ఆదివారం, 05 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పరిశ్రమలు స్థాపించని భూముల్లో సాగుకు సంసిద్ధం కావాలి

2 గంటల క్రితం

v srinivasarao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 12:35 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- గత వైసిపి, ప్రస్తుత టిడిపిలకు దోచుకోవడంలోనే పోటీ

- రైతుల మధ్య ఐక్యతను దెబ్బతీసే బిజెపి, ఆర్ఎస్ఎస్ కుట్రలను ఎండగట్టండి

- ఎపి రైతుసంఘం పూర్వ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి - ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న ప్రచారం పూర్తిగా ఎండమావేనని ఎపి రైతుసంఘం పూర్వ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిడిపి ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గ్రామస్థాయి నుంచి విశాల పోరాటాలకు నాంది పలకాలని, ఈ పోరాటాలలో యువతను భాగస్వాములు చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం 23వ మహాసభ మూడో రోజు ఆదివారం ఏలూరులో ముగిసింది. ఈ సందర్భంగా వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యవసాయ రంగం, రైతుల ఉనికి ప్రమాదంలో ఉన్నాయని, కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు. సాగు భూముల నుంచి రైతులను దూరం చేసే కుట్ర జరుగుతోందని వివరించారు. పాలకుల విధానాల ఫలితంగా ముందుకు వచ్చిన భూ సమస్యలు, పండించిన పంటలకు ధర లేకపోవడం, పిపిపి పేరుతో సాగునీటి వ్యాపారం వంటివి ఉరితాడులా మారుతున్నాయని తెలిపారు. మరోవైపు పరిశ్రమల ఏర్పాటు పేరుతో ప్రభుత్వం సేకరించిన భూములలో ఇప్పటికీ ఏ ఒక్క పరిశ్రమా ఏర్పాటు చేయలేదని, ఏ ఒక్కరికీ ఉద్యోగం కల్పించలేదని అన్నారు. రైతుల నుంచి సేకరించిన భూములకు అనేక చోట్ల ఇప్పటికీ పరిహారం చెల్లించలేదని అన్నారు. అటువంటి భూముల్లో ప్రభుత్వం ఆరు నెలల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయించకపోతే ఆ భూములను దున్ని తిరిగి సాగులోకి తేవడానికి రైతు సంఘం నడుం బిగించాలని పిలుపునిచ్చారు. గత వైసిపి, ప్రస్తుత టిడిపిలకు దోచుకోవడంలోనే పోటీ అని అన్నారు. సహకార రంగంతోనే ఉమ్మడి అభివృద్ధి సాధ్యమని రాష్ట్రంలో సహకార రంగాన్ని రక్షించుకోవాలని అన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి రైతు సంఘం కేంద్రం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని రైతులే కార్పొరేట్లకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సబ్సిడీ ఇస్తున్నారని, కానీ పాలక ప్రభుత్వాలు పూర్తిగా భిన్నమైన ప్రకటనలు చేస్తున్నాయని వివరించారు. విద్యుత్ లాభదాయకమైన ఉత్పత్తి అని, రైతుల నుంచి సేకరించిన భూములకు ఎకరాకు ఏడాదికి కేవలం రూ.30 వేలు చెల్లించి, సోలార్ విద్యుత్ ఏర్పాటుతో ప్రతి నెల నాలుగు నుంచి ఐదు లక్షల వరకు అదాని, ఇతర కార్పొరేట్ కంపెనీలు లాభపడుతున్నాయని అన్నారు. ఈ కాలంలో రైతులు అక్షరాలా రూ.2.40 లక్షల కోట్లు నష్టపోయారని అన్నారు. రాష్ట్రంలో భూ సమస్య ప్రధానమైన సమస్యగా ఉందన్నారు. ప్రభుత్వాలను కార్పొరేట్ కంపెనీలు నడిపిస్తున్నాయని, ఆ కంపెనీలకు అనుకూలమైన విధానాలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని అన్నారు. రియల్ ఎస్టేట్ ప్రయోజనాల చుట్టూ జరిగే ఈ దోపిడీలో గ్రామాల్లో భూస్వాములు, పెత్తందారులు కీలక భూమిక పోషిస్తున్నారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతు సంఘం, గ్రామీణ ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి రైతులతోపాటు, వివిధ రకాల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న గ్రామీణ పేదల ఉమ్మడి ప్రయోజనాల కోసం విశాల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటాలలో యువతను భాగస్వామ్యం చేయాలన్నారు. ప్రశ్నిస్తేనే రైతుల సమస్యలు పరిష్కార సాధ్యమని, బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా కరేడు, నక్కపల్లి తదితరుల ప్రాంతాల్లో జరిగిన ఉద్యమాలు భవిష్యత్తు పోరాటాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. అక్రమ అరెస్టులు, రౌడీ షీట్లు, పీడీ యాక్టులకు సైతం భయపడకుండా ఎదిరించి చేసిన పోరాటాలతో ప్రభుత్వమే వెనక్కి తగ్గిందని గుర్తు చేశారు. ఒంగోలులో పొగాకు రైతుల ఆందోళన ఫలితంగా ఎట్టకేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిగొచ్చి కేజీకి రూ.200 కల్పించాలని చెప్పినప్పటికీ, నేటికీ అమలకు నోచుకోలేదని, పాలకులకు సిగ్గుందా..? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. పోలవరం- బనకచర్ల, పోలవరం- నల్లమల సాగర్, తాజాగా గోదావరి - సోమశిల, మహానది- కావేరి అంటూ పాలకులు చేస్తున్న ప్రకటనలో దుర్నీతిని ఎండగట్టారు. బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లోని పరిశ్రమలకు సాగునీటిని దోచిపెట్టే ప్రయత్నంలో భాగమేనని అన్నారు. చెరువులు రిజర్వాయర్లు వంటివి ప్రైవే‌ట్‌‌కి ఇచ్చి ప్రజలకు దూరం చేయబోతున్నారని వివరించారు. రాష్ట్ర అభివృద్ధిపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా చిన్న చిన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలు కులం మతం పేరుతో ప్రజల మధ్య ఐక్యతను చీల్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (సర్) పేరుతో జరుగుతున్న సర్వేలో గ్రామస్థాయిలో ఏ ఒక్కరు ఓటు కోల్పోకుండా చూసుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్