గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

దక్షిణ యూరప్‌వ్యాప్తంగా దావానలం!

2 రోజుల క్రితం

fire accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 11:04 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఇళ్ళను ఖాళీ చేస్తున్న వేలాదిమంది

- పోరాడుతున్న అగ్నిమాపక యంత్రాలు

- పోర్చుగల్‌, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, గ్రీస్‌ తదితర దేశాల్లో పెద్ద ఎత్తున తరలింపులు

పారిస్‌ : దక్షిణ యూరప్‌‌వ్యాప్తంగా పలు దేశాల్లో దావానలం చెలరేగింది. పోర్చుగల్‌, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, గ్రీస్‌ ‌తదితర దేశాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలను తరలిస్తున్నారు. పెద్ద ఎత్తున చెలరేగుతున్న అగ్ని కీలలను అదుపు చేసేందుకు అగ్నిమాపక యంత్రాలు పోరాడుతున్నాయి. ఇప్పటికే ఈ దావానలంలో 20వేల హెక్టార్ల (50వేల ఎకరాలు)కు పైగా అడవి నాశనమైంది. మే, జూన్‌ ‌మాసాల్లో ఈ ప్రాంతమంతా విపరీతమైన వడగాలులను చవిచూసింది. టూర్‌ ‌డి ఫ్రాన్స్‌‌ (సైకిల్‌ రేస్‌) కు కూడా ముప్పు వాటిల్లనుంది. దాంతో ప్రేక్షకులను రాకుండా అధికారులు నిషేధం విధించారు. ‌దీంతో ఎవరూ లేకుండానే సోమవారం మూడో దశ రేసింగ్‌ ‌జరిగింది. స్పెయిన్‌‌ నుండి ఫ్రాన్స్‌‌కు వచ్చే 196కిలోమీటర్ల పొడవునా కేవలం రైడర్లను, వారి టీమ్‌ ‌వాహనాలను మాత్రమే అనుమతించారు. వాయవ్య ఫ్రాన్స్‌‌లో పైరనీస్‌ ‌సమీపంలో కార్చిచ్చు చెలరేగడంతో 4,600కి పైగా హెక్టార్ల అటవీ ప్రాంతం తగలబడిపోయింది. అక్కడ నుండి దాదాపు 10వేల మందిని ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించారు.

స్పెయిన్‌‌లోని ఈశాన్య గిరొనా ప్రాంతంలో శుక్రవారం మొదలైన కార్చిచ్చు కోస్టా బ్రావా టూరిస్ట్‌ బీచ్‌‌లను కూడా చుట్టుముట్టింది. దాదాపు 2200 హెక్టార్ల అటవీ ప్రాంతం దగ్ధమైంది. సోమవారానికి కూడా అక్కడ మంటలు అదుపులోకి రాలేదు. స్పెయిన్‌‌ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 40డిగ్రీల సెల్సియస్‌ ‌దాటుతున్నాయి. దీంతో కొత్తగా మంటలు చుట్టుముట్టే ప్రమాదముందని అధికారులు భయపడుతున్నారు.

ఉత్తర గ్రీస్‌‌లోని థెస్సాలొనికి ప్రాంతంలో అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటల్లో రెండు ఫ్యాక్టరీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారిని ఖాళీ చేయించారు. పోర్చుగల్‌‌లో కార్చిచ్చు ధాటికి 13వేల హెక్టార్ల భూమి తగలబడింది. కొంతమేరా మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా దేశంలో నాలుగు ప్రధాన ప్రాంతాల్లో సోమవారం కూడా వడగాలులు కొనసాగుతున్నాయి.

శిలాజ ఇంధనాలు విపరీతంగా మండిస్తున్నందున వాతావరణంలో తీవ్రమైన మార్పులు వస్తున్నాయని, వీటివల్ల దావానలం, ఆకస్మిక వరదలు వంటి ప్రమాదాలు పెరిగే అవకాశాలు వున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్