బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అడ్డా కూలీలుగా రైతులు..!

48 నిమిషాల క్రితం

drought
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 04:15 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

పాలమూరు తీరుగా మారిన కర్నూలు జిల్లా రైతన్నల బతుకులు ఈరోజు దయనీయ స్థితికి చేరుకున్నాయి. ఒకప్పుడు నలుగురికి అన్నం పెట్టిన చేతులు, నేడు కూలి పని కోసం కర్నూలు నగర వీధుల్లో ఆశగా ఎదురుచూడాల్సిన దుస్థితి దాపురించింది. వర్షాభావం, ప్రకృతి వైపరీత్యాలు, అప్పుల ఊబి... అన్నీ కలిసి వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులతో పాటు కౌలురైతుల నడుము విరిచాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ సైతం రైతన్నల ఆశలపై కోలుకోలేని దెబ్బకొట్టింది. ఈ నేపథ్యంలో ఎ.పి రైతుసంఘం నిర్వహించిన కరువు పర్యటనలో ఎన్నో కఠోర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

రాయలసీమకు ముఖద్వారమైన కర్నూలు జిల్లాలో వర్షాభావ పరిస్థితులు తీవ్ర కరువును సృష్టిస్తున్నాయి. ఈ సంవత్సరం ‘ఎల్‌నినో’ ప్రభావంతో సరైన వర్షాలు కురవక వేసిన పంటలు పూర్తిగా ఎండి పోవడంతో రైతులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. జిల్లాలో మొత్తం 10,87,760 ఎకరాల సాగు భూమి ఉండగా, ఈ ఏడాది కేవలం 7,56,340 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో ఒక్క పత్తి పంట సుమారు 5,42,125 ఎకరాల్లో (మొత్తం సాగైన భూమిలో 75 శాతం) వేశారు. రైతులు ఎకరాకు రూ.50 వేలకు పైగా పెట్టుబడులు పెట్టారు. మొక్కకు 50 నుంచి 60 కాయలు ఉండాల్సింది, బతికిన కొద్దిపాటి మొక్కలకు కేవలం 2 నుంచి 3 కాయలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. మొక్కలు గిడసబారి పెరుగుదల లేకపోవడంతో పత్తి రైతులు అపార నష్టాలను చవిచూశారు.

ఉల్లి పంట పరిస్థితి కూడా ఇలాగే ఉంది. జిల్లా వ్యాప్తంగా 7,960 ఎకరాల్లో ఉల్లి సాగైంది. కోడుమూరు మండలంలో ఈసారి 2,750 ఎకరాల్లో సాగు చేశారు. ఇందుకోసం ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేలు ఖర్చు చేశారు. సుమారు రూ.13.75 కోట్లు ఖర్చు చేశారు. కనీసం ఒక్క రూపాయి కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. వేరుశనగ, మొక్కజొన్న, కొర్ర, మిరప, సజ్జ, ఆముదం, కంది తదితర పంటలన్నీ పూర్తిగా ఎండిపోయాయి. కొన్ని చోట్ల ఎండిన పంటలను గొర్రెల మేతకు వదిలేయాల్సిన దుస్థితి నెలకొంది. కోడుమూరు మండలంలోని ఒక్క వెంకటగిరి గ్రామంలోనే 1,600 ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. మొత్తం పంట చేతికి రాని పరిస్థితి. ఇక్కడి రైతులు, కౌలు రైతులు ఇతర గ్రామాలకు పనులకు పోతున్నారు. ఇదే గ్రామానికి చెందిన రైతు గిడ్డయ్య ప్రతి ఏడాది ఏడెకరాలు కౌలుకు చేస్తారు. ఐదెకరాల దాకా సొంత భూమి ఉంది. ఈసారి కరువు తాండవించడంతో రెండెకరాలు కౌలుకు తీసుకుని రూ.లక్షలు ఖర్చు చేసి ఉల్లి సాగు చేశారు. పూర్తిగా ఎండిపోయింది. గతేడాది చేసిన దాదాపు రూ.4 లక్షల అప్పు ఉంది. ఈసారి రూ.లక్ష ప్రైవేట్ వడ్డీకి తెచ్చారు. అప్పులకు వడ్డీలు కట్టలేని పరిస్థితి నెలకొంది. కోడుమూరు ఆర్.టి.సి బస్టాండ్ హమాలీగా మూటలు మోయడానికి వెళ్తున్నారు. చంద్రన్న అనే రైతుకు ఎకరన్నర సొంత భూమి వుంది. ఇదిగాక ఐదెకరాలు కౌలుకు చేశారు. ఉల్లి సాగు చేయగా పూర్తిగా ఎండిపోయింది. పూట గడవక అడ్డా కూలీగా మారారు. భూపాల్ తిప్పారెడ్డికి 20 ఎకరాలు ఉంది. 13 ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. నాలుగు ఎకరాలు కంది సాగు చేశారు. మరో మూడు ఎకరాలు బీడుగా వదిలేశారు. 'మొత్తం సాగు చేయకపోయినా బాగుండేది. ఆశతో రూ.లక్షలు అప్పు చేసి పెట్టుబడి పెట్టాను. వర్షం లేక మొత్తం ఎండిపోయింది. ఏదయినా ఒక వర్షం పడితే అక్టోబరులో శనగ సాగు చేస్తాన'ని అంటున్నారు. 'పంటలు చేతికొస్తే పిల్లల చదువులు సాఫీగా సాగుతాయని ఆశ పడ్డాను. ఇద్దరు పిల్లలు హైదరాబాద్ లో బిటెక్ చదువుతున్నారు. అప్పులెలా తీర్చాలో, వారి చదువులెలా గట్టెక్కించాలో అర్థం కావడం లేద'ని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా ఏ రైతును కదిలించినా వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి.

ఇంతటి ఘోరమైన కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ జిల్లాలోని ప్రజాప్రతినిధులకు కరువు సమస్య పట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాల్సిన నాయకులు కేవలం వ్యక్తిగత ఆదాయ వనరులపైనే ధ్యాస పెట్టారని... రైతులు, కూలీలు, కౌలు రైతుల కష్టాలను పట్టించుకోకపోవడం శోచనీయమని ప్రజలు మండిపడుతున్నారు. ​రెవెన్యూ, వ్యవసాయ శాఖలను అప్రమత్తం చేసి కరువు పరిస్థితులను అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు తాగునీటి ఎద్దడి తలెత్తడంతో ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది.

దయనీయంగా కౌలు రైతుల బతుకులు

ముందస్తు కౌలు చెల్లించి మరీ పంటలు వేసిన కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పెట్టిన పెట్టుబడులు రాకపోగా, అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో దిక్కు తోచని స్థితిలో వున్నారు. వారిలో కొంత మంది వెల్దుర్తి మండలంలో హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ కింద సాగయిన భూముల్లో కూలి పనులకు ఆటోల్లో వెళ్లి వస్తున్నారు. ఎక్కువ మంది కర్నూలుకు అడ్డా కూలీలుగా వెళ్తున్నారు.

ప్రభుత్వం చేపట్టాల్సిన తక్షణ చర్యలు

కర్నూలును ​కరువు జిల్లాగా ప్రకటించి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలి. ​రైతులు తీసుకున్న పంట రుణాలన్నింటినీ రద్దు చేసి, కొత్తగా పంట రుణాలు అందించాలి. ​రబీ సీజన్‌కు అవసరమైన విత్తనాలను ఉచితంగా అందజేయాలి. ​బీమా పరిహారాన్ని అర్హులైన రైతులందరికీ వెంటనే చెల్లించాలి.

శాశ్వత కరువు నివారణకు ప్రత్యామ్నాయాలు

తుంగభద్ర, కృష్ణ, హంద్రీ నదుల వంటి జీవనదులు జిల్లాలో ఉన్నప్పటికీ, పాలకుల అశ్రద్ధ కారణంగా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికాక ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారు. మారుతున్న ప్రభుత్వాలు కేవలం వాగ్దానాలు, శంకుస్థాపనలకే పరిమితమవుతున్నాయి తప్ప ఆచరణలో విఫలమవుతున్నాయి. ​వేదవతి రిజర్వాయర్‌ను 8 టిఎంసిలతో పూర్తి చేస్తామని గత ప్రభుత్వం, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తున్నాయి. ఆర్డీఎస్ కుడికాలువ, మేలిగనూరు వరద కాలువ, పందికోన రిజర్వాయర్ కుడి-ఎడమల కాలువలు, గుండ్రేవుల రిజర్వాయర్‌ పనులను వెంటనే పూర్తి చేయాలి. హంద్రీ-నీవా ద్వారా చెరువులకు, స్లూయిస్‌ల ద్వారా చిన్న కుంటలకు నీరు నింపితే జిల్లాను కరువు బారి నుంచి కాపాడుకోవచ్చు. పాలకులు నిర్లక్ష్యాన్ని వీడాలన్నా, శాశ్వత కరువు నుంచి విముక్తి లభించాలన్నా... రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు రాజకీయాలకు అతీతంగా సంఘటితమై బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సిందే.


- వ్యాసకర్త : జి. రామకృష్ణ

ఎ.పి రైతు సంఘం,

కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్