- హిట్లర్‌ను 'నియంత'గా పేర్కొన్న భాగం తొలగింపు..
- సావర్కర్‌కు ప్రశంసలు..
- చరిత్రను వక్రీకరిస్తున్న కేంద్రంపై విమర్శలు
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సంఘ్ పరివార్ భావజాలాన్ని చొప్పిస్తోందనే విమర్శలకు బలం చేకూరేలా ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో మరోసారి వివాదాస్పద మార్పులు చేసింది. హిట్లర్‌ను "జాతివాద భావజాలం ఆధారంగా పనిచేసిన నియంత"గా పేర్కొన్న భాగాన్ని తొలగిస్తూ, హిందుత్వ సిద్ధాంతకర్త వి.డి. సావర్కర్‌ను ప్రశంసించే అంశాలను కొత్తగా చేర్చింది. 'సంపూర్ణ స్వాతంత్ర్యం' అధ్యాయంలో "1925లో వినాయక్ దామోదర్ సావర్కర్ కూడా స్వరాజ్యం కోసం ఇలాంటి డిమాండ్ చేశారు" అనే వాక్యాన్ని చేర్చారు. అలాగే, గతంలో ఉన్న "సుభాష్ చంద్రబోస్ అడాల్ఫ్ హిట్లర్ సహాయం కోరారు" అనే వాక్యాన్ని మార్చి, "సుభాష్ చంద్రబోస్ కూడా బ్రిటీష్ వ్యతిరేక శక్తుల సహాయం కోరారు"గా రాశారు.
1947 విభజనపై కాంగ్రెస్ వైఖరికి సంబంధించిన విభాగాలను కూడా మార్చారు. ‘మహాత్మా గాంధీతో సహా ప్రముఖ కాంగ్రెస్ నాయకులు విభజనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, అది ఒక్కటే ముందుకు వెళ్ళే మార్గమని అంగీకరించారు’ అనేదాన్ని ‘ఆ సమయంలో విభజన ఆలోచనకు తీవ్ర వ్యతిరేకత ఉండేది. కాంగ్రెస్ పార్టీ కూడా దానిని వ్యతిరేకించాల్సి వచ్చింది. అది ఒక్కటే ముందుకు వెళ్ళే మార్గమా కాదా అనేది ఇప్పటికీ చర్చనీయాంశం’ అని మార్చారు. విభజన సమయంలో మత అల్లర్లలో కాంగ్రెస్ నాయకులు నిస్సహాయులయ్యారనే భాగాన్ని కూడా తొలగించారు.
అదేవిధంగా, సుప్రీంకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసిన అనంతరం "న్యాయ వ్యవస్థలో అవినీతి"కి సంబంధించిన అంశాన్ని కూడా పాఠ్యపుస్తకం నుంచి తొలగించారు.
విద్యను రాజకీయ, మతపరమైన భావజాల ప్రచారానికి వేదికగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పలువురు విద్యావేత్తలు, ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. గతంలో మహాత్మా గాంధీ హత్య, మొఘల్ చరిత్ర వంటి కీలక అంశాలను కూడా పాఠ్యపుస్తకాల నుంచి తొలగించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.








కామెంట్‌లు (0)