ఆదివారం, 05 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అవయవాలు కోల్పోయినా.. ఆశలు సజీవంగా...

-219 నిమిషాల క్రితం

jeenava
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 05:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్న ఫిఫా వరల్డ్ కప్‌ను శిథిలాల మధ్య జీవిస్తున్న గాజా పౌరులు కూడా చూస్తున్నారు. వాళ్లకు అందరిలా ఇళ్లు లేవు. క్రీడా ప్రాంగణాలు లేవు. కనీసం ఫోన్లలో సిగ్నళ్లు కూడా లేవు. అయినా వారికి దొరికిన అతి చిన్న వెసులుబాటులోనే ఫిఫా కప్‌ను వీక్షిస్తున్నారు. అక్కడే ఓ చోట కొంతమంది అమ్మాయిలు ఇవేమీ పట్టించుకోకుండా చాలా శ్రద్ధగా, తీక్షణంగా ఫుట్‌బాల్ ఆడుతున్నారు. వాళ్ల కళ్లల్లో ఏదో సాధించాలన్న పట్టుదల స్పష్టంగా కనిపిస్తోంది. 'గాజా ఎంప్యూటీ ఫుట్‌బాలర్స్' అని పిలవబడే ఈ తొలి మహిళా ఫుట్‌బాల్ బృందంలోని సభ్యులంతా వైకల్య బాధితులే. పుట్టుకతో వచ్చిన వైకల్యమో, దాడుల వల్ల అవయవాలు కోల్పోవడమో వారిని ఇక్కడికి చేర్చింది. ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌ను వీక్షిస్తున్న కోట్లాది మందిలో వీరూ ఉన్నారు. అయితే అందరిలాంటి వాళ్లు కాదు ఈ మహిళలు. ఏదో ఒక రోజు ప్రపంచ వేదికపై తమ ఆటతో గాజా ప్రజల ఆత్మవిశ్వాసాన్ని, పట్టుదలను చాటాలన్న కోరిక వారిలో బలంగా ఉంది.

పాలస్తీనాలో మిగిలివున్న ఒకే ఒక్క క్రీడా మైదానం దైర్ అల్ బలాహ్. అక్కడే ఈ ఎంప్యూటీలు (అవయవాలు కోల్పోయిన వారు) ప్రతి వారం శిక్షణ తీసుకుంటున్నారు. గాజాలో ఫుట్‌బాల్ ఆటకు దశాబ్దాల చరిత్ర ఉంది. 1930, 40 దశకాల్లోనే 'గాజా స్పోర్ట్స్ క్లబ్' (తరువాత పాలస్తీనా ఫుట్‌బాల్ ఫెడరేషన్) ఏర్పాటైంది. అందుకే ఒకవైపు భీకర దాడులు జరుగుతున్నప్పటికీ ప్రపంచ కప్‌ను వీక్షిస్తున్న అభిమానులు అక్కడ కనిపిస్తున్నారు. 'గాజాలో రోజురోజుకూ మారిపోతున్న పరిస్థితుల్లో ఇదొక్కటే మమ్మల్ని సాధారణంగా ఉంచుతుంది' అంటున్నారు వారంతా.

​గాజా ఆరోగ్య శాఖ తాజా లెక్కల ప్రకారం ఇజ్రాయిల్ దాడుల్లో 6 వేల మంది అవయవాలను కోల్పోయారు. వారందరికీ దీర్ఘకాలిక పునరావాసం, కృత్రిమ అవయవాల అవసరం చాలా ఉంది. ఈ పరిస్థితుల్లో 'పాలస్తీనా ఎంప్యూటీ ఫుట్‌బాల్ అసోసియేషన్'లో వచ్చిన మార్పులను ఆ సంస్థ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ ఫౌద్ అబూ ఇలా చెబుతున్నారు. 'ఈ గణాంకాలు మా పని విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. దాడులకు ముందు నుంచే ఇక్కడ బాలికల బృందం ఉంది. దాడుల సమయంలో శిక్షణా శిబిరాన్ని పూర్తిగా మూసేశాం. అయితే ఇప్పుడు శిబిరానికి వస్తున్న వారి సంఖ్య బాగా పెరిగింది. కానీ వారందరికీ శిక్షణ ఇచ్చే సౌకర్యాలు ఇక్కడ లేవు. దాడులతో అంతా నాశనమైంది. అయినా ఈ అమ్మాయిల ధృడ సంకల్పాన్ని చూసి మేము ముందుకు వచ్చాం' అని ఆయన చెప్పారు. 2018లో స్థాపించబడిన ఈ సంఘం, అవయవాలు కోల్పోయిన వారికి శిక్షణ ఇవ్వడంతో పాటు పురుషులు, మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక జట్లను కూడా తయారుచేస్తోంది.

​2027 ప్రపంచకప్ లక్ష్యంగా..

ప్రపంచ వేదికపై పాలస్తీనాకు ప్రాతినిథ్యం వహించాలని సిద్ధమవుతున్న ఈ మహిళా ఎంప్యూటీ ఫుట్‌బాల్ బృందం వైకల్యానికి లొంగిపోవడానికి నిరాకరిస్తోంది. దాడులతో తమ కలలను నాశనం చేయలేరని ప్రపంచానికి చూపించాలని తపిస్తోంది. 2027లో జరిగే మహిళల ఎంప్యూటీ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో పాల్గొని గాజా స్ఫూర్తిని చాటాలని శక్తివంచన లేకుండా శ్రమిస్తోంది.

రోజాన్, కిఫా, ఐషా లాంటి మహిళలు ఎంతోమంది ఇప్పుడు దైర్ అల్ బలాహ్ మైదానంలో ఫుట్‌బాల్ శిక్షణ తీసుకుంటున్నారు. 2025 జూన్ 30న ఓ కేఫ్‌పై ఇజ్రాయిల్ చేసిన దాడిలో కిఫా తన స్నేహితులను కోల్పోయింది. స్పృహ కోల్పోయిన కిఫా 'అల్ షిఫా' ఆస్పత్రిలో కళ్లు తెరిచేసరికి తన కాలును తొలగించారు. గోల్‌కీపర్ ఐషా అల్ అబద్లాకు ఫుట్‌బాల్ అంటే విపరీతమైన ఇష్టం. ఎనిమిదేళ్లుగా ఆమె ఇక్కడ శిక్షణ తీసుకుంటోంది. 2008 యుద్ధ సమయంలో ఆమె తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు వైట్ ఫాస్పరస్‌ను పీల్చడం వల్ల పుట్టుకతోనే ఐషా రెండు కాళ్లు, ఒక చేయి లేకుండా జన్మించింది. వైకల్యం తనను ఎప్పుడూ కుంగిపోనివ్వలేదని ఆమె చెబుతోంది. 'అదే నాకు ప్రేరణ' అంటోంది. దాడులకు ముందున్న పరిస్థితులను తలచుకుంటూ ఐషా బృందం శిక్షణ తీసుకుంటోంది. మళ్లీ మునుపటి పరిస్థితులు రావాలని వారి కళ్లు ఎదురుచూస్తున్నాయి. టీమ్ కెప్టెన్ లామియా ముస్లే మాట్లాడుతూ...

​దు:ఖం, నిరాశపై పోరాటం..

'మా జట్టుకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. పాలస్తీనా మహిళలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనగలరని, క్లిష్ట పరిస్థితులను దాటుకుని రాగలరని ప్రపంచానికి నిరూపించాలనుకుంటున్నాం. మేము తన్నే ప్రతి బంతి వెనుక తీవ్ర దు:ఖం, బాధ, నిరాశపై చేసే పోరాటం కనిపిస్తుంది. అంతర్జాతీయ టోర్నమెంట్లలో మా పాలస్తీనా జెండా ఎగురవేయాలనేదే మా ముందున్న ఏకైక కల' అంటోంది.

రోజాన్ ఖైర్ కూడా ఈ బృందంలో సభ్యురాలే. 24 ఏళ్ల ఆమె ఒకప్పుడు పరుగుల రాణి. వివిధ పోటీల్లో పాల్గొని పతకాలు కూడా సాధించింది. అయితే ఇజ్రాయిల్ తన ఇంటిపై జరిపిన బాంబు దాడిలో రోజాన్ ఒక కాలు కోల్పోయింది. ఆ రోజు నుంచి ఆమె ప్రపంచమే మారిపోయింది. కాలు లేకపోయినా తన శక్తి సామర్థ్యాలను చూపించడానికి ఈ వేదికను ఉపయోగించుకుంటున్నానని చెబుతోంది.

బృందంలోని క్రీడాకారులంతా వారంలో ఒక రోజు దైర్ అల్ బలాహ్‌కు ప్రయాణిస్తున్నారు. గాజాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది చాలా కష్టం. రవాణా మార్గాలు లేవు. క్రీడా సామగ్రి లేదు. మార్గమధ్యంలో దాడులతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రయాణానికి డబ్బులు లేక, సుదూరంలో ఉన్న పునరావాస కేంద్రాల నుంచి రాలేక ఇప్పటికే కొంతమంది ఆగిపోయారు. మైదానానికి చేరుకున్నాక సరైన పోషకాహారం లేక తీవ్ర అలసటకు గురై, మరికొందరు ఆటపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నారు.

అసాధ్యమనిపించే ఇలాంటి పరిస్థితుల్లో శిక్షణ పొందుతున్న వీళ్లను పట్టుదల మాత్రమే ముందుకు నడిపిస్తోంది. కోట్లాది మంది వీక్షకుల సమక్షంలో ప్రపంచ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. దైర్ అల్ బలాహ్‌లోని ఈ యువతులు మాత్రం ఏదో ఒక రోజు ప్రపంచం తమ ఆటను చూస్తుందన్న ఆశతో ఆ మ్యాచ్‌లను వీక్షిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్