బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రాణాంతక న్యాయం?

48 నిమిషాల క్రితం

judge
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 04:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

న్యాయమనేది ఎప్పుడైనా ప్రాణం పోసేదిగా వుండాలి గానీ తీయడమే పనిగా పెట్టుకోకూడదు. తప్పు చేసిన వారికైనా ఎన్నో రకాల శిక్షలుండగా కేవలం కుత్తుక కత్తిరించడమే కరెక్టని భావిస్తే ఎలా? కానీ ఆ న్యాయమూర్తి మాత్రం అదే రైటంటాడు. ఆయన సర్వీసుకు ఉరి తాడే గుర్తుగా పెట్టుకున్నాడా అనిపిస్తుంది కథ వింటే. ఆ ఉరిశిక్షల న్యాయమూర్తి పేరు రవికుమార్‌ ‌దివాకర్‌. తాను ప్రాణం తీసినా పిరికి వాడనిపించుకోవడానికి సిద్ధంగా లేనని ప్రకటిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌‌లోని ముజఫర్‌‌ నగర్ అదనపు జిల్లా న్యాయమూర్తిగా ఉన్న సెషన్స్‌ ‌జడ్జి దివాకర్‌ గత అయిదు నెలల్లో విధించిన ఉరిశిక్షలు అక్షరాలా 22. సోమవారం నాడు ఒక వరకట్నం కేసులో మరో శిరచ్ఛేద శిక్ష విధించి పాతికతో రజతోత్సవం పూర్తి చేసుకోవాలన్నట్టుంది ఆయన తీరు. అన్నట్టు ఈయన కేవలం ఉరితీతలకే కాదు. మత వివాద కేసులకూ పెట్టింది పేరట. 2022లో జ్ఞానవాపి మసీదు సర్వేకు ఉత్తర్వులిచ్చింది కూడా సారువారే. తాజాగా మహ్మద్‌ ‌నదీమ్‌ అనే నిందితుడు తన భార్య షెహజాదీని కిరోసిన్‌ ‌పోసి నిప్పంటించిన కేసులో ఆయనకు ఉరి వేశారు. అత్యంత అరుదైన కేసులలోనే మరణశిక్ష వేయాలన్న నిబంధన దీనికి బాగా వర్తిస్తుందంటారు రవి దివాకర్‌. ఈ విచారణ క్రమంలో చాలా మంది సాక్షులు అడ్డం తిరిగారు. కానీ ఆమె మరణవాంగ్మూలమే ఆధారంగా చేసుకుని జడ్జి ఉరి వేశారు. కేసుల్లో తప్పులు తీవ్రమైనవే గానీ ఇలా కోర్టు కూడా వరుస ఉరితీతలతో చంపేయడమే జరుగుతుంది కదా అని ఒక ప్రశ్న?

వెక్కిరింతల కొక్కిరాయి

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ అనేక సంచలనాలకు కారణమవుతున్నారు. కొన్ని సానుకూల చర్యలు తీసుకున్నా వివాదాలకూ అవకాశమిస్తున్నారు. ఒకరిద్దరు అస్మదీయులకు పదవులు ఇవ్వడం దుమారం రేపింది. ఆ పైన అనవసరంగా ఆయన స్నేహితురాలు త్రిష పేరు తీసి వివాదాలు రగిలించేపని ప్రతిపక్షాలు, మీడియా చేస్తూనే వుంటాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేత డింఎకె ఉదయనిధి స్టాలిన్‌ ‌కొద్ది రోజుల కిందట డబుల్‌ ‌మీనింగ్‌‌తో మాట్లాడి చర్యలకు గురైనారు. విజయ్‌ ‌ప్రస్తుత శాసనసభా సమావేశాలలో ఈ విధమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహిళలను కించపరిస్తే ఊరుకోబోనన్నారు బాగానే వుంది. కానీ అదే సమావేశాలలో ఆయన మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌‌ను అపహాస్యం చేసే విధంగా వ్యవహరించి విమర్శలకు గురైనారు. ఎవరినైనా వదలిపెట్టేది లేదంటూ దవడ సవరించుకున్నారు. ఏమంటే ఇది స్టాలిన్‌ ఆత్మకథలో రాసిందాన్ని గుర్తు చేసింది. ఎమర్జెన్సీలో తనను అరెస్టు చేసి హింసించినందువల్ల దవడ దెబ్బతిన్నదని స్టాలిన్‌ ‌రాసిందేగాక ఆయన బాడీ లాంగ్వేజ్‌‌కు దాన్ని ఒక సంకేతంగా భావిస్తుంటారు. సి.ఎం విజయ్‌ అందుకే అలా చేశారని అందరూ భావించారు. సిపిఎం కార్యదర్శి షణ్ముగం గట్టిగా విమర్శించారు. కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టుల మద్దతుతోనే విజయ్‌ ‌సర్కారు నడుస్తుంది. ఈ విమర్శల వేటుకు విజయ్‌ కాస్త తగ్గి తాను అనుకోకుండా అలా అన్నానే గానీ ఎవరినీ ఇబ్బంది పెట్టాలని కాదని సంజాయిషీ చెప్పారు. ఇలాంటివన్నీ ముందే జాగ్రత్తపడాలి గానీ తర్వాతేమి చెప్పినా అడుసు తొక్కనేల చందంగా వుంటుంది మరి.​

కలకత్తా కాళిక దెబ్బ ​

సనాతనం, హిందూత్వం పేరుతో రెచ్చిపోయే బిజెపి, ఆర్.ఎస్.ఎస్ ‌పరివార్‌‌లకు నిజానికి ఈ దేశంలో ఉన్న అపారమైన వైవిధ్యం, లోతుపాతులు తెలియదు. తెలసినా గౌరవించరు. ఉత్తరప్రదేశ్‌‌లో యోగి ఆదిత్యనాథ్‌‌ను మించి అస్సాంలో హిమంత బిశ్వశర్మ, బెంగాల్‌‌లో సువేందు అధికారి తామే హిందూత్వ రక్షకులమని చెలరేగిపోతున్నారు కదా.. ఇప్పుడు దుర్గాపూజలపైనా తమ రాజకీయం ప్రయోగించబోయి భంగపడ్డారు. బెంగాల్‌‌లో దుర్గాపూజా పందిళ్లు ప్రసిద్ధమే కదా.. మూడున్నర దశాబ్దాల వామపక్ష పాలనలో అవేనాడూ వివాదం కాలేదు. సరికదా సర్వజన సంతోష కారణంగా నడుస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు బిజెపి పాలనలోనే దుర్గమ్మ కన్నెర్ర చేయవలసి వచ్చింది. ఏమంటే ఉత్తరాదిన తాము అనుసరించే సనాతనాన్ని వారు బెంగాల్‌‌పైనా రుద్దాలనుకున్నారు. మధ్యప్రదేశ్‌‌కు చెందిన బాగేశ్వర్‌ ‌ధామ్‌ ‌బాబా అధిక ప్రసంగం, బెంగాల్‌‌లో విహెచ్‌‌పి జారీ చేసిన ఆంక్షలు ఇందుకు కారణమైనాయి. దుర్గాదేవి పందిళ్లలో అన్ని రకాల ప్రసాదాలు పెడతారు. బెంగాల్‌‌లో కులమతాలకు అతీతంగా మాంసాహారం మరీ ముఖ్యంగా చేపలు తింటారు. అమ్మకు పెట్టే ప్రసాదంలో మాంసం ఉండకూడదని ఈ బాబా ఫర్మానా జారీ చేశారు. ఇక విహెచ్‌‌పి వారేమో హిందూయేతరులు ఈ పందిళ్లలోకి రావద్దని ఆదేశించారు. ఈ రెంటిపైనా ప్రజల్లో తీవ్ర నిరసన వచ్చింది. తరతరాల మా పద్ధతులను మీరెలా నిర్ణయిస్తారని వారు ఆగ్రహించారు. నషాళానికంటినా సర్కారు తోక ముడవక తప్పలేదు. దుర్గాదేవికి మాంసం ప్రసాదంగా పెట్టరాదని తామెన్నడూ ఆదేశించలేదని మంత్రి దిలీప్‌ ‌ఘోష్ ప్రకటించాల్సి వచ్చింది. అలాగే పందిళ్ల పైనా నిబంధనలేమీ లేవన్నారు. మరోసారి బెంగాల్‌‌లో ఇలాంటి వేషాలు వద్దని చెబుతున్నారు విమర్శకులు. ‘రుద్రాలిక, నయనజ్వాలిక కలకత్తా కాళిక నాలిక’ అన్నట్టు అక్కడెలా కుదురుతుంది? బ్రహ్మసమాజం వంటి వాటికి జన్మనిచ్చిన బెంగాల్‌లో ఆరాధనా పద్ధతులు, సంస్కరణలూ అన్నీ ఉన్నాయి.


- పీపీ

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్