- కొత్త పింఛన్ల దరఖాస్తు వేళ గుబులు
- ఆన్‌లైన్ పెండింగ్‌లతో సతమతం
- కొత్త వారికి పెన్షన్ సందేహమే!
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి, సిటీ : శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువకు చెందిన కోనేటి ప్రభది రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. ఆమె కుమార్తె యమున పుట్టుకతోనే మానసిక వికలాంగురాలు. వైద్యం అందించే స్తోమత లేక ప్రభ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. తన కుమార్తెకు కనీసం వికలాంగ పింఛను వచ్చినా కొంత ఉపయోగపడుతుందని సదరం ధ్రువపత్రం కోసం నాలుగుసార్లు దరఖాస్తు చేసినా రకరకాల కారణాలతో వాటిని అధికారులు తిరస్కరించారు. అయినా, ఆమె తన ప్రయత్నాలు విరమించలేదు. వైద్య పరీక్షలకు రావాలంటూ అధికారులు ఎట్టకేలకు సమాచారం ఇవ్వడంతో మంగళవారం తన కుమార్తెను తీసుకొని జిల్లా సర్వజన ఆసుపత్రికి ఆమె వచ్చారు. అవసరమైన పరీక్షలు వైద్యులు నిర్వహించినా సర్టిఫికెట్ ఎప్పుడు ఇచ్చేదీ స్పష్టంగా చెప్పలేదు. వికలాంగ పింఛను దరఖాస్తుకు ఈ నెల 16 చివరి గడువు కావడంతో, నిర్ణీత సమయంలోగా ధ్రువపత్రాన్ని ఎలా సమర్పించాలో తెలియక ఆమె తల్లడిల్లుతున్నారు.
- విజయనగరానికి చెందిన కె.గీతామణి కుమారుడు సాయి తర్షిత్ చిన్నతనం నుంచే మానసిక వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు. సదరం ధ్రువపత్రం కోసం విజయనగరంలో దరఖాస్తు చేసుకున్నా, అక్కడ ఖాళీ లేదంటూ, శ్రీకాకుళం రిమ్స్‌కు వెళ్లాలంటూ పంపేయడంతో ఆమె తన కుమారుడిని తీసుకొని మంగళవారం ఉదయం 9.30 గంటలకే ఆసుపత్రికి వచ్చినా ఖాళీ లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఆ బాలుడికి వైద్య పరీక్షలను డాక్టర్లు నిర్వహించారు. సదరం సర్టిఫికెట్ ఎప్పుడు జారీ చేసేదీ కచ్చితంగా చెప్పలేమని బదులివ్వడంతో ఆ తల్లి తీవ్ర ఆందోళనతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ఈ ఇద్దరే కాదు... రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. అన్ని అర్హతలు ఉన్నా సదరం సర్టిఫికెట్ రాక వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తాజాగా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించడంతో వికలాంగుల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే సదరం ధ్రువపత్రం ఉన్న వారికి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా, కొత్తగా సదరం సర్టిఫికెట్ పొందాలనుకుంటే సాధ్యపడడం లేదు. సదరం ధ్రువపత్రాల జారీ కోసం ప్రభుత్వం మూడు నెలలకోసారి దరఖాస్తుదారులకు ఆయా తేదీల్లో స్లాట్లను కేటాయిస్తోంది. జూన్ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రస్తుతం టైం స్లాట్ ఇచ్చింది. కొత్త వారికి అక్టోబరులో టైం స్లాట్లను కేటాయించింది. జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ప్రమాదాల్లో కాళ్లు, చేతులు పొగొట్టుకున్నవారు, అంధత్వం, మానసిక రుగ్మతలకు లోనైవారు ఇప్పుడు కొత్తగా సదరం ధ్రువపత్రం పొందే అవకాశం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
పరీక్షలు పూర్తయినా 'ఆన్‌లైన్' తిప్పలు
ప్రస్తుతం స్లాట్ సంపాదించి, వైద్య పరీక్షలు చేయించుకుంటున్న వారికీ సకాలంలో ధ్రువపత్రాలు అందే పరిస్థితి కనిపించడం లేదు. కొందరికి అన్ని రకాల క్లినికల్ పరీక్షలు పూర్తయినప్పటికీ, ఆన్‌లైన్ లో మాత్రం వారాల తరబడి 'పెండింగ్' అని చూపిస్తోంది. పింఛన్ల దరఖాస్తు గడువు ముంచుకొస్తుండడంతో సాంకేతిక లోపాలను సవరించి, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సదరం సర్టిఫికెట్లను త్వరితగతిన జారీ చేయాలని ప్రభుత్వాన్ని వికలాంగులు, వారి కుటుంబసభ్యులు కోరుతున్నారు.
ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తేనే అవకాశం
సదరం సర్టిఫికెట్ల కోసం వేలాది మంది ఎదురుచూస్తున్న నేపథ్యంలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. వికలాంగ పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై ఇప్పటికే మూడు రోజులు గడిచిపోయాయి. ఈనెల 12 నుంచి 14 వరకు సెలవు దినాలు. దీంతో, ధ్రువపత్రాల సమర్పణకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది. దరఖాస్తు గడువు పెంచాలని అర్హులు కోరుతున్నారు.







కామెంట్‌లు (0)