గురువారం, 03 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హాగ్వార్ట్స్‌కు తిరిగి.. కొత్త రూపంలో వస్తున్న హ్యారీ పాటర్

1 గంట క్రితం

horry
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 09:22 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

లండన్: హాగ్వార్ట్స్‌కు సంబంధించిన మాయాజాల ప్రపంచం మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. 2001లో విడుదలైన ‘హ్యారీ పాటర్ అండ్ ది ఫిలాసఫర్స్ స్టోన్’ సినిమా వచ్చి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, అదే కథ ఇప్పుడు కొత్త తారాగణంతో సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇది పాత సినిమాకు రీమేక్ మాత్రమే కాకుండా.. జేకే రౌలింగ్ రాసిన తొలి పుస్తకంలోని కథను మరింత విపులంగా చూపించేలా హెచ్బీవో ఈ సిరీస్‌ను రూపొందిస్తోంది. డిసెంబర్ 25న హెచ్బీవో మాక్స్ లో ఈ సిరీస్ ప్రసారం కానుంది. తాజాగా విడుదలైన కొత్త ట్రైలర్‌లో హ్యారీ పాటర్ మాంత్రిక ప్రపంచంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లను చూపించారు. హ్యారీగా డొమినిక్ మెక్‌లాఫ్లిన్, రాన్‌గా అలస్టైర్ స్టౌట్, హెర్మియోన్‌గా అరబెల్లా స్టాంటన్ నటిస్తున్నారు. ఈ మూడు ప్రధాన పాత్రల కోసం నిర్వహించిన ఆడిషన్స్‌కు 30,000 మందికి పైగా పిల్లలు హాజరుకాగా, వారిలో నుంచి ఈ కొత్త తారలను ఎంపిక చేశారు.

హ్యారీకి హాగ్వార్ట్స్ నుంచి ఉత్తరం అందడం నుంచి మాంత్రిక ప్రపంచంలోకి అతను అడుగుపెట్టే వరకు జరిగిన కీలక పరిణామాలు ట్రైలర్‌లో కనిపిస్తున్నాయి. హాగ్వార్ట్స్ ఎక్స్‌ప్రెస్, గ్రేట్ హాల్, సార్టింగ్ హ్యాట్, గ్రిఫిండర్ కామన్ రూమ్ వంటి అభిమానులకు ఎంతో పరిచయమైన ప్రదేశాలు ఈసారి కొత్త రూపంలో దర్శనమిస్తున్నాయి. హ్యారీ, రాన్, హెర్మియోన్ గ్రిఫిండర్‌లోకి ఎంపిక కావడం, వారి మధ్య స్నేహం ఏర్పడటం కూడా ట్రైలర్‌లో చూపించారు.

క్విడిచ్‌కు కూడా ఈ సిరీస్‌లో మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. గ్రిఫిండర్ సీకర్‌గా హ్యారీ ఎదిగే విధానం, అతని శిక్షణకు సంబంధించిన దృశ్యాలు ఇందులో ఉన్నాయి. అలాగే హ్యారీ అదృశ్య వస్త్రాన్ని ధరించడం, హ్యారీ, రాన్, హెర్మియోన్ కలిసి ఫిలాసఫర్స్ స్టోన్ చుట్టూ ఉన్న రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేయడం వంటి కీలక ఘట్టాలకు సంబంధించిన కొత్త ఫుటేజ్ కూడా కనిపించింది.

సినిమాతో పోలిస్తే ఈ సిరీస్‌లో కథను చెప్పేందుకు ఎక్కువ సమయం ఉండటం ప్రధాన ప్రత్యేకత. ఒక్కో పుస్తకాన్ని ఒక్కో పూర్తి సీజన్‌గా తెరకెక్కించే ప్రణాళికలో భాగంగా, తొలి పుస్తకంలోని కథకు దాదాపు ఎనిమిది గంటల స్క్రీన్ టైమ్ లభించనుంది. దీంతో సినిమాల్లో చోటు దక్కని చిన్న సంఘటనలు, పాత్రల మధ్య సంబంధాలు, హాగ్వార్ట్స్‌లో విద్యార్థుల రోజువారీ జీవితం మరింత వివరంగా చూపించే అవకాశం ఉంది. పుస్తక అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న పీవ్స్ వంటి పాత్రలు కూడా ఈసారి తెరపై కనిపించనున్నాయి.

హాగ్వార్ట్స్‌లోని ప్రముఖ ఉపాధ్యాయుల పాత్రలను కూడా కొత్త నటీనటులు పోషిస్తున్నారు. ఆల్బస్ డంబుల్డోర్‌గా జాన్ లిత్గో, సెవెరస్ స్నేప్‌గా పాపా ఎసియాడూ, మినర్వా మెక్‌గొనగల్‌గా జానెట్ మెక్‌టీర్, హాగ్రిడ్‌గా నిక్ ఫ్రాస్ట్ నటిస్తున్నారు. ప్రొఫెసర్ క్విరెల్‌గా ల్యూక్ టాలన్, ఆర్గస్ ఫిల్చ్‌గా పాల్ వైట్‌హౌస్ కనిపించనున్నారు. కొత్త ట్రైలర్‌లో డ్రాకో మాల్ఫాయ్ పాత్రలో లాక్స్ ప్రాట్ కూడా అభిమానులకు పరిచయమయ్యారు.

25 ఏళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హ్యారీ పాటర్ కథను ఇప్పుడు సిరీస్ రూపంలో మరింత విస్తృతంగా చెప్పేందుకు HBO చేస్తున్న ఈ ప్రయత్నంపై ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తూనే, పుస్తకాల్లోని మరిన్ని అంశాలను తెరపైకి తీసుకురానున్న ఈ కొత్త సిరీస్ హ్యారీ పాటర్ అభిమానులకు మరో మాయాజాల అనుభూతిని అందించనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్