- ఘటనపై సమగ్ర విచారణ
- బాధ్యుడైన ఆకివీడు సిఐను సస్పెండ్ చేయాలి
- న్యాయం జరగకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు
- దళిత ప్రజా సంఘాలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం పాందువ్వ గ్రామానికి చెందిన దళిత యువకుడు, మాజీ వలంటీర్ వీధి నవీన్ కుమార్ (26) ఆకివీడు సిఐతో పాటు పోలీసుల హింస తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత దారుణమని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి తెలిపారు. ఈ ఘటనను పోలీసుల హత్యగా పేర్కొన్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యాన బాధితులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ.. నవీన్ కుమార్ భార్య రజిత రాజకీయ నాయకుల అండదండలతో పోలీసుల పలుకుబడిని ఉపయోగించి నవీన్‌పై అక్రమ కేసులు పెట్టించిందన్నారు. మే 10న ఆకివీడు సిఐ కాలికా చరణ్ ఆదేశాల మేరకు పోలీస్టేషన్‌కు నవీన్‌ను పిలిపించి గంటల తరబడి ఎండలో నిలబెట్టడంతోపాటు, దుస్తులు పూర్తిగా తీసి లాఠీలతో ఒళ్లంతా కమిలిపోయేలా క్రూరంగా కొట్టారన్నారు. పోలీసులు పెట్టిన చిత్రహింసలను భరించలేక, తీవ్ర మనస్తాపానికి గురైన నవీన్ కుమార్ 11న రాత్రి గడ్డి మందు తాగాడని, కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించడంతో.. మృత్యువుతో పోరాడుతూ 12 రాత్రి 9 గంటలకు మరణించినట్లు పేర్కొన్నారు. 13న నవీన్ కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నివేదికను పోలీసులు పక్కదోవ పట్టించి కుట్రకు పాల్పడ్డారన్నారు. చనిపోవడానికి కొద్ది నిమిషాల ముందు నవీన్ కుమార్ కువైట్‌లో ఉన్న తన తల్లితో మాట్లాడిన 50 నిమిషాల వాట్సాప్ వాయిస్ కాల్ సంభాషణను ‘మరణ వాంగ్మూలంగా, ఆయన పంపిన ఫొటోలను ఆధారాలుగా పరిగణించాలన్నారు. నవీన్ భార్య సైతం పోలీసులే కొట్టారని చెప్పిందన్నారు. నవీన్ వీపుపై ఉన్న గాయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. స్థానిక పోలీసులు, సిఐని రక్షించేందుకు, కేసును పక్కదారి పట్టించేందుకు సాక్ష్యాలను నీరుగారుస్తున్నారని మాల్యాద్రి ఆవేదన వ్యక్తం చేశారు. వ్యసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నవీన్ ఆత్మహత్యకు ప్రత్యక్ష కారకుడైన ఆకివీడు సిఐపై తక్షణ చర్యలు తీసుకోవాలని, విధుల్లోంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్ మాట్లాడుతూ.. సిఐను కాపాడటానికి స్థానిక అధికార పార్టీ ప్రజా ప్రతినిధి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారని, అందుకే సిఐ కొట్టిన ఆధారాలను మాయం చేస్తున్నారన్నారు. కెవిపిఎస్ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కె క్రాంతి బాబు మాట్లాడుతూ.. నవీన్ కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి, నవీన్ తల్లి వీధి బుజ్జికి, కుటుంబానికి తగిన పోలీస్ రక్షణ కల్పించాలని కోరారు. డిహెచ్‌పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు, డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి బాధిత దళిత కుటుంబానికి న్యాయం చేయకపోతే దళిత, ప్రజా సంఘాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, కార్యక్రమాలు చేపడతామన్నారు. పౌరహక్కుల సంఘం నేత ఆంజనేయులు, దళిత జాగృతి సేన అధ్యక్షులు కాసాని గణేష్, కనకరాజు, రెల్లి హక్కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్, దళిత సేన రాష్ట్ర అధ్యక్షులు చింతా వెంకటేశ్వర్లు, భీమ్ లాల్ నాయకులు విజయ్, దాసరి రంగనాథ్, పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ తదితరులు మద్దతుగా పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)