- ‘శుద్ధీకరణ’ చర్యను తీవ్రంగా ఖండించిన ప్రజాప్రతినిధులు
- 8న రాష్ట్రపతిని కలవాలని నిర్ణయం
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : రాజ్యసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కు ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో చోటుచేసుకున్న ఘటనపై కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు, సీనియర్ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఖర్గే పర్యటన అనంతరం ‘శుద్ధీకరణ’ చర్యపై ఎస్‌సి, ఎస్‌టి పార్లమెంట్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన కేవలం ఖర్గేను వ్యక్తిగతంగా అవమానించడమే కాదని, మొత్తం ఎస్‌సి, ఎస్‌టి సమాజ గౌరవం, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే చర్యగా వారు అభివర్ణించారు. సమానత్వం, వ్యక్తిగత గౌరవం, అంటరానితనం నిర్మూలన వంటి రాజ్యాంగ సూత్రాలకు ఇటువంటి చర్యలు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ అంశంపై ఎస్‌సి, ఎస్‌టి పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం న్యూఢిల్లీలో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని ఇకపై సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. ఘటనపై న్యాయం జరిగేలా, బాధ్యులపై తగిన చర్యలు తీసుకునేలా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జోక్యం చేసుకోవాలని ఎస్‌సి, ఎస్‌టి ఎంపిలు కోరనున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 8న రాష్ట్రపతిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరాలని నిర్ణయించారు.
ఇందిరా భవన్‌లో 7న కీలక భేటీ
రాష్ట్రపతిని కలిసే ముందు తదుపరి కార్యాచరణకు సంబంధించి రోడ్‌మ్యాప్ రూపొందించేందుకు సెప్టెంబర్ 7న ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోని ఇందిరా భవన్‌లో ఎస్‌సి, ఎస్‌టి ఎంపిలందరూ సమావేశం కావాలని నిర్ణయించారు. అనంతరం సెప్టెంబర్ 8న రాష్ట్రపతిని కలిసి అంశాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లనున్నారు.







కామెంట్‌లు (0)