శనివారం, 11 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

బహామాస్‌ విషాదం: సముద్రంలో విమానం కుప్పకూలి 10 మంది మృతి

3 గంటల క్రితం

flight
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 07:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

నసావు: బహామాస్ దేశ 53వ స్వాతంత్ర్య దినోత్సవం రోజే అక్కడ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 10 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ చిన్న విమానం శుక్రవారం సముద్రంలో కుప్పకూలిపోవడంతో అందులోని వారంతా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదం నేపథ్యంలో బహామాస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి, సదరు విమానయాన సంస్థ ‘ఫ్లెమింగో ఎయిర్’ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రమాదం జరిగిందిలా.. రాజధాని నసావులోని లిండెన్ పిండ్లింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 'సెస్నా 402' రకానికి చెందిన ఓ చిన్న విమానం శాన్ ఆండ్రోస్ ద్వీపానికి బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నసావుకు పశ్చిమ దిశగా ఉన్న నార్త్ ఆండ్రోస్ సముద్ర జలాల్లో ఈ విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగిన తర్వాత ఒకరు ప్రాణాలతో బయటపడ్డారని బహామాస్ ప్రధాని ఫిలిప్ బ్రేవ్ డెవిస్ తొలుత ప్రకటించినప్పటికీ.. ఆ తర్వాత సదరు బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య మొత్తం 10కి చేరింది. సంతోషంగా జరుపుకోవాల్సిన స్వాతంత్ర్య దినోత్సవం కాస్తా ఇలా ఘోర ప్రమాదంతో శోకదినంగా మారిపోవడంపై ప్రధాని ఫిలిప్ బ్రేవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్