ప్రజాశక్తి - శాంతిపురం (చిత్తూరు జిల్లా) : పేదరిక నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యంతో కూడిన శాశ్వత పరిష్కారంగా పి4 కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పేదల జీవితాలు బంగారుమయం కావాలనే ఉద్దేశ్యంతోనే పి4 ద్వారా బంగారు కుటుంబాలు-మార్గదర్శుల విధానాన్ని అవలంభిస్తున్నామన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా ఆదివారం పి4 మార్గదర్శులు, బంగారు కుటుంబాలతో నిర్వహించిన సమావేశంలో సిఎం మాట్లాడారు. బంగారు కుటుంబాల ఆర్థిక, సామాజిక అభ్యున్నతే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న మెగా, అదాని, టివిఎస్ మోటార్ సైకిల్స్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. బంగారు కుటుంబాలు కేవలం ప్రభుత్వ సహాయంపై ఆధారపడే పరిస్థితిలో కాకుండా, ఆర్థికంగా ఎదిగి ఇతరులకు సైతం చేయూతనిచ్చే స్థాయికి చేరుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఇందుకోసం బంగారు మిత్రల సహకారంతో ప్రతి కుటుంబం స్థితిగతులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ, వారి అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. పి4 కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో జీరో పావర్టీ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని చంద్రబాబు తెలిపారు. దీనిని ఎంబికె–10:20 నమూనాగా అమలు చేస్తున్నామన్నారు. కుప్పం నియోజకవర్గంలో తొమ్మిది వేల బంగారు కుటుంబాలను అభివృద్ధి చేసే బాధ్యతను అదాని, టివిఎస్, మెగా సంస్థలకు అప్పగించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపి దగ్గుమళ్ల ప్రసాద్, చిత్తూరు జిల్లా ప్రజా ప్రతినిధులు, కుప్పం స్థానిక నేతలు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
క్రిషి పౌల్ట్రీ ఫార్మ్ ప్రారంభించిన సిఎం
కుప్పం పర్యటనలో భాగంగా మూడోరోజు ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాంతిపురం మండలం నందిగం హరిప్రసాద్‌కు చెందిన పర్యావరణ నియంత్రిత క్రిషి పౌల్ట్రీ ఫారంను ప్రారంభించారు. ఆధునిక కోళ్ల పెంపకానికి సంబంధించిన ఎన్విరాన్‌మెంటల్ కంట్రోల్డ్ పౌల్ట్రీ షెడ్‌ను పూర్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి మాట్లాడారు. ఉష్ణోగ్రత, తేమ, గాలి, వెలుతురు అన్నింటినీ సాంకేతికత ద్వారా నియంత్రించి, కోళ్లకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించవచ్చని వివరించారు. దీనివల్ల గుడ్లు, మాంసం ఉత్పత్తి పెరగడంతో పాటు, కోళ్లు చనిపోవడం తగ్గుతుందని తెలిపారు. ఈ ఆధునిక పౌల్ట్రీ షెడ్‌తో అన్ని కాలాల్లోనూ రైతులు స్థిరమైన ఉత్పత్తి సాధించగలరని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నందిగం ఉదయ్ కుమార్, పికెఎం కడ చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్సీ గౌని వారి శ్రీనివాసులు, నాయకులు భాస్కర్ పాల్గొన్నారు.
సీనియర్ నేత చెంగాచారి ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి
కుప్పం టిడిపి సీనియర్ నాయకులు చెంగాచారి ఇంటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లారు. కడపల్లిలోని తన నివాసం నుంచి కుప్పం వెళ్తున్న సమయంలో చెంగాచారి కోరిక మేరకు శాంతిపురంలోని ఆయన ఇంటికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు తన నివాసం వద్దకు వచ్చిన కుప్పం వాసుల నుంచి వినతులను స్వీకరించారు. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.







కామెంట్‌లు (0)