కార్య్రకమాల అమలు, గణాంకాల శాఖ 2026-27 మొదటి త్రైమాసికానికి సంబంధించిన లెక్కలు విడుదల చేయగానే భారతీయ ఆర్థిక వ్యవస్థ బలంగా వృద్ధి చెందుతోందనే పరవశ కథనాల అల్లిక ఆరంభమైపోయింది. ఈ మొదటి త్రైమాసిక కాలంలో (ఏప్రిల్-జూన్)కు సంబంధించిన ఈ లెక్కలు 2026 ఆగస్టు31న విడుదలయ్యాయి. ఆ మరుసటి రోజునే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) భారత దేశ జిడిపి పెరుగుదల గురించి ఒక చిత్రం ప్రచురించింది. ‘2026-27లో భారత ఆర్థిక వ్యవస్థ చాలా దృఢతరమైన దిశలో మొదలైంది. జిడిపి నిజమైన పెరుగుదల రేటు 7.8 శాతంగా దూసుకుపోతోంది.’ అని పిఐబి చాలా ధైర్యంగా నొక్కి చెప్పింది.
2026 ఆగస్టు 31న విడుదలైన ప్రభుత్వ తొలి ప్రకటనలో ఒకలైన్ ఇలా వుంది: 2025-26 మొదటి త్రైమాసికకు సంబంధించిన పెరుగుదల రేటు 6.9 శాతం కాగా 2026-27 మొదటి త్రైమాసిక అంచనా 7.8 శాతంగా వుంది. 2025 ఆగస్టు 29న 2025-26 మొదటి త్రైమాసికకు సంబంధించిన పెరుగుదల రేటు అంచనా గుర్తున్నవారికి ఇది చాలా విచారం కలిగించవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో ఏడాది కిందట వెలువడిన ఆ ప్రకటన కూడా ఇలాగే వుండింది. ‘‘2024-25 మొదటి త్రైమాసికకు సంబంధించిన పెరుగుదల రేటు 6.5 శాతం కాగా 2025-26 మొదటి త్రైమాసిక అంచనా 7.8 శాతంగా వుంది’’. కనుక ఈ ఏడాది 7.8 శాతం పెరుగుదల రేటు చాలా గొప్ప వేగవంతమైందనుకోవాలి, అయితే అసలు కథేమిటంటే గత ఏడాది 7.8 శాతంగా అంచనా వేసింది కాస్తా వాస్తవంలో 6.9 శాతానికి తగ్గించబడింది. కనకనే ఇక్కడెవరికైనా న్యాయంగా ఒక ప్రశ్న ఉదయించక మానదు. ఇప్పుడు చెబుతున్న ఈ 7.8 శాతం అంచనా వచ్చే ఏడాదికి వాస్తవమవుతుందన్న పూచీ ఏమిటి? అది ఆచరణలో తగ్గిపోదని ఎలా చెప్పడం?
పిఐబి నిజమైన అభివృద్ధి గురించి తప్ప నిజమైన జిడిపి గురించి చెప్పడం లేదనుకున్నా- అది పాత సిరీస్‌లో పొందుపరుస్తున్న అభివృద్ధి లెక్కలు అధికారిక గణాంకాల కన్నా వేరుగా వున్నాయి. లేదంటే మనం నూతన జిడిపి సిరీస్ మాత్రమేగాక పాత సిరీస్‌కు సంబంధించిన లెక్కలు కూడా కొత్తగా అంచనా వేస్తున్నామనుకోవాలి. అలాగాక మనం 2011-12 ప్రాతిపదికగా పాత సిరీస్ తీసుకున్నామనుకుంటే అప్పుడు కూడా 2025-26 జిడిపి మరింత మెరుగ్గా వుండేది. తక్కువ స్థాయిలో జిడిపి, పెరుగుదల చూపని సగటు అభివృద్ధి రేటు ఏ విధంగా చూసినా అధికారిక లెక్కల ప్రకారమే అర్థమయ్యే చిత్రమిది.
సరే సర్కారు వారు ఒక వాదన చేయొచ్చు. ఈ ఏడాది అంచనాలు కొత్త జిడిపి సిరీస్‌లో మరింత మెరుగుపర్చబడిన లెక్కల పద్ధతి ఆధారంగా రూపొందాయనొచ్చు. సెప్టెంబరు 1న వెలువడిన పిఐబి ప్రకటన మరో విషయం కూడా గొప్పగా చెప్పింది. ‘‘గత మూడు ఆర్థిక సంవత్సరాలలోనూ అసలైన జిడిపి అంచనాలు మరింత పెంచబడ్డాయి. మొదటి త్రైమాసిక పని తీరు అంతకు ముందు అంచనా వేసినదానికన్నా అధికంగా వుండటం జరుగుతుందని ఈ లెక్కలు చెబుతున్నాయి.’’ ఈ ప్రకటనలో మొదటి భాగం పూర్తిగా అర్థరహితం, రెండవ భాగం పూర్తిగా అసత్యం. నిజమైన జిడిపి అన్నది వాస్తవానికి ఆ ఏడాదిలో వున్న నిజమైన ధరల ఆధారంగా అంచనా వేసింది (అంటే ఇప్పుడున్న ధరలతో లెక్కించింది లేదా నామమాత్రపు అంచనా). దాన్ని ఒక ప్రాతిపదికగా తీసుకునే ఆ ధరలు అలాగే వుంటాయనే భావనతో చేసింది. నిజమైన జిడిపి అంటే ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత అంతకు ముందు ఉజ్జాయింపుగా వేసిన దానితో తేడా చూడటానికి మాత్రమే దాన్ని ఉపయోగిస్తారు. రెండు వేర్వేరు ప్రాతిపదిక సంవత్సరాల ఆధారంగా వేసిన లెక్కలను పోల్చడానికే వీలవదు.
నిజంగా పోల్చగలిగిందేమంటే జిడిపి లెక్క కట్టడానికి ఉపయోగించిన పాత, కొత్త పద్ధతులను తీసుకుని ప్రస్తుత ధరల ఆధారంగా అంచనా వేయడం. ఆ విధంగా చూస్తే 2022-23 నుంచి 2025-26 వరకూ ఈ మార్పులు జిడిపి అంచనాల కన్నా ఇంకా తక్కువకు చేరతాయి. ఇక త్రైమాసిక అంచనాలను పోల్చి చూస్తే గనక ఈ హెచ్చుతగ్గు తేడాలు మరింత త్రీవంగా కనిపిస్తాయి. ఈ కొత్త సిరీస్ అంచనాలు ఏ విధంగా చూసినా గడచిన నాలుగేళ్లలో 6.9 శాతం నుంచి 7.6 శాతం మధ్యలో ఎంతో తక్కువగా వుంటాయి. అందువల్ల అప్పుడు మన అంచనాలను ఇప్పుడు చెప్పేదానికన్నా మరింత దిగువకు తీసుకుపోవలసి వుంటుంది. అలాంటప్పుడు ఇప్పటి లెక్కలు కచ్చితమైనవే గనక భారత ఆర్థిక వ్యవస్థ అంతకు ముందుకన్నా చాలా బాగా పనిచేస్తుందని ఎలా చెప్పగలం?
అయితే ఈ కొత్త పాత సిరీస్‌ల మధ్య ఒకే ఉమ్మడి అంశమేమంటే గత కొన్ని సంవత్సరాలలో నామమ్రాతపు జిడిపి పెరుగుదల రేటు బాగా పడిపోతున్నా అధికారిక అంచనాలు మాత్రం నిజమైన జిడిపి పెరుగుతుందనే చెప్పడం. ద్రవ్యోల్బణం రేటును తగ్గించి చూపడం ఇందుకు కారణం, జిడిపి రేట్లలో ఇమిడి వుండే ద్రవ్యోల్బణం రేటు వాస్తవంగా వినియోగదారుల ధరల సూచీకన్నా తక్కువగా చూపించడం ఇందుకు దారితీస్తుంటుంది. 2026-27 తొలి త్రైమాసికలో కూడా అంతర్గతంగా తీసుకున్న ద్రవ్యోల్బణం రేటు 2.5 శాతమే గాని వాస్తవంగా అది 3.9 శాతం వుంది. టోకు ధరల సూచి 9 శాతం వుంది. ఆఖరుకు పిఐబి ఇచ్చిన ప్రభుత్వ ప్రకటనలో చూపిన అయిదు ఉత్పత్తుల ధరల సూచికలు కూడా అదివరకటి సంవత్సరంతో పోలిస్తే అధిక ద్రవ్యోల్బణం రేటు చూపిస్తున్నాయి.
చివరగా చెప్పాలంటే అధికారిక గణాంకాలు కష్టజీవుల వాస్తవ జీవితానుభవాన్ని మార్చలేవు. జీవన వ్యయం పెరుగుదల, ఉద్యోగావకాశాలు కుదించుకుపోవడం, చేసే పనితో వచ్చే ఆదాయాలు తగ్గిపోవడం వారు ఎదుర్కొంటున్న వాస్తవం. ఇది లెక్కలలోనూ కనిపిస్తుంది కానీ దాన్ని ఏవో మాయదారి కథనాల తెరలలో దాచిపెడితే దాన్ని ఎవరి అభివృద్ధి అనాలి?
- పీపుల్స్ డెమోక్రసీ’ సౌజన్యంతో







కామెంట్‌లు (0)