బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కార్మికుల ఆందోళనల్లో పాల్గొనడమే ఆమె తప్పా?

1 గంట క్రితం

protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 03:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

జీతాలు పెంచాలని, 8 గంటల పని దినం అమలు చేయాలని ఈ ఏడాది నోయిడా కార్మికులు పోరుబాట పడితే వారి తరఫున ఆమె నిలబడింది. అదే ఆమె చేసిన తప్పు. యుపి ప్రభుత్వం ఆమెను బెయిల్ కూడా రాని చట్టం (ఎన్ఎస్‌ఎ జాతీయ భద్రతా చట్టం) కింద అక్రమ కేసులు మోపి జైల్లో నిర్బంధించింది. ఐదు నెలలుగా జైల్లో ఉన్నా ఆమె భయపడలేదు. అక్కడ ఖైదీలకు చదువు చెబుతూ వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె పేరు ఆకృతి చౌదరి.

ఆకృతి చౌదరి కుటుంబం పశ్చిమ బెంగాల్‌లో దుర్గాపూర్‌లో నివాసముంటోంది. ఆకృతి సామాజిక అంశాల్లోనే కాదు, చదువులోనూ మెరిట్‌గానే ఉంది. పదో తరగతిలో 95 శాతం, ఇంటర్‌లో 97 శాతం మార్కులు సాధించింది. ఢిల్లీ యూనివర్సిటీలోని దౌలత్ రామ్ కాలేజీ నుండి చరిత్రలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది. పిహెచ్‌డీ కోసం రాసిన నెట్ పరీక్షలోనూ ఉత్తీర్ణురాలైంది. తనకు కళలంటే ఆసక్తి. సఫ్దర్ హష్మీ, జర్మన్ నాటక రచయిత బెర్టోల్ట్ బ్రెచ్ట్ రచనల ఆధారంగా రూపొందించిన నాటకాలు, వీధి నాటకాల ప్రదర్శనలిచ్చింది. ప్రస్తుతం న్యాయవిద్యను అభ్యసిస్తోంది. ఆకృతికి మొదటినుంచి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది. ‘పేద, అణగారిన వర్గాలకి సేవ చేయాలని ఆకృతికి ఉన్న అంకితభావం పట్ల మేమెంతో గర్విస్తున్నాము. నా కూతురు ఎంతో ప్రతిభావంతురాలైన విద్యార్థి. దౌలత్ రామ్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడే తను అంగన్వాడీ కేంద్రాల్లో స్వచ్ఛంద సేవ చేసింది. అంగన్వాడీ కార్మికుల సమస్యల్ని తెలుసుకుని వారికి మద్దతుగా నిలిచింది. అక్కడ పిల్లలకు పాఠాలు సైతం చెప్పింది. నెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. తను డాక్టోరల్ ప్రోగ్రామ్‌లో చేరేలోపే అరెస్టయింది. ప్రస్తుతం తను ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయ విద్యను కొనసాగించేందుకు ప్లాన్ చేసుకుంటోంది. తను సామాజిక సేవ చేయడానికి, ఆర్టిస్ట్‌గా రాణించడానికి కుటుంబం ఎప్పుడూ మద్దతుగా ఉంటుంది’ అని ఆకృతి తండ్రి అరుణ్ చౌదరి చెప్పారు.

కాగా, ఏప్రిల్ 13న జరిగిన నోయిడా కార్మికుల ఆందోళనల్లో హింసను ప్రేరేపించిందని ఆరోపిస్తూ పోలీసులు ఆమెను ఏప్రిల్ 11న అరెస్టు చేశారు. ఇదెంత పచ్చి అబద్ధమో దీన్నిబట్టే తెలుస్తోంది. దీనిపై తండ్రి అరుణ్‌ మాట్లాడుతూ, ‘పోలీసులు నా కుమార్తె పరువు తీశారు. ఏప్రిల్ 24న నోయిడా పోలీసుల బృందం ఢిల్లీలో ఉంటున్న నా కూతురు నివాసానికి వెళ్లి పొరుగున్నవారితో ‘ఆకృతికి పాకిస్థాన్‌తో సంబంధాలున్నాయని, నేరస్తురాలని, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నదని చెప్పారు. నా కూతురు స్ట్రాంగ్‌గా నిలబడింది. పోలీసులు ఇచ్చిన ఖాళీ కాగితాలపై సంతకం చేయడానికి కూడా నిరాకరించింది. జైల్లోనే తనని చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నా కూతురు తన తోటి ఖైదీ సృష్టి గుప్తాతో కలిసి జైల్లోని ఖైదీలకు, జైలు సిబ్బంది పిల్లలకు పాఠాలు బోధిస్తోంది. సృష్టి గుప్తా కూడా నోయిడా కార్మికుల నిరసనల్లో పాల్గొన్నందుకు తనపై 11 కేసులు నమోదయ్యి జైల్లోనే ఉంది.’ అని అన్నారు. ఆకృతి తల్లి పింకీదేవి మాట్లాడుతూ... ‘మా కుటుంబం దేశ సేవలో ఉంది. మా సన్నిహితులు, దూరపు బంధువులు చాలామంది ఆర్మీ సిఆర్‌పిఎఫ్ సైన్యంలో ఉన్నారు. నా కూతురు ఎంచుకున్న మార్గం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఆకృతి సోదరుడు ఎన్ఐటి దుర్గాపూర్ నుండి ఇంజనీరింగ్ చేశాడు. చెన్నైలో ఒక ప్రముఖ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నాడు.’ అని అన్నారు.

ఏం జరిగింది?

హర్యానా ప్రభుత్వంలాగే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా జీతాలు పెంచాలని, 12 గంటలు పని కాకుండా 8 గంటల దినాల కోసం నోయిడా కార్మికులు నిరసనలు చేపట్టారు. కార్మికుల సమ్మెకు మద్దతుగా నిరసనలకు ముందు జరిగిన ఒక ప్రదర్శనలో ఆకృతి పాల్గొని మాట్లాడింది. అయితే ఏప్రిల్ 13న జరిగిన నిరసనల్లో ఆమె పాల్గొన్నదని, పోలీసులపై రాళ్లు రువ్వమని చెబుతున్న అబద్ధపు వీడియోను పోలీసులు సాక్ష్యంగా చూపి క్రిమినల్ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈమెతోపాటు కార్మికవర్గ పత్రికగా ఉన్న ‘మజ్దూర్ బిగుల్’ పాత్రికేయుడు సత్యం వర్మపైనా ఎన్ఎస్‌ఎ కింద అభియోగాలు మోపి అరెస్టు చేశారు. సెప్టెంబర్ 2వ తేదీన అలహాబాద్ కోర్టు ఆకృతి కేసుపై సంచలన తీర్పునిచ్చింది. ఆమెను జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని, అబద్ధపు సాక్ష్యాధారాలు చూపినందుకు నోయిడా కలెక్టర్‌నే ఆమెకు తిరిగి ఐదు లక్షలు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు స్వాగతించదగినదే కానీ... ఒక పౌరురాలు కార్మికుల హక్కుల కోసం గళమెత్తినందుకు ఆమెపై కేసులు మోపి, జైలులో నిర్బంధించటం అత్యంత దారుణం. ఆకృతి జైలు నుంచి విడుదల కావడం ఒక్కటే సరిపోదు. చట్టాన్ని దుర్వినియోగం చేసిన వారిపై, పోలీసులను ఆ విషయంగా ఉసిగొలిపిన వారిపై చర్యలు తీసుకోవాలి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్