దేశం కోసం ఎందరో క్రీడాకారిణులు ప్రపంచ వేదికలపై తమ సత్తా చాటారు. బరిలో వారు చూపిన పోరాటపటిమను చూసి దేశం ఎంతగానో గర్వించింది. విజయాలతో తిరిగి వచ్చిన వారి చుట్టూ ఎన్నో అవకాశాలు ఉండేవి. ఎంతో ప్రోత్సాహం ఉండేది. అయితే ఆ క్రీడాకారిణి తల్లి అయితే? కొంతకాలం క్రీడకు దూరంగా ఉండాల్సి వస్తే? తనపై జరిగిన వేధింపులను ప్రశ్నిస్తే? అప్పుడు ఆమెకు అదే గౌరవం, అదే అవకాశం, అదే న్యాయం దక్కుతున్నాయా? అంటే... ‘లేద’ని సమాధానం చెప్పాలి. రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిణామాలు ఈ ప్రశ్నలను మరోసారి ముందుకు తెచ్చాయి. కుస్తీ బరిలో ప్రత్యర్థులను ఎదుర్కొన్న ఆమె... ఇప్పుడు తన హక్కుల కోసం వ్యవస్థతో పోరాడాల్సిన పరిస్థితిలో ఉన్నారు. అయితే ఈ పోరాటం వినేశ్ ఒక్కదానిదే కాదు. తల్లులైన తర్వాత కూడా తమ క్రీడా జీవితాన్ని కొనసాగించే హక్కు గురించి... తమపై జరిగిన వేధింపులను స్వేచ్ఛగా చెప్పే హక్కు గురించి...
వినేశ్ ఫొగాట్ భారత రెజ్లింగ్‌లో అత్యంత విజయవంతమైన క్రీడాకారిణుల్లో ఒకరు. 2014 కామన్వెల్త్ గేమ్స్‌తో అంతర్జాతీయ కెరియర్‌ను ప్రారంభించిన ఆమె తొలి ప్రయత్నంలోనే స్వర్ణ పతకం సాధించారు. అదే ఏడాది ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచారు. ఆ తరువాత వరుసగా 2015 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజతం, 2016లో కాంస్యం, 2017లో రజతం, 2018లో రజతం సొంతం చేసుకున్నారు. వినేశ్ పతకాల పరంపర 2024 పారిస్ ఒలింపిక్స్ వరకు కొనసాగింది. అయితే ఆ పోటీల్లో 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా నిలిచినా, ఫైనల్‌కు ముందు బరువు పరిమితిని అధిగమించడంతో అనర్హతకు గురయ్యారు. కెరియర్‌లో ఇంతగా రాణించిన వినేశ్ ఆ తరువాత జరిగిన పోటీల్లో ఎక్కడా కనిపించలేదు. పైగా ఈ కాలంలో ఆమె పోటీల్లో పాల్గొనేందుకు పోరాటం చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి.
2025 జులైలో వినేశ్ ఫొగాట్ తల్లి అయ్యారు. ప్రసవం తర్వాత తిరిగి కుస్తీ బరిలోకి రావడానికి వినేశ్ సిద్ధపడింది. అయితే 2026 ఆసియా క్రీడల ఎంపిక ప్రక్రియలో ఆమెకు అడ్డంకులు ఎదురయ్యాయి. మాతృత్వం కారణంగా ‘ఆమె తీసుకున్న విరామం... ఆమె పోటీ పడేందుకు అడ్డంకి’ అని చెప్పారు. దీంతో వినేశ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మే 22, 2026న కోర్టు ఆమెకు సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనే అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘తల్లి కావడం ఎప్పటికీ బలహీనత కాదు’ అనే అర్థంలో ‘గర్భధారణ, ప్రసవానంతర పునరుద్ధరణ కారణంగా మహిళా క్రీడాకారిణిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నష్టపరిచే విధానం సమానత్వ సూత్రాలకు విరుద్ధమవుతుంద’ని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలోనే ఉంది. కేంద్ర ప్రభుత్వం, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యు ఎఫ్ ఐ), ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ స్పందనలను కోరుతూ తదుపరి విచారణ నవంబర్ 18, 2026కు వాయిదా పడింది.
ఇది కేవలం వినేశ్‌కు లభించిన అవకాశం కాదు. దేశంలోని మహిళా క్రీడాకారిణులందరికీ లభించిన గొప్ప వెసులుబాటు. క్రీడల్లో రాణిస్తున్న మహిళలకు మాతృత్వం తమ కెరియర్‌ను అడ్డుకోదని చెప్పే వెలకట్టలేని ప్రోత్సాహం. మాతృత్వం ఎప్పటికీ మహిళలకు బలహీనత కాదు. అది ఆమె జీవితంలో ఒక దశ మాత్రమే. అయితే ప్రసవం తర్వాత క్రీడాకారిణుల శరీరం మళ్లీ సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది. శిక్షణ, ఫిట్‌నెస్, బరువు, కండరాల సామర్థ్యం అన్నింటినీ వాళ్లు తిరిగి సాధించుకోవాల్సి ఉంటుంది. మన దేశంలో మాతృత్వం తరువాత రాణించిన మేరీకోమ్, సానియ మిర్జా లాంటి క్రీడాకారిణులు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. అయితే ఇక్కడ వినేశ్ పరిస్థితికి వేరే కారణాలు కూడా పరిశీలించాలి.
వేధింపులపై గళమెత్తింది
కెరియర్ ఉన్నతంగా ఎదుగుతున్న సమయంలోనే వినేశ్, కొంతమంది క్రీడాకారిణులు తమపై జరిగిన వేధింపులను బయటపెట్టారు. 2023లో అప్పటి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వినేశ్, సాక్షి మాలిక్ సహా పలువురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ వివాదం క్రీడారంగంలో మహిళలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యను బయటపెట్టింది. దేశంలోని 30 జాతీయ క్రీడా సమాఖ్యలను పరిశీలించిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పరిశోధన ప్రకారం.. వాటిలో 16 సమాఖ్యలు లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పిఓఎస్‌హెచ్) ప్రకారం అవసరమైన అంతర్గత ఫిర్యాదుల కమిటీ నిబంధనలను పూర్తిగా పాటించలేదు.
ఒక పక్క మహిళలను క్రీడల్లోకి రావాలని ప్రోత్సహిస్తున్నారు. పతకాలు సాధించాలని కోరుతున్నారు. కానీ వారికి వేధింపులు ఎదురైతే ఫిర్యాదు చేయడానికి అవసరమైన వ్యవస్థ పనిచేయడం లేదు. వేధింపులను బయటపెట్టడం క్రీడా వ్యవస్థకు వ్యతిరేకంగా చేసే తిరుగుబాటు కాదు. అది తన భద్రత, గౌరవం కోసం ఒక మహిళ వినిపించే గొంతు. మహిళా క్రీడాకారిణులపై వ్యవస్థ ఎలా వ్యవహరిస్తుందన్న ప్రశ్నకు మరో ఉదాహరణ అథ్లెట్ ద్యుతీ చంద్. సహజంగా ఎక్కువ టెస్టోస్టెరాన్ స్థాయులు ఉన్నాయనే కారణంతో 2014లో మహిళల విభాగంలో పోటీ చేయకుండా ఆమెను అడ్డుకున్నారు. ద్యుతీ ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేశారు. చివరకు ఆమెకు అనుకూలంగా నిర్ణయం రావడంతో తిరిగి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం లభించింది.
ఇప్పుడు మహిళలు వివిధ క్రీడల్లో రాణిస్తున్నారు. అయితే మహిళలకు అనుకూలమైన మార్పులు ఆయా క్రీడల్లో రావడం లేదు. 2022లో బీసీసీఐ మహిళా, పురుష క్రికెటర్లకు అంతర్జాతీయ మ్యాచ్ ఫీజుల్లో సమానత్వాన్ని ప్రకటించడంతో ఒక విషయం స్పష్టమైంది. సంస్థలు నిర్ణయించుకుంటే మార్పు సాధ్యమే. అయితే అది ఎప్పుడు..? ప్రతి క్రీడాకారిణికి ఎంపిక విధానంలో సమానమైన అవకాశం, సురక్షితమైన వాతావరణం ఉండాలి. మాతృత్వానికి గౌరవం, ఫిర్యాదు చేసే హక్కు ఉండాలి. ఆమె పతకం గెలిచినప్పుడు మాత్రమే గర్వపడడం కాదు. ఆమె తల్లి అయినప్పుడు, తనపై జరిగిన అన్యాయాన్ని చెప్పినప్పుడు కూడా అదే మద్దతు తనకు ఇవ్వాలి.







కామెంట్‌లు (0)