- డేటా సెంటర్లను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి
- రౌండ్ టేబుల్ సమావేశంలో మేధావులు, పర్యావరణవేత్తలు
ప్రజాశక్తి - ఆరిలోవ (విశాఖపట్నం) : ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు సైతం డేటా సెంటర్లను వ్యతిరేకిస్తున్న తరుణంలో అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు అనే ముసుగులో పర్యావరణానికి తీవ్ర విఘాతం తలపెట్టే డేటా సెంటర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులివ్వడం దారుణమని, వాటిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని మేధావులు, పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రీన్ విశాఖ ఆధ్వర్యంలో ఆరిలోవ తోటగరువులోని ఎర్నిమాంబ కల్యాణ మండపంలో ఆదివారం ‘గూగుల్ డేటా సెంటర్ - ప్రజలపై ప్రభావం’ అన్న అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు మురళీధర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రీన్ విశాఖ అధ్యక్షులు రాజా రామ్మోహన్ రాయ్, కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడారు. గూగుల్ డేటా సెంటర్లతో పర్యావరణానికి, తద్వారా ప్రజలకు కలిగే నష్టాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారావివరించారు. సకల జీవరాశులు జీవించే అనుకూలమైన గ్రహం భూమి మాత్రమేనని, దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మానవ హక్కుల వేదిక తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త విఎస్ కృష్ణ మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడే విశాఖపట్నంలో ఉండే పచ్చని కొండలను అభివృద్ధి పేరుతో ఇప్పటికే చాలా వరకూ ధ్వంసం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చాలదని ముడసర్లోవ రిజర్వాయర్ పరివాహక ప్రాంతాలైన సింహాచలం దేవస్థానం, కంబాల కొండలను విధ్వంసం చేయడానికి పూనుకోవడం దారుణమన్నారు. నగర ప్రజల ఆక్సిజన్‌గా పిలిచే కంబాల కొండ పరిసర ప్రాంతాల్లోనే ఈ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తుండడంతో ప్రజల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డేటా సెంటర్లతో కూలి ఉద్యోగాల తప్ప శాశ్వత ఉద్యోగాలు ఉండవన్నారు. ఈ సెంటర్లతో వచ్చే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రజల నుంచి ఒత్తిడితోనే ఇటువంటి వాటిని అడ్డుకోగలమన్నారు. పర్యావరణవేత్త సోహన్ హటంగిడి మాట్లాడుతూ పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చేందుకే డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో నీరు, విద్యుత్ సమస్యలు ఉత్పన్నమవుతాయని, ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి కుమార్ మాట్లాడుతూ ప్రజలు కోరుకునే అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా పెట్టుబడిదారుల అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెడుతున్నాయని విమర్శించారు. రిజర్వాయర్ క్యాచ్‌మెంట్ ప్రాంతమని చెప్పి ప్రజలకు పట్టాలు నిరాకరించిన ప్రభుత్వం నేడు కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా అడవివరం, ముడసర్లోవ ప్రాంతాల్లో భూములు కట్టబెట్టడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. సమావేశంలో ప్రజాసంఘాల నాయకులు వి కృష్ణారావు, పి శంకర్రావు, వి నరేంద్ర కుమార్, ఎస్ఎఫ్ఐ నాయకులు సాయి తేజ, సామాజిక కార్యకర్తలు పిట్టా నారాయణమూర్తి, ఈశ్వరరావు, ఎంవివి మూర్తి, గణేష్, కిరణ్, సుజన్, స్థానికులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)