-గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై టెహ్రాన్ ప్రతిదాడి
టెహ్రాన్/వాషింగ్టన్ : దాడులు, ప్రతి దాడులతో పశ్చిమాసియా అట్టుడికిపోతోంది. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ, ఆరోపణలు-ప్రత్యారోపణలు చేసుకుంటూ అమెరికా, ఇరాన్ పరస్పర దాడులకు దిగుతున్నాయి. హర్మూజ్ జలసంధి పరిసరాలలోని ఇరాన్ లక్ష్యాలపై అమెరికా జరిపిన దాడులకు ప్రతిగా జోర్డాన్, కువైట్, బహ్రేన్లలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డులు బుధవారం క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించారు. ఏప్రిల్‌లో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఘర్షణలు చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి. హర్మూజ్ సమీపంలో అమెరికా అపాచీ హెలికాప్టర్‌ను ఇరాన్ మంగళవారం కూల్చివేసిన నేపథ్యంలో ప్రతీకార దాడులు జరపాలని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సేనలను ఆదేశించారు. దీంతో అమెరికా సేనలు హర్మూజ్ పరిసరాలలోని ఇరాన్ లక్ష్యాలపై దాడులు జరిపాయి. అలాగే ఇరాన్ చర్చల విషయంలో ఆలస్యం చేసిందని, అందుకు భారీ మూల్యం చెల్లించుకుంటుందని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్‌లో పోస్ట్ చేశారు. అయితే యుద్ధ పరిస్థితుల్లో సంయమనం పాటించాలని రష్యా ఇరు దేశాలను కోరింది. అలాగే పశ్చిమ ఆసియాలోని సంఘర్షణపై తాము “తీవ్ర ఆందోళన” వ్యక్తం చేస్తున్నామని, ఉద్రిక్తతలను పెంచవద్దని చైనా ఇరు పక్షాలకు విజ్ఞప్తి చేసింది.
ఏం జరిగింది?
అమెరికా ప్రతీకారం బలంగా, శక్తివంతంగా ఉంటుందని దాడులకు ముందు ట్రంప్ మీడియాకు తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లు, నిఘా రాడార్ ప్రదేశాలపై తాజాగా దాడులు చేశామని అమెరికా సైన్యం ప్రకటించింది. ఈ దాడులు నాలుగు గంటల పాటు కొనసాగాయి. దాదాపు 20 ఇరాన్ లక్ష్యాలపై దాడులు జరిగాయని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. హర్మూజ్ పరిసరాలలోని మూడు వ్యూహాత్మక ప్రదేశాలలో పేలుడు శబ్దాలు వినిపించాయి. రెండు నీటి రిజర్వాయర్లపై కూడా అమెరికా దాడి చేసిందని, దీంతో ఆ ప్రాంతంలో ఇరవై వేల మందికి నీటి సరఫరా నిలిచిపోయిందని ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ తెలిపింది. ఈ రిజర్వాయర్ల నుంచి కౌహెస్టాక్ పట్టణానికి, దాని పరిసరాలలోని పది గ్రామాలకు తాగు నీరు సరఫరా అవుతోంది. అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ అధికారులు అత్యవసర చర్యలు చేపట్టి ప్రత్యామ్నాయ మార్గాలలో నీటి సరఫరా చేస్తున్నారు. కాగా ఖెష్మ్ దీవి పైన, హర్మూజ్‌లోని ఓడరేవు నగరమైన సిరిక్ పైన అమెరికా దాడులు చేసిందని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జిసి) తెలియజేసింది. అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా బహ్రేన్, కువైట్, జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించామని చెప్పింది. ఎఫ్-35 ఫైటర్ జెట్ హ్యాంగర్లు సహా దూర శ్రేణి క్షిపణులతో జోర్డాన్‌లో అమెరికాకు చెందిన అల్-అజ్రఖ్ స్థావరంలోని నాలుగు ప్రదేశాలు, కమాండ్ కంట్రోల్ కేంద్రంపై రివల్యూషనరీ గార్డులు దాడులు చేశారు. అమెరికా మరోసారి దాడులకు దిగితే తమ స్పందన నిర్ణయాత్మకంగా ఉంటుందని హెచ్చరించారు.
క్షేమంగా ఉండాలంటే గల్ఫ్‌ను వీడండి : అరాగ్చీ
పశ్చిమాసియాలో దాడులు, ప్రతి దాడుల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అమెరికాకు హెచ్చరికలు జారీ చేశారు. క్షేమంగా ఉండాలని అనుకుంటే పర్షియన్ గల్ఫ్ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని సూచించారు. దాడులను ఎదుర్కొనేందుకు ఇరాన్ సేనలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. గల్ఫ్ ప్రాంతంలో ‘బయటివారు చొరబడితే’ కనీవినీ ఎరుగని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా అన్నారు. ‘యుద్ధభూమిలో పరాజయం పాలైనప్పటికీ మా సంకల్పాన్ని పరీక్షించాలని అమెరికా అనుకుంటోంది. శక్తివంతమైన మా సాయుధ సేనలు ఎలాంటి దాడులకైనా జవాబిస్తాయి. వదిలిపెట్టవు. క్షేమంగా, సురక్షితంగా, భద్రంగా ఉండాలని అనుకుంటే మా ప్రాంతాన్ని వదిలేయండి. బయటి నుంచి వచ్చే చొరబాటుదారులు తీవ్ర పరిణామాలను ఎదుర్కొన్న ఉదంతాలు పర్షియన్ గల్ఫ్ చరిత్రలోని అనేక ఛాప్టర్లలో ఉన్నాయి’ అని ఆయన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో హెచ్చరించారు.
చర్చలపై ఇరాన్ ‘సమీక్ష’
తమ దక్షిణ ప్రాంతంపై అమెరికా జరిపిన దాడులను ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఆత్మరక్షణ కోసమే ప్రతి దాడులు జరిపామని చెప్పింది. భూభాగాలను ఉపయోగించుకునేందుకు అమెరికా, ఇజ్రాయిల్‌లను అనుమతిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని గల్ఫ్ దేశాలను హెచ్చరించింది. దాడుల నేపథ్యంలో చర్చలపై ‘సమీక్ష’ జరుపుతున్నామని విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘై చెప్పారు. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు పదే పదే కాల్పుల విరమణను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు. శూన్యంలో దౌత్యం సాధ్యపడదని స్పష్టం చేశారు. చర్చలు ముందుకు సాగాలంటే కనీస అనుకూల వాతావరణం ఉండాలని అన్నారు.
కాగా ఇరాన్ ప్రయోగించిన దాదాపు అన్ని క్షిపణులు, డ్రోన్లను అడ్డుకోవడం జరిగిందని, తమ సిబ్బందికి కానీ, స్థావరాలకు కానీ నష్టం జరిగినట్లు సమాచారమేమీ లేదని అమెరికా అధికారి ఒకరు చెప్పారు.
లెబనాన్‌పై కొనసాగుతున్న ఇజ్రాయిల్ దాడులు
లెబనాన్ ప్రాంతమంతటా ఇజ్రాయిల్ దాడులను విస్తృతం చేసింది. బుధవారం దక్షిణ లెబనీస్ నగరమైన సిడాన్లో ఒక కారుపై ఇజ్రాయిల్ దాడి చేసింది. సహాయక సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేసారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందారు. అలాగే ఇజ్రాయిల్ సైన్యం కఫర్షుబా మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు మొహమ్మద్ హసన్ అల్-హజ్, కార్మికుడు అహ్మద్ సలాహ్ దియాబ్లను అపహరించి, వారిని గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకువెళ్లిందని లెబనాన్ తెలిపింది.









కామెంట్లు (0)