- సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై నేతాజీ
ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై నేతాజీ డిమాండ్ చేశారు. గురువారం ఎం.టి.ఎం.సి పరిధిలోని కుంచనపల్లి లో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఏర్పాటుచేసిన సిపిఎం మైకు ప్రచార కార్యక్రమాన్ని, అంబేద్కర్ సెంటర్ వద్ద పార్టీ జెండాను ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నేతాజీ మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల స్థలాలు పట్టాల లబ్ధిదారులకు రాష్ట్రవ్యాప్తంగా 55 వేల మందికి రాజధాని ప్రాంతంలో పట్టాలు మంజూరు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 మే నెలలో వైసిపి ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేసిందన్నారు. ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం నివాస ప్రాంతాలలోని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చేస్తున్నామని నమ్మ బలికిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ లబ్ధిదారులకు ఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు. మంగళగిరి నియోజకవర్గం లోని ఇళ్ల స్థలాలు, పట్టాల లబ్ధిదారులు 20వేల మంది ఉన్నారని లెక్కలు తేల్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రకటనలకే పరిమితమైన ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీలు ఎప్పుడూ నెరవేరుస్తారో చెప్పాలని నేతాజీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికే వేలాదిమంది పేదలు పిడబ్ల్యుడి, కొండ పోరంబోకు, చెరువు పోరంబోకు, అటవీ ప్రాంతాలలో పేదలు నివసిస్తున్నారని ఆయన అన్నారు. నివాస ప్రాంతాలలో అద్దెలు కట్టుకోలేక, పెరిగిన ధరలతో సతమతమవుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మూడు వేల మందికి మాత్రమే పట్టాలిచ్చారని అన్నారు. మిగిలిన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు. 2025 ఆగస్టులో రెండవ దశ పట్టాలు ఇస్తానని చెప్పిన మంత్రి లోకేష్ మాట తప్పారన్నారు. గత సంవత్సరం అక్టోబర్లో మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట లబ్ధిదారులైన పేదలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారని, ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ నెల 15వ తేదీ లోకేష్ క్యాంపు కార్యాలయం రాయబారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు విషయంలో మంత్రి నారా లోకేష్ మాట నిలబెట్టుకోవాలని, లేనిపక్షంలో సిపిఎం పేదల పక్షాన నిలబడి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతుందని నేతాజీ హెచ్చరించారు. సిపిఎం తాడేపల్లి మండల నాయకులు కాజా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం, యువ గళం పాదయాత్రలో పేదలకు లోకేష్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం తాడేపల్లి మండల కార్యదర్శి పల్లె కృష్ణ, సిపిఎం తాడేపల్లి మండల నాయకురాలు కొండపల్లి యశోద, నాయకులు అమ్మిశెట్టి రామారావు, అమ్మిశెట్టి సుధాకర్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)