2021 జనాభా లెక్కల కోసం సుమారుగా 2018 లేదా 2019లో మొదలు కావలసిన ప్రక్రియ 2026 ఏప్రిల్ లో మొదలైంది. దీనిని రెండు దశలలో నిర్వహించాలని నిర్ణయించారు. మొదటి దశలో ‘గృహ వసతికి’ సంబంధించిన వివరాల సేకరణ ఏప్రిల్ 1 నుండి మొదలయి సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. ఈ ప్రక్రియ ముగియడానికి కొద్ది రోజులు మాత్రమే వ్యవధి ఉన్నది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం చాలా రాష్ట్రాలలో ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. ఎప్పటికి పూర్తి కావచ్చనే దానిపై అంచనాలు లేవు.
దీనికి ఒక ముఖ్య కారణం, ఓటర్ల జాబితాలలో ఉన్న తప్పులను సరిదిద్దడానికంటూ...అనేక అభ్యంతరాల మధ్య చేపట్టిన...‘ప్రత్యేక సమగ్ర విచారణ’ (ఎస్.ఐ.ఆర్) కార్యక్రమం గత నెలతో ముగిసింది. అన్ని రాష్ట్రాలలోని పూర్తి సిబ్బందిని ఈ కార్యక్రమానికి వినియోగించడం వల్ల జనగణన ప్రక్రియ మందకొడిగా సాగుతున్నదని చెప్పవచ్చు. ఎస్.ఐ.ఆర్ పై వస్తున్న విమర్శలను, దాని ఆవశ్యకతను చర్చించడం ఈ వ్యాసం ఉద్దేశం కాదు. అయినప్పటికీ ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితిని గమనిస్తే లక్షలాది ఓటర్లు తమ ఓటు హక్కు పోతున్నదని గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయమై ‘ఎన్నికల సంఘం’ కూడా ప్రత్యేక ప్రకటనలు చేయాల్సి వస్తున్నది. ఈ ప్రక్రియ క్షేత్ర స్థాయిలో పూర్తిగా, జాతీయ స్థాయిలో గణాంకాలను మదింపు చేసి విడుదల చేయాల్సి వుంది. ఆ సందర్భంలో కొత్తగా ఎన్ని కోణాలు ఆవిష్కృతమవుతాయో చూడాలి.
ఒక విధంగా గమనిస్తే ఎస్.ఐ.ఆర్ కు, జనగణకు మధ్యన ఉన్న సంబంధాన్ని మనం విస్మరించలేం. ఓటరుగా నమోదు కాని వారి లేదా కుటుంబం సమాచారాన్ని జనగణనలో ఏ విధంగా లెక్కించాలి. అటువంటి వారిని పూర్తిగా విస్మరించడమేనా? వారి ఉనికిని ఏ విధంగా గుర్తించాలి? ఈ రెండు ప్రక్రియల మధ్యన ఉన్న ‘లెక్కల అంతరాన్ని’ ఏ విధంగా పరిష్కరిస్తారు? వంటి అనేక భయాందోళనలు ప్రజలలో నెలకొని ఉన్నాయి. ఎస్.ఐ.ఆర్ సమాచారాన్ని క్రోడీకరించి, విడుదల చేసిన తరువాత, జనగణన కొంత పురోగతి సాధించిన సమయంలో ఈ సమస్య మరింత జటిలంగా మారుతుంది. ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ చూపడంలేదు. వారి శ్రద్ధ అంతా జాతీయ స్థాయిలో ఏదో ఒక అంశాన్ని చర్చకు తేవడం, వివాదం సృష్టించడం ఆపైన దానిని మరుగునపరచడం. ఉదాహరణకు ఒకే జాతి, ఒకే ఎన్నిక (ఒన్ నేషన్, ఒన్ ఎలక్షన్). ఇది ప్రజాస్వామ్య విధానంలో ఏ విధంగా సాధ్యమో అర్ధం కాదు. అలాగే పౌరులందరికీ కలిపి ‘ఏకరూప పౌరస్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్). విభిన్న జాతులకు, భిన్న సంస్కృతులకు నిలయమైన దేశంలో దీనినెలా అమలు చేస్తారు?
జనగణన మొదటి దశగా సాగుతున్న ‘గృహ వసతి’కి సంబంధించి మొత్తంగా 31 ప్రశ్నలున్నాయి. గృహ వసతి వివరాలతో పాటుగా, టి.వి, రేడియో, మొబైల్, లాప్ టాప్, కంప్యూటర్, కారు, జీపు వంటి అనేక అంశాల సమాచారం ఉంది. స్థిర నివాసాలున్న వారి సంగతి పక్కన పెడితే, గృహ వసతి లేని వారు, సంచార జాతులకు సంబంధించిన సమాచారాన్ని ఏ విధంగా సేకరిస్తారో తెలియదు. అలాగే పై పరికరాల సమాచారాన్ని ప్రజలు ఏ మేరకు వెల్లడిస్తారన్నది సందేహమే. ఎందుకంటే ప్రభుత్వాలు అందించే ‘ఉచితాలకు’, వీటికి ఉన్న సంబంధం దృష్ట్యా, సమాచారాన్ని రాబట్టడం అంత తేలిక కాదు. 2011 జనాభా లెక్కల ప్రకారమే దేశంలో 1.77 మిలియన్ల మంది గృహ వసతిలేని, నిరాశ్రయులుగా ఉన్నారు. దీనికి తోడు మురికివాడలలో నివసించే 65.49 మిలియన్ల మంది అదనం. ప్రపంచంలోనే అత్యధిక మురికివాడలు, జనాభా కలిగిన దేశంగా భారతదేశం గుర్తింపు పొందింది. ఆసియా మొత్తంగా అతి పెద్ద మురికివాడగా బొంబాయిలోని ‘ధారవి’ చెప్పబడుతున్నది. జనగణన ప్రక్రియకు సంబంధించిన ఈ సమస్యలు ఇంతకు ముందు కూడా వున్నవే. అయితే వాటి తీవ్రత, సంక్లిష్టత ఈ మధ్య కాలంలో పెరిగిపోయింది. ఈ సమస్యలను ‘సెన్సస్ ఆఫ్ ఇండియా’, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అధిగమించగలవన్నది చూడాలి.
ఇక రెండవ దశలో అసలు జనాభా లెక్కల సేకరణ 2027 ఫిబ్రవరి 9తో మొదలు పెట్టి ఫిబ్రవరి 28తో ముగించాలని నిర్ణయించారు. అయితే రెండు దశలకు ఉన్న సంబంధం దృష్ట్యా, మొదటి దశ సంపూర్ణంగా పూర్తయితే తప్ప, రెండో దశలోకి ప్రవేశించే అవకాశం లేదు. దీనికి సంబంధించి ‘సెన్సస్ కమిషన్’ ఒక ప్రకటన చేయాల్సి వుంది. అయినప్పటికీ, రెండవ దశ అయిన ‘జనగణన’ కోసం 40 ప్రశ్నలతో ఒక షెడ్యూల్ ను 2026 ఆగస్టు 14న విడుదల చేశారు. 2011లో అడిగిన 29 ప్రశ్నలకు కొన్నింటిని అదనంగా చేర్చారు. కొత్తగా అడుగుతున్న ప్రశ్నలలో ముఖ్యమైనవి కులం, డిజిటల్ అక్షరాస్యత, బ్యాంక్ ఖాతాల వివరాలు, ఆధార్ సంఖ్య, కోవిడ్ టీకాలకు సంబంధించిన సమాచారం.
ఈ సందర్భంలో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అంశం ఒకటుంది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం జనగణన పట్ల ఎందుకు శ్రద్ధ చూపడంలేదు? దీనికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది-జాతీయ జనాభా రిజిష్టర్ ను నవీనీకరించాలనే ఆలోచన. 2010లో మొదలైన ఈ ప్రక్రియ రెండో విడతగా 2015లో చేపట్టబడింది. మూడో విడతగా చేపట్టాలనే ఆలోచన ఆలస్యం కావడంతో జనగణన ప్రక్రియ కూడా ఆలస్యమైంది. ఈ రిజిష్టర్ తయారీ ఉద్దేశం దేశవాసులు, అక్రమ చొరబాటుదారులుగా విభజించి కొందరిని లక్ష్యంగా చేసుకొని ఏరివేయడం. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదురు కావడంతో, ఈ ప్రక్రియ వెనుకకు నెట్టబడింది. రెండవది-కుల గణన చేపట్టాలనే రాష్ట్రాల డిమాండుకు బిజెపి మొదటినుంచి వ్యతిరేకంగా వున్నది. తరువాత కొంత కాలం నానబెట్టి, చివరకు అంగీకరించి, రెండో దశ ప్రశ్నావళిలో ఈ అంశాన్ని చేర్చారు. ఈ మధ్య కాలంలోనే బీహార్, ఒడిషా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు కుల ప్రాతిపదిక ఆధారంగా సర్వేలు నిర్వహించి, ఆ నివేదికలను అసెంబ్లీలలో సమర్పించి ఆమోదింపజేసుకున్నాయి. ఈ ప్రాతిపదికగా ‘స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్’ కల్పించే ప్రయత్నం చేశాయి. అయితే రిజర్వేషన్ల శాతం మొత్తంగా 50 దాటరాదనే నిబంధన వల్ల ఈ వర్గాలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. ఇది కేవలం ఒక రాజకీయ ఎత్తుగడగానే మిలిగిపోతున్నది.
మూడవది-మరింత ప్రధానమైనది నియోజక వర్గాల పునర్విభజనకు సంబంధించినది. రాజ్యాంగంలోని 82, 170 అధికరణాల ప్రకారం ప్రతి జనగణన తరువాత ‘డిలిమిటేషన్’ ప్రక్రియను చేపట్టాలి. దీనిని 2029లో వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు నిరవధికంగా వాయిదా వేసే లక్ష్యంలో భాగంగా ఉద్దేశ పూర్వకంగానే కేంద్రం జనగణను అలక్ష్యం చేస్తున్నదనేది రాష్ట్రాల విమర్శ. ప్రస్తుతం నత్త నడకన సాగుతున్న జనగణన ప్రక్రియ తీరు ఈ భయాన్ని మరింత పెంచుతున్నది. రాజకీయంగా చూసినా, సంక్షేమం, సామాజిక అభివృద్ధి పరంగా గమనించినా జనగణన అన్నది అత్యంత అవసరమైన అంశం. కేంద్ర ప్రభుత్వం జనగణను నిర్లక్ష్యం చేయడం ఆమోదయోగ్యం కాదు. బ్రిటీషు ప్రభుత్వ కాలంలో 1872లో మొదలైన ఈ ప్రక్రియ, యుద్ధ కాలంలో తప్ప, నిరాటంకంగా కొనసాగింది. అటువంటి ఘన చరిత్రను ప్రస్తుత ప్రభుత్వం పరిమిత ప్రయోజనాలను ఆశించి నిర్వీర్యం చేయడం ఎంతమాత్రం సమర్ధనీయం కాదు. ఈ విషయానికి సంబంధించి కొన్ని రాష్ట్రాలు, ప్రతిపక్ష పార్టీలు గళమెత్తకపోవడం విచారకరం. సాధారణ ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాలే వున్నందున ప్రక్రియను ఈలోపునే పూర్తి చేసే చర్యలు చేపట్టాలి. లేనిపక్షంలో 2031 నాటికి జనాభా లెక్కలు సిద్ధమై, రెండు దశాబ్దాల విలువైన కాలాన్ని కోల్పోయిన వారిగా మిగిలిపోతాము. ఇది ఆర్థిక, సామాజిక రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. తస్మాత్ జాగ్రత.

వ్యాసకర్త :కె. వియ్యన్న రావు,ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం
పూర్వ ఉపకులపతి, సెల్: 7093260655/







కామెంట్‌లు (0)