- స్టేడియానికి నష్టం జరగొద్దు : ఎమ్మెల్యే అరవిందబాబు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఈ నెల 17న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నరసరావుపేటలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు అధికారులను ఆదేశించారు. గురువారం మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తనతో కలిసి డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణాన్ని సందర్శించి సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పాల్గొనే క్రెడిట్ అవుట్‌రీచ్ ప్రోగ్రాంలో భారీ స్థాయిలో రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సుమారు 30 వేల మంది లబ్ధిదారులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుధ్యం, పార్కింగ్, రవాణా, భద్రత తదితర అన్ని మౌలిక వసతులను సమకూర్చాలని అధికారులకు సూచించారు. ఇదిలా ఉండగా సభ ఏర్పాట్ల కారణంగా స్టేడియం క్రీడా మైదానం దెబ్బతినే అవకాశం ఉందంటూ స్థానిక క్రీడాకారులు, ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఆయన మైదానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారులు చేపడుతున్న ఏర్పాట్లపై వివరాలు తెలుసుకుని సభ నిర్వహణతో పాటు క్రీడా మైదానానికి ఎలాంటి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమం ముగిసిన వెంటనే మైదానాన్ని యథాస్థితికి తీసుకురావాలని, క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.







కామెంట్‌లు (0)