపకాల ప్రభావాన్ని ప్రతిబింబించారు. "జీవితం పరీక్ష కాదు, ప్రయాణం." అనే భావంతో నవల ముగుస్తుంది. చక్కటి నవలను అందించిన విజయ్ అప్పల్లకు అభినందనలు.

- అరుణ సందడి

99498 05100



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్