- సిఐ నాగరాజుకు ఇద్దరు కానిస్టేబుళ్లు, ప్రైవేటు వ్యక్తి సహకరించినట్లు గుర్తింపు
ప్రజాశక్తి - విజయవాడ : సాయికృష్ణ లాకప్ డెత్ కేసు విచారణను సిట్ అధికారులు వేగవంతం చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో సిఐ నాగరాజు అరెస్ట్, రిమాండ్ అనంతరం సిట్ అధికారుల దర్యాప్తులో మరిన్ని కొత్త విషయాలు బయటపడ్డాయి. మృతదేహం మాయం చేయడంలో మరికొందరి పాత్రను సిట్ గుర్తించింది. సిఐ నాగరాజుకు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నానితోపాటు ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఒక ప్రైవేట్ వ్యక్తి సురేష్ సహకరించినట్లు సిట్ అధికారులు తేల్చారు. సిఐ అరెస్టైన వెంటనే ఆయనకు సహకరించి ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు నిర్ధారణకు వచ్చారు. సిఐ అసిస్టెంట్‌గా అశోక్ వ్యవహరించగా.. నాని సిఐ పేరు చెప్పుకుని ప్రైవేట్ సెటిల్‌మెంట్లు, దందాలు నడపడంలో కీలక పాత్ర పోషించినట్లు తేలింది. గతంలో గన్నవరం, పటమట పోలీస్ స్టేషన్లలో పని చేసినప్పుడు నానిపై అనేక ఆరోపణలు రావడంతో అధికారులు విఆర్‌కు పంపారు. ఇటీవలే మళ్లీ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు హెడ్ కానిస్టేబుల్‌గా ఆయన పోస్టింగ్ తెచ్చుకున్నాడు. సాయికృష్ణ మృతదేహాన్ని లొకేషన్ నుండి మాయం చేయడంలో సురేష్ ప్రధాన పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. గత నెల 29న ఓ సెటిల్‌మెంట్ విషయమై సురేష్ పిలిచారని, ఆ తర్వాత సురేష్, అశోక్, నాని కలిసి నల్లటి రంగు వాహనంలో వడ్డేశ్వరంలోని తన ఇంటికి వచ్చి హడావుడి చేసి బెదిరించారని సాయికృష్ణ మేనమామ నవరంగ్ స్వయంగా సిట్ అధికారుల విచారణలో వెల్లడించారు. వడ్డేశ్వరం వెళ్లిన సిసి ఫుటేజిని సిట్ స్వాధీనం చేసుకుంది. కీలకంగా వ్యవహరించిన అశోక్, నాని, సురేష్ కోసం సిట్ ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. త్వరలోనే వీరిని అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు రాబట్టే అవకాశం ఉంది.
సిబిఐకి అప్పగించాలి
- ఐలు, బిబిఎ, హెచ్‌ఆర్‌సి
విజయవాడ కృష్ణలంక సాయికృష్ణ లాకప్‌డెత్ కేసును సిబిఐకి అప్పగించాలని ఐలు, బిబిఎ, హెచ్‌ఆర్‌సి డిమాండ్ చేశాయి. వాస్తవాలు వెలుగులోకి రావాలన్నా, బాధితులకు న్యాయం జరగాలన్నా సిబిఐతో విచారణ చేయించాలని కోరాయి. విజయవాడలో శుక్రవారం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర రాజేంద్ర ప్రసాద్, బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు కనకదుర్గ, హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యులు సతీష్ మీడియాతో మాట్లాడుతూ లాకప్ డెత్ వ్యవహారం ఒక్క సిఐ నాగరాజు వల్లే జరిగేదికాదన్నారు. దీని వెనుక పాత్రదారులు, సూత్రదారులు ఎవరనేది నిగ్గుతేల్చాలంటే పోలీసుల వల్ల కాదన్నారు. విజయవాడలో 25 ఏళ్ల తర్వాత మరో లాకప్ డెత్ జరిగిందన్నారు. గతంలో బుడ్డ శంతన్ అనే యువకుడిని గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌లో పోలీసులే కాల్చి చంపిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. చట్టాన్ని, న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా హత్యలు చేస్తామంటే పౌర సమాజం చూస్తూ ఊరుకోదన్నారు. రౌడీషీటరైన సాయికృష్ణను చంపడం సరైనదేనని కొందరు వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఇటువంటి అరాచకాన్ని, ఆటవిక న్యాయాన్ని సమర్ధిస్తే సమాజం ప్రమాదంలో పడుతుందన్నారు. నేరస్థుల్ని చంపేదీ పోలీసులే అయినప్పుడు భవిష్యత్తులో అమాయక ప్రజలను కూడా నేరస్థులని ముద్రవేసి చంపరనే గ్యారంటీ ఏముందని ప్రశ్నించారు. నేరస్థులను విచారించి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టి శిక్షలు పడేలా చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. దేశంలో జరిగిన లాకప్‌డెత్ కేసుల్లో ఎక్కువగా సిబిఐతోనే విచారణ జరిపించారని గుర్తుచేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో మే 1 నుండి జూన్ 1 వరకు పక్కాప్లాన్ ప్రకారం సిసి పుటేజి మాయమైనంత మాత్రాన సాక్ష్యాలు మాయం కావని వారు పేర్కొన్నారు.
ఎన్‌హెచ్‌ఆర్‌సి ఆగ్రహం
- వారంలోగా నివేదిక ఇవ్వాలని డిజిపి, సిపికి ఆదేశం
గాదె సాయికృష్ణ లాకప్ డెత్‌పై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై వెంటనే నివేదిక సమర్పించాలని డిజిపి, విజయవాడ పోలీస్ కమిషనర్‌కు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. వారంలోగా ఈ ఘటనపై యాక్షన్ టేకెన్ రిపోర్టు పంపాలని ఆదేశించింది. సిట్ దర్యాప్తు వివరాలు, పోలీసులకు వ్యతిరేకంగా దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ వివరాలు ఇవ్వాలని పేర్కొంది. పోలీసు స్టేషన్‌లో డిలీట్ చేసిన సిసిటివి పుటేజీ రికవరీ చేయాలని, సాయి కృష్ణ అస్థికలను కనుగొనాలని ఆదేశించింది. సాయికృష్ణ తల్లికి రక్షణ కల్పించాలని, ఈ ఘటనలో సాక్షులను కాపాడాలని, బాధితులకు ఇచ్చిన మధ్యంతర నష్టపరిహారం, సహాయం వివరాలను అందజేయాలని కోరింది. తదుపరి విచారణ వారం తర్వాత చేపడతామని ఎన్‌హెచ్‌ఆర్‌సి తెలిపింది.








కామెంట్‌లు (0)