హైదరాబాద్ : తనపై పోక్సో కేసు పెట్టారన్న కోపంతో రగిలిపోయిన నిందితుడు రాజ్ కుమార్ ప్రియురాలు మైనర్ బాలికను, ఆమెతోపాటు తల్లిని, నానమ్మను హత్య చేశాడు. ఆ తర్వాత భార్యా బిడ్డల్ని అంతమొందించి కారులో పరారయ్యాడు. ఈ మారణ హోమం కేవలం 20 నిమిషాల్లోనే సాగిందని సీపీ తరుణ్ జోషి తెలిపారు. ఈ హత్యలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. , రాత్రి హత్య జరిగినట్లు తమకు సమాచారం వచ్చిందని, ఈ ఘటన రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగినట్లు తెలిపారు. ఘటనాస్థలాన్ని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ పరిశీలించి కీలక ఆధారాల కోసం తనిఖీలు నిర్వహించామని తెలిపారు.
మొదట నిందితుడు రాత్రి 11 గంటల సమయంలో షాబాద్‌లోని బాధితురాలి ఇంటికి వెళ్లాడని, అక్కడ బాధితురాలి తల్లి, నానమ్మను కత్తితో హత్య చేశాడని చెప్పారు. మే 16న నిందితుడిపై పోక్సో కేసు నమోదు అయిందని, ఆ కేసులో అతనికి బెయిల్ లభించిందని సీపీ వెల్లడించారు.నిందితుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, బాధితురాలికి తల్లి, నానమ్మ ఉన్నారని తెలిపారు. బాధితురాలి తల్లి, నానమ్మను హత్య చేసిన అనంతరం, బాలికను నగర్‌కుంట సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లి హత్య చేశాడని వివరించారు. ఆ తర్వాత నిందితుడు తన ఇంటికి వెళ్లి భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడని సీపీ తెలిపారు. హత్యల అనంతరం రాజ్ కుమార్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి “నేను ఆరుగురిని చంపాను… నేను కూడా చనిపోతున్నాను” అని చెప్పాడని వెల్లడించారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు రాజ్ కుమార్ పరారీలో ఉన్నాడని, అతని కోసం ఏడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని సీపీ వెల్లడించారు. భార్య, ఇద్దరు చిన్నారులను కూడా హత్య చేయడం తమను సైతం ఆశ్చర్యానికి గురి చేసిందని ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి పేర్కొన్నారు.
ప్రాథమిక విచారణలో నిందితుడికి గతం నుంచే నేర చరిత్ర ఉన్నట్లు తెలిపారు. నిందితుడు రాజ్‌కుమార్‌పై మే 16 కేసు నమోదైందని తెలిపారు. అనంతరం అతడు పరారయ్యాడని, అప్పటి నంచి అతడి కోసం గాలించి అరెస్టు చేసినట్లు తెలిపారు. తర్వాత రాజ్‌కుమార్ బెయిల్ వచ్చి బయటకు వచ్చాడని.. అతడికి రెండు, మూడుసార్లు కౌన్సిలింగ్ కూడా ఇచ్చామని తెలిపారు. రాజ్‌కుమార్ మానసిక పరిస్థితి సరిగా లేదన్నారు. అతడికి బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అలవాటు కూడా ఉందని తెలిపారు.








కామెంట్‌లు (0)