‘జల్-జంగిల్-జమీన్’ ఒక నినాదం కాదు... ఆదివాసీల మనుగడకు మూలాధారం. అడవుల్లో ఉన్న అత్యంత విలువైన ఖనిజాలను, వనరులను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు గిరిజనుల హక్కులను కాలరాసే చర్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటుండటం దుర్మార్గం. నేటికీ ప్రాథమిక సౌకర్యాలు కూడా లేని ప్రాంతాల్లో దుర్భర జీవితాన్ని గడువుతూ, నిత్యం దోపిడీకి గురవుతూ, వ్యాధులు, ఇతర కారణాలతో ప్రాణాలు కోల్పోతున్న ఆదివాసీల రక్షణ ప్రభుత్వాల బాధ్యత.
‘భూమి, అడవులు మావే... అదానీ, అంబానీలవి కావు’ అంటూ ఢిల్లీ వేదికగా నినదించిన మన్యం బిడ్డల గోడును పట్టించుకోకపోతే వారి మనుగడకే కాదు... ప్రకృతి, సమస్త మానవాళి మనుగడకూ వినాశనమే. ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ (ఎఎఆర్‌ఎం) ఆధ్వర్యాన హస్తినలో సాగిన ఆదివాసీల భారీ ధర్నా, ప్రదర్శన, జాతీయ సదస్సు లేవనెత్తిన డిమాండ్లు ఎంతో సహేతుకమైనవి. రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌లో పొందుపరిచిన హక్కులు, అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఎ), పంచాయతీలకు విస్తరించిన షెడూల్డ్ ప్రాంతాల చట్టం (పీసా), 1/70 తదితర చట్టాలు అమలులో ఉన్నప్పటికీ ఆదివాసీలకు భూమి, అడవులు, సహజ వనరులపై హక్కులు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి లోకూర్ వ్యాఖ్యలు అక్షర సత్యం. ఆ చట్టాలను నిర్వీర్యం చేసే దుర్మార్గపు ప్రతిపాదనలను కేంద్రంలోని మోడీ సర్కారు ముందుకు తీసుకురావడం మరింత ఆందోళనకరం. గ్రామ సభల అధికారాలను పక్కనపెట్టి ఖనిజ వనరుల పేరుతో ఆదివాసీలను తరిమివేయడం, మణిపూర్‌లాంటి ప్రాంతాల్లో జాతి హింస పెచ్చరిల్లేలా కుట్రలు పన్నడం వారి హక్కులను హరించడమే.
ప్రకృతితో మమేకమైన విశిష్ట సంస్కృతి, సంప్రదాయాలకు, ప్రత్యేకమైన భాషలకు ఆదివాసీలు వారసులు. బ్రాహ్మణీయ సంస్కృతిని ప్రవేశపెట్టి వారి వారసత్వ సంపదకు విఘాతం కలిగిస్తూ, మతాల పేరుతో వైషమ్యాలు, మారణహోమాలు సృష్టిస్తున్న సంఘ్‌పరివార్ చర్యలను తిప్పికొట్టేలా ఆదివాసీలను చైతన్యపరచాల్సిన బాధ్యత అందరిదీ. కార్పొరేట్, ప్రైవేట్ రంగం విస్తరించడంతో వారి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రోజురోజుకూ కుంచించుకుపోతున్నాయి.
ఏళ్లతరబడి మలేరియా మన్యం బిడ్డల ఉసురు తీస్తూనే ఉండటం నిర్లక్ష్యపు ఏలుబడికి నిలువుటద్దం. పోలవరం జిల్లా చింతూరు సబ్ డివిజన్ పరిధిలో వారం రోజుల వ్యవధిలోనే విద్యార్థినులు పద్దం రోజా (9), మాడివి జమున (7), జాహ్నవి (13) ప్రాణాలు కోల్పోవడం సిగ్గుచేటు. మెయిన్ రోడ్డుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండి, రహదారి సౌకర్యం కూడా లేని గొల్లగుప్పకు చెందిన రోజా ఆగస్టు చివరి వారంలో ప్రాణాలు కోల్పోయింది. అక్కడ వైద్య శిబిరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్రం నిషేధించిన క్లోరోక్విన్ మాత్రలను పంపిణీ చేయడం ఏడేళ్ల జమున మరణంతోపాటు మరో 52 మంది అస్వస్థతకు దారితీయడం విషాదం. కోతులగుట్ట ఎపి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్న కూనవరం మండలం పల్లూరి విద్యార్థిని తెల్లం జాహ్నవి సరైన వైద్యం అందక మరణించడం మరో ఘోరం. ఈ ఘటనలను కప్పిపుచ్చుకునేందుకు అర్ధరాత్రి హడావిడిగా పోస్టుమార్టం నిర్వహించడం, డెత్ సర్టిఫికెట్లు తారుమారు చేయడం, బాధిత కుటుంబాలను పరామర్శించడానికి గొల్లగుప్ప గ్రామానికి గిరిజనసంఘం, సిపిఎం నాయకులు వెళ్లకుండా అడ్డుకోవడం బరితెగింపే. నేటికీ కలెక్టర్, ఐటిడిఎ పిఒలు ఆ గ్రామాన్ని సందర్శించకపోవడం బాధ్యతారాహిత్యమే. ‘అడవి బాట’ అంటూ హడావిడి చేసే ఉప ముఖ్యమంత్రి ఆ గ్రామాన్ని సందర్శిస్తే ప్రభుత్వ పనితీరు అర్థమవుతుంది. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. గిరిజన ప్రాంతాల్లో మలేరియా, ఇతర వ్యాధులతో మరణిస్తున్న వారి కుటుంబాలను ఆదుకోవాలి. వెంటనే స్పందించి మలేరియా నివారణకు ప్రతి గిరిజన గ్రామంలో శిబిరాలు ఏర్పాటు చేసి, అవసరమైన వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత. గిరిజనాన్ని చెట్టుకొకరు పుట్టకొకరుగా తరిమేసే ప్రమాదకరమైన ది మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) అమెండ్‌మెంట్ బిల్లు 2026ను కేంద్రం ఉపసంహరించుకోవాలి. ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతోపాటు ఆదివాసీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్లు కల్పించడం, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్‌లను పెంచడం ప్రభుత్వాల బాధ్యత. మన్యం బిడ్డల ఆవేదన అరణ్య రోదనగా మారితే నష్టపోయేది సమాజమే.







కామెంట్‌లు (0)