స్వతంత్ర, సమగ్ర పర్యావరణ, సామాజిక ప్రభావ అధ్యయనాలు జరిపి బహిర్గతం చేసేంత వరకు ఎ.ఐ డేటా సెంటర్లకు అనుమతి ఇవ్వరాదని, ఇచ్చిన వాటిని అధ్యయనాలు చేసేంతవరకు నిలిపివేయాలంటూ విశాఖపట్నంలో సెప్టెంబరు ఆరున జరిగిన జాతీయ సదస్సులో వక్తలు డిమాండ్ చేశారు.'' విశాఖపట్నం ప్రకటన'' ను ఆమోదించారు. ఇదే సమయంలో హైదరాబాద్‌లో నిర్మించ తలపెట్టిన ఫ్యూచర్ సిటీలో దేశంలో అతి పెద్ద ఎ.ఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వర్తమానంలో ఆర్థిక, సమాచార వ్యవస్థలలో డేటా (సమాచారం) ఎంతో కీలకంగా మారింది. అయితే ఏదైనాసరే కొత్త సమస్యలను సృష్టించకూడదన్నది పారిశ్రామిక విప్లవం నేర్పిన ఒక పెద్ద పాఠం. ఇటీవలి కాలంలో కాలుష్య కారక ఫ్యాక్టరీలు, ఉత్పత్తులతో పాటు డేటా సెంటర్లు కూడా పర్యావరణ సమస్యలను ముందుకు తెస్తున్నాయి. దాంతో వాటికి వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. టిడిపి కూటమి సర్కార్ విశాఖ జిల్లాలో ఏర్పాటు చేయిస్తున్న గూగుల్ డేటా సెంటర్‌తో తలెత్తే పర్యావరణ ముప్పు మీద ఎలాంటి నివేదికలు లేకుండా దొడ్డిదారిన దానికి అనుమతి ఇచ్చారు. అమెరికాను వదలి మన దేశానికి రావటం పెద్ద గొప్పగా ప్రచారం చేస్తున్నారు. అసలు సంగతేమిటంటే అక్కడ ఇలాంటి కేంద్రాల ఏర్పాటుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలతో ఇక్కడకు వస్తున్నాయి తప్ప మన మీద ప్రేమ కాదు.
డేటా సెంటర్ల భూమితో పాటు ఆ కేంద్రాలను చల్లబరిచేందుకు భారీ మొత్తంలో నీరు, విద్యుత్ అవసరం. గాలిలో కాలుష్యాన్ని పెంచుతాయి. వాతావరణం వేడెక్కుతుంది. అందుకే సమీపాల్లో నివశించేందుకు అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు అవసరమైన అనుమతుల కోసం స్థానిక, రాష్ట్ర, ఫెడరల్ ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలకు భారీ ఎత్తున ముడుపులు అందచేస్తున్నట్లు ఫుడ్ అండ్ వాటర్ వాచ్ (ఆహారం మరియు నీటిపై నిఘా) సంస్థ రాజకీయ డిప్యూటీ డైరెక్టర్ థామస్ మేయర్ చెప్పారు.
డేటా సెంటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ అమెరికాలో వందలాది సంస్థలతో '' డేటా సెంటర్ల నిలిపివేత కూటమి '' ఏర్పాటైంది. పర్యావరణ రక్షణ అంశంలో లోపభూయిష్టంగా ఉన్న అమెరికా ఎ.ఐ చట్టాన్ని రక్షించాలంటూ డోనాల్డ్ ట్రంప్ మద్దతుతో కార్పొరేట్ సంస్థలు చేసిన యత్నాన్ని పర్యావరణ పరిరక్షణ సంస్థలు వమ్ము చేశాయి. అంతటితో ఆగకుండా ఇప్పుడు రాష్ట్ర, స్థానిక స్థాయిలో ఆందోళన చేస్తున్నారు. దీంతో కొన్ని రాష్ట్రాల్లోని చట్టసభల సభ్యులు డేటా సెంటర్ల ఏర్పాటును వాయిదా వేయాలని తీర్మానాలు ప్రతిపాదిస్తున్నారు. డేటా సెంటర్లు వద్దని దేశంలో తొలిసారి తీర్మానం చేసిన రాష్ట్రంగా న్యూయార్క్ చరిత్రకెక్కింది. ఆందోళనలు ఉధృతంగాక ముందే సెంటర్ల ఏర్పాటుకు కంపెనీలు పరుగులు తీస్తున్నాయి. పెన్సిల్వేనియా రాష్ట్రంలో వీటి ఏర్పాటుతో తలెత్తిన సమస్యలను గుర్తించారు. వీటి నిర్మాణానికి భారీ యంత్రాల వినియోగంతో ధ్వని కాలుష్యం పెరిగింది. డీజిల్ జనరేటర్లతో వేడి పెరుగుతున్నది. ఎయిర్ కండిషనర్లు నిరంతరం రొద పెడుతున్నాయి. అక్కడ వెలువడే ధ్వని వినికిడి మీద ప్రభావం చూపుతున్నది. ఈ కేంద్రాలలో రాత్రంతా వెలుగు ఉండటంతో పరిసరాల జనాల్లో నిద్ర, లేచే సమయాల్లో తేడాలు వచ్చి సమస్యలు తలెత్తుతున్నాయి. దీన్ని వెలుగు కాలుష్యం అంటున్నారు. కొన్ని కేంద్రాలు గ్యాస్‌తో నడుస్తూ కాలుష్యాలను విడుదల చేస్తున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం అమెరికాలోని మొత్తం డేటా సెంటర్ల కారణంగా 2030 నాటికి ఆరు లక్షల మందిలో ఆస్మా లక్షణాలు కనిపిస్తాయని, 1300 మంది ముందుగానే చనిపోతారని, ఏటా ఆస్మాతో మరణిస్తున్నవారి కంటే మూడో వంతు మరణాలు పెరుగుతాయని, ప్రజారోగ్య రక్షణకు ఏటా అదనంగా 20 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని తేలింది.
డేటా కేంద్రాలకు పెద్ద మొత్తంలో విద్యుత్ అవసరం, వాటికోసం సరఫరా వ్యవస్థల నిర్మాణానికి ఖర్చు తడచి మోపెడంత అవుతుంది. ఆ మొత్తాన్ని దామాషా ప్రకారం అయినా గృహ వినియోగదారుల మీద కూడా మోపుతారు. అది వారి మీద అదనపు బాదుడే. ఈ విధంగా పెన్సిల్వేనియా రాష్ట్రంలో 20 శాతం రేట్లు పెరిగాయి. అంటే కార్పొరేట్ల లాభాల కోసం సాధారణ పౌరులు అదనపు భారం మోయాలి. పౌరుల నుంచి వ్యతిరేకత రావటంతో డేటా సెంటర్లు తమకు అవసరమైన విద్యుత్‌ను తామే ఉత్పత్తి చేసుకోవాలి లేదా స్థానికుల మీద భారం పడకుండా అదనపు చార్జీలు చెల్లించాలని రాష్ట్ర గవర్నర్ ప్రకటించాల్సి వచ్చింది. డేటా సెంటర్లు వద్దనే ఆందోళన ఒక్క అమెరికాకే పరిమితం కాలేదు. నెదర్లాండ్స్‌లోని జీవూల్డే అనే చిన్న పట్టణ ప్రజలకు డేటా సెంటర్ల వ్యతిరేక ఆందోళన గురించి 2021వరకు తెలియదు. అక్కడ మెటా 410 ఎకరాల ప్రభుత్వ భూమిలో 200 మెగావాట్ల కేంద్రాన్ని ప్రతిపాదించింది. ఆ పట్టణం మొత్తం వినియోగించే విద్యుత్‌కు రెండు రెట్లు ఈ కేంద్రానికి అవసరమని తేలింది. దీంతో అక్కడి జనాలు దాన్ని వ్యతిరేకించారు. మున్సిపాలిటీ ఆమోదించింది. చివరి వరకు అసలా కంపెనీని ఎవరు ఏర్పాటు చేస్తున్నారో కూడా తెలియకుండా చూశారు అధికారులు. అయితే నెదర్లాండ్స్ ప్రభుత్వమే డేటా సెంటర్లు 70 మెగావాట్లకు మించి పెట్టరాదని నిర్ణయించటంతో మెటా కేంద్రం రద్దయింది. తరువాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో డేటా సెంటర్‌ను వ్యతిరేకించిన వారే గెలిచారు. ఐర్లండ్‌లో వ్యతిరేకత కారణంగా యాపిల్ కంపెనీ ఒక బిలియన్ డాలర్ల ప్రాజెక్టును రద్దు చేసుకుంది. జనాల అభ్యంతరాలను సుప్రీంకోర్టు సమర్ధించింది. అయితే అక్కడి డేటా సెంటర్ల వివరాలను చూస్తే పదేళ్ల క్రితం దేశం మొత్తం వినియోగించే విద్యుత్‌లో కేవలం ఐదు శాతమే వినియోగించగా గతేడాది 23 శాతానికి చేరింది. 2034 నాటికి 31శాతం కానుంది. అడ్డగోలుగా కార్పొరేట్ సంస్థలకు దాసోహమనే రాజకీయ నేతలు పాలకులుగా ఉన్నపుడు వాటిని అడ్డుకోవటం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. చిలీలో గూగుల్ సంస్థ ఏర్పాటు చేయతలపెట్టిన కేంద్రంతో పర్యావరణ ప్రభావం గురించి తగిన నివేదిక ఇవ్వకపోవటంతో కోర్టు అడ్డుకున్నది. అదే గూగుల్ మరోచోట ఏర్పాటు చేయాలని చూసినప్పుడు దానిని జనం అడ్డుకున్నారు. ధనిక దేశాల వారు వినోదం కోసం ఎ.ఐ చిత్రాలను రూపొందించేందుకు మా నీటిని ఫణంగా పెట్టి డేటా కేంద్రాల నిర్మాణం అవసరం లేదని చిలీ నీటి హక్కుల సంస్థ ప్రతినిధి టానియా రోడ్రిగజ్ స్పష్టం చేశారు. ఉరుగ్వేలో గూగుల్ తలపెట్టిన కేంద్రానికి 20 లక్షల గాలన్ల నీరు కావాలని తేలటంతో జనం వ్యతిరేకించారు. చివరకు చల్లబరిచేందుకు నీటిని వాడబోమంటూ చిన్న కేంద్రానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా మరికొన్ని దేశాల్లో కూడా డేటా సెంటర్లకు వ్యతిరేకత పెరుగుతున్నది.
డేటా సెంటర్లకు సంబంధించి కొన్ని అవాస్తవాలు-నిజాల గురించి చూద్దాం. అమెరికా అనుభవాన్ని పరిశీలించినట్లయితే నిర్మాణ సమయంలో ఉపాధి తప్ప పర్మనెంటు ఉద్యోగాలు అంతంతమాత్రమే. ఒక పెద్ద కేంద్రంలో కేవలం 50 నుంచి 150 మందికి లభిస్తాయి. అవి కూడా భద్రతా సిబ్బంది, నిపుణులైన సాంకేతిక నిపుణులకే పరిమితం. అదనపు పెట్టుబడులు, అనుబంధ పరిశ్రమలు, ప్రభుత్వాలకు అదనపు పన్నులూ రావు. ప్రజల సొమ్మును వాటికి ఖర్చు చేస్తారు. స్థానిక వ్యాపారులకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. జార్జియా రాష్ట్రంలో 70 శాతం కేంద్రాలకు ఎలాంటి సబ్సిడీలు ఇవ్వలేదు. ఈ కేంద్రాలను చల్లబరిచేందుకు ఉపయోగించే నీటిని తిరిగి విడుదల చేసినపుడు అవి వేడిగా ఉంటాయి. నీటి వనరులు, పర్యావరణాన్ని ప్రభావితం చేసే కొత్త సమస్యలను సృష్టిస్తాయి. చైనాలో కూడా పెద్ద సంఖ్యలో డేటా సెంటర్లు ఉన్నాయి కదా వాటి సంగతేమిటని ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఎక్కడైనా సమస్యలు ఒకటే. అందుకే చైనా సముద్రాల్లో 35 మీటర్లలోతులో తేలియాడే వాటిని ఏర్పాటు చేసి నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నారు. ఒత్తిడిని తట్టుకొనే ఉక్కును తయారు చేస్తున్నారు. షాంఘై తీరంలో రెండు వేల సర్వర్లు ఉన్న కేంద్రాన్ని 115 అడుగుల లోతులో ఏర్పాటు చేశారు. ఇలాంటి ఏర్పాట్ల వలన 90 శాతం ఇంథనం ఆదా అవుతుంది. అవసరమైన విద్యుత్‌లో 97 శాతం సమీపంలోని ఉపరితల గాలి మరల ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. ఇతర దేశాల్లో కూడా ఇలాంటి ప్రయోగాలు జరిగాయిగానీ వాణిజ్య అవసరాలకు ఏర్పాటు చేయటం లేదు. బ్రిటన్‌లో మైక్రోసాఫ్ట్ జరిపిన ప్రయోగంలో భూమి మీద ఏర్పాటు చేసిన వాటి కంటే నీటిలో వాటి వైఫల్యాలు తక్కువగా ఉన్నట్లు తేలింది. అయినా వాణిజ్యపరంగా ముందుకు పోలేదు. ఉపాధి పేరుతో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వంటి పాలకులు కార్పొరేట్లకు భారీ మొత్తాల్లో అప్పనంగా సబ్సిడీలు ఇస్తున్నపుడు వాటిని ఎందుకు వదులుకుంటారు? ప్రత్యామ్నాయాల వైపు చూడటానికి వారేమైనా ప్రజల పక్షం వహించేవారా! వీటిని తిప్పికొట్టాల్సింది ప్రజలే!

ఎం. కోటేశ్వరరావు







కామెంట్‌లు (0)