బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘వెలిగొండ’ నిర్వాసితుల ఆర్తనాదాలు

2 గంటల క్రితం

VELIGONDA
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 06:18 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • ఉపాధి కోల్పోయి రోడ్డున పడిన 700 కుటుంబాలు

  • తాతాల్కిక గుడారాల్లో బతుకీడుస్తున్న ముంపు బాధితులు

  • హామీలే తప్ప కన్నెత్తి చూడని ప్రజాప్రతినిధులు

​ప్రజాశక్తి- ఒంగోలు బ్యూరో, మార్కాపురం : నిర్వాసితులకు అన్ని విధాలా ఆదుకుంటామని, అండగా ఉంటామని, పునరావాస చర్యలు తీసుకుంటామని వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. ప్రాజెక్టులోకి నీరు వస్తోందని చెప్పి, ముంపునకు గురయ్యే గ్రామ ప్రజలను అధికారులు హుటాహుటిన ఖాళీ చేయించారు. అయితే, సరైన పునరావాసం కల్పించకపోవడంతో నిర్వాసితులు చెట్టుకొకరు, పుట్టకొకరు అన్నట్లుగా చెల్లాచెదురయ్యారు. ఒకప్పుడు కలిసిమెలిసి ఉన్నవారు, ఇప్పుడు తాము ఎక్కడ ఉన్నామో ఫోన్లలో మాట్లాడుకుంటూ పరామర్శించుకోవడమే తప్ప, ఒకరినొకరు కలుసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ ఇళ్లను, సాగు భూములను త్యాగం చేసిన 7,300 మంది నిర్వాసితులకు ఇప్పుడు తలదాచుకోవడానికి నిలువ నీడ కరువైంది. దీంతో, తమకు తెలిసిన బంధువుల ఇళ్లల్లో సామగ్రిని భద్రపరిచి, పురుషులు బయటకు వస్తున్నారు. మార్కాపురం పరిసర ప్రాంతాలలో ఎలాంటి ఉపాధి అవకాశాలూ లేకపోవడంతో స్థానిక హోటళ్లలోనే తింటూ పనుల కోసం రోడ్లపై తిరుగుతున్నారు. మరోవైపు, ముంపు గ్రామాల్లోని బోరు బావుల కింద సాగు చేసిన పంటలు చేతికందక, అటు ఉపాధి పనులు దొరక్క నిర్వాసిత కుటుంబాలు తీవ్ర అవస్థలు పడుతున్నాయి. నిర్వాసిత యువతకు రూ.రెండు లక్షల పరిహారం ఇచ్చామంటూ కంటి తుడుపు చర్యగా గత ఆదివారం ప్రభుత్వం జిఒ జారీ చేసింది.

టార్పాలిన్లతో గుడిసెలు

నిర్వాసితులకు ఒన్‌టైం సెటిల్‌మెంట్ కింద రూ.12.50 లక్షల ప్యాకేజీ ప్రకటించినప్పటికీ, ఇంకా వెయ్యి మందికి అందాల్సి ఉంది. అధికారులు ముంపు గ్రామాలను ఖాళీ చేయించడంతో సర్వస్వం కోల్పోయిన సుమారు 700 కుటుంబాలు పునరావాస కాలనీల్లో ప్లాస్టిక్ టార్పాలిన్లతో తాత్కాలిక గుడిసెలు, గుడారాలు వేసుకుని బతుకు వెళ్లదీస్తున్నాయి. రోడ్డపై మంచాలు వేసుకొని ఉంటున్నారు.

ఏడు పునరావాస కాలనీల్లోనూ మంచినీరు, విద్యుత్తు సౌకర్యం లేక నిర్వాసితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సమీప హోటళ్ల నుంచి భోజనం తెచ్చుకుంటూ రోజులు గడుపుతున్నారు. చిన్నారులు విద్యకు దూరమయ్యారు. నిలువ నీడలేక, తిండికిలేక నిర్వాసితులు రోడ్లపై రోదిస్తుంటే... అధికార నేతలు మాత్రం ప్రాజెక్టుకు జలహారతులు, పూలహారతులు పడుతూ సంబరాల్లో మునిగిపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కన్నెత్తి చూడని మంత్రులు, ఎమ్మెల్యేలు

వేలాది మంది నిర్వాసితులు ఇళ్లూ వాకిళ్లూ వదిలి రాత్రికి రాత్రే బయటకు వస్తే వాళ్లు ఎలా బతుకుతున్నారు? ఏం తింటున్నారు? అనే ఆలోచన పాలకపక్ష నేతలకు లేకుండా పోయింది. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందురోజు మంత్రులు నిర్వాసిత కాలనీల్లో పర్యటించి... ప్యాకేజీలు ఇస్తామని, పునరావాస కాలనీల్లో ఇళ్లు కట్టి ఇస్తామని, అన్ని విధాలా ఆదుకుంటామని హామీలు గుప్పించి వారిని ఖాళీ చేయించారు. ప్రాజెక్టును ప్రారంభించి పది రోజులు గడిచినా నిర్వాసితులను ఇప్పుడు పరామర్శించిన పాపాన పోలేదు. ఫీడర్‌ ‌కాలువ వద్దకు వెళ్లి నీటిని చూడాలని కార్యకర్తలు, అభిమానులకు నాయకులు చెబుతూ అదొక కార్యక్రమంగా పెట్టుకున్నారు. అక్కడకు వెళ్లి ఫొటోలు దిగడం, సోషల్‌‌ మీడియాలో పెట్టడం ఇదొక తంతుగా మారింది.

దళితుల పరిస్థితి దయనీయం

పొలాలు లేని దళితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీళ్లంతా తోకపల్లి, కర్నూలు-గుంటూరు రహదారి వైపు వెళ్లిపోయారు. రోజువారీ పనుల కోసం కొందరు పట్టణాలకు వెళుతున్నారని సమాచారం. కొందరు తమ పిల్లలను బంధువుల ఇళ్లుకు, మరికొందరు తమతో పాటి పనులకు తీసుకెళ్తున్నారు. ఇలా దళితుల బతుకులు చిన్నాభిన్నమయ్యాయి.

ఏ పనులు చేయాలో తెలియడం లేదు

వ్యవసాయం పోయిందని, సాగు చేసిన పంటలు నీటమునిగాయని నిర్వాసిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని ఒత్తిడి చేసి బలవంతంగా బయటకు పంపారని వాపోతున్నారు. తాము ఒక్కసారిగా అన్నీ కోల్పోయామని, ఇప్పుడు చేయాల్సిన వృత్తి, పనులు కూడా మారిపోవాల్సిందేనని, ఏ పనులు చేయాలో తెలియడం లేదని, కూలి పనులు కూడా దొరకడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు.

విలువైన సామగ్రి నీటిపాలు : దర్శనం మార్తమ్మ, సుంకేసుల

నా భర్త పేరు బాలకోటయ్య. మాకు ఇద్దరు కొడుకులు, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు దర్శనం పెద్ద భాస్కర్ కు మాత్రమే ప్యాకేజీ ఇచ్చారు. చిన్న కుమారుడు దర్శనం చిన్న భాస్కర్, ఆయన కుటుంబంలోని సంతానానికి ప్యాకేజీ అందలేదు. తన ఆరుగురు కుమార్తెలకూ అర్హుల జాబితాలో ఉన్నా ప్యాకేజీ ఇవ్వలేదు. ఇంతలోనే నీటిని విడుదల చేయడంతో ప్రాణభయంతో గ్రామం ఖాళీ చేయక తప్పలేదు. ఆ సమయంలో కట్టుబట్టలు, వంట పాత్రలు మాత్రమే వెంట తెచ్చుకోగలిగాం. విలువైన సామగ్రి అంతా ఇంటిలో ఉండిపోయి నీటిపాలైంది. ఆ సామానంత కొనలాంటే లక్ష రూపాయలకు పైగా వెచ్చించాలి.

ఎవరూ పట్టించుకోవడం లేదు : భూతపాటి సాల్మన్, సుంకేశుల

మెడపై కత్తిపెట్టినట్టినట్లు గ్రామాల నుంచి మమ్మల్ని నెట్టేశారు. గ్రామం ఖాళీ చేసి వచ్చాం. మా వంట సామగ్రి కూడా అక్కడే ఉంది. మేం వృద్ధాప్యంలో ఉన్నాం. తోకలపల్లి వద్ద పునరావాస కాలనీలో పరదాల మాటను తలదాచుకుంటున్నాం. విద్యుత్తు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రాత్రిపూట కటిక నేలపై నిద్రిస్తున్నాం. తమ వైపు ఏ అధికారీ, నాయకుడు కన్నెత్తి చూడడం లేదు. వెలిగొండ ప్రారంభోత్సవం ముందు చెప్పిన మాటలు ఇప్పుడు వినపడటం లేదు. తాగునీటికి సైతం ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు, ప్రభుత్వం ఆదుకుంటుందన్న నమ్మకం కోల్పోయాం. నా కుమార్తె బాల కుమారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందలేదు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్