- ఇరాన్ అణు హామీలపై ఐఎఇఎ స్పష్టీకరణ
వియన్నా, ఇరాన్ అణు కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ‘అత్యంత బలమైన ధృవీకరణ వ్యవస్థ’ను ఏర్పాటు చేయాలని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఎఇఎ) డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రాసీ పేర్కొన్నారు. అంతర్జాతీయ పర్యవేక్షక సంస్థకు పూర్తి స్థాయిలో అవకాశం కల్పించాలని, అప్పడే ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధిపరచకుండా చూడాలన్న కీలక లక్ష్యాన్ని అమలు చేసేలా చూసేందుకు వెసులుబాటు వుంటుందని చెప్పారు.
అణు బాంబును తయారుచేసే సామర్ద్యాన్ని ఇరాన్ సమకూర్చుకుంటోందని గత కొన్నేళ్ళుగా అమెరికా, దాని మిత్రదేశాలు గగ్గోలు పెడుతూ వస్తున్నాయి. కాగా ఇరాన్ మాత్రం ఆ వాదనను తోసిపుచ్చుతోంది. తమకు అలాంటి ఉద్దేశ్యమే లేదని స్పష్టం చేస్తోంది. పౌర ప్రయోజనాల కోసమే వాడాలన్నది తమ లక్ష్యమని చెబుతోంది.
అయితే ఇరాన్ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఈ విషయాన్ని చెబుతున్నా ఇక్కడ ఉద్దేశ్యాలు ఒక్కటీ సరిపోదని గ్రాసీ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఆయన, ‘‘వారు చెప్పినదాన్ని ధృవీకరించుకోవాలంటే ధృవీకరణకు చాలా బలమైన వ్యవస్థ వుండడం అవసరం, అదేసమయంలో ఆది ఆచరణాత్మకంగా కూడా వుండాలి.’’ అని స్పష్టం చేశారు. ఉద్దేశ్యాలను బట్టి అంచనా వేయరాదన్నది ఐఎఇఎ వైఖరి అని అన్నారు. అలాగే చెబుతున్న తీరును బట్టి కూడా ఆ అంశాన్ని ఆమోదించరాదన్నారు. ప్రతిచోటా మనం ధృవీకరించుకోవడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.
ఇదిలావుండగా, దాడికి గురైన అణు ప్రదేశాలను తనిఖీలు చేయడం, అణు పదార్ధాలను పరిశీలించడమనేది అమెరికాతో కుదిరే తుది ఒప్పందం పరిధిలో వుంటుందని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కజిమ్ ఘరిబాబది చెప్పారు. ఆంక్షలన్నింటినీ ఎత్తివేయడంపైనే ఈ తనిఖీలు కూడా ఆధారపడి వుంటాయని స్పష్టం చేశారు. కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీటన్నింటినీ కొట్టిపారేస్తున్నారు. ఉన్నత స్థాయిలో తనిఖీలకు ఇరాన్ ఆమోదించాల్సిందేనని హెచ్చరిస్తున్నారు.









కామెంట్‌లు (0)