- అసమ్మతి గొంతు నొక్కడంలో భాగమే ఎస్ఎఫ్ఐ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎస్ఎఫ్ఐ ఢిల్లీ రాష్ట్ర కమిటీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మెటా సస్పెండ్ చేసింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్, విద్యా రంగ ప్రైవేటీకరణ వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని పదేపదే విమర్శిస్తున్న ఈ ఖాతాను మెటా బ్లాక్ చేసింది. ఈ పేజీలో ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి నాయకత్వంపై విమర్శలు కూడా ఉన్నాయి. ఈ ఖాతాకు సుమారు 15 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. నిషేధం తరువాత ఎస్ఎఫ్ఐ మెటాకు అప్పీల్ చేసింది. రెండేళ్ల ఇదే ఖాతాను సంఘ్ పరివార్ సభ్యులు హ్యాక్ చేశారు. అప్పుడు హ్యాకర్లు ఈ ఖాతాతో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ అనుకూల కంటెంట్‌ను వ్యాప్తి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాత పేజీని పునరుద్ధరించారు. విద్యా రంగంలోని సంక్షోభాన్ని పరిష్కరించడానికి బదులుగా, అసమ్మతివాదుల గొంతు నొక్కడానికి బిజెపి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఈ చర్య స్పష్టం చేస్తోందని ఎస్ఎఫ్ఐ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు సూరజ్ ఇలమోన్, కార్యదర్శి ఐషే ఘోష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇది ఎస్ఎఫ్ఐపై దాడి మాత్రమే కాదని, ప్రశ్నించడానికి, సంఘటితం కావడానికి, మాట్లాడటానికి ప్రతి విద్యార్థికి ఉన్న ప్రజాస్వామ్య హక్కులపై దాడి అని స్పష్టం చేసింది. విద్యార్థుల గళాన్ని అన్ని విధాలుగా వినిపిస్తామని, నిషేధం విధించే చర్యను ప్రతిఘటిస్తామని పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)