గురువారం, 03 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హోర్ముజ్ జలసంధికి ‘ట్రంప్ జలసంధి’గా పేరు మార్పు!

1 గంట క్రితం

trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 08:43 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ప్రతిపాదించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్: ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతకు కేంద్రంగా మారిన కీలకమైన హోర్ముజ్ జలసంధికి ‘ట్రంప్ జలసంధి’గా పేరు మార్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. తాజాగా తన ట్రూత్ సోషల్ ఖాతాలో స్పందించిన ట్రంప్.. ఈ జలమార్గం ప్రస్తుతం అమెరికా నియంత్రణలోకి వచ్చిందని పేర్కొంటూ పేరు మార్పుపై ప్రశ్నించారు. “ఇప్పుడు ఇది అమెరికా నియంత్రణలోకి వచ్చింది కాబట్టి, మనం హోర్ముజ్ జలసంధి పేరును ట్రంప్ జలసంధిగా మార్చాలా?” అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలతో ఈ ప్రతిపాదనపై అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. ఇటీవల కెనడాతో వాణిజ్య వివాదం నేపథ్యంలో ఒంటారియో సరస్సు పేరును ‘లేక్ అమెరికా’గా మార్చాలని ట్రంప్ ఆదేశించినట్లు సమాచారం. అంతకుముందు 2025 జనవరిలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా మార్చే చర్యలు చేపట్టారు. అయితే ఈ పేరు మార్పులను మెక్సికో, కెనడా అంగీకరించలేదు.

ట్రంప్ గతంలో చేసిన పలు భౌగోళిక పేరు మార్పుల ప్రతిపాదనలు మొదట సరదా వ్యాఖ్యలుగా కనిపించినప్పటికీ, అనంతరం వాటిని అధికారిక చర్యల దిశగా తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి పేరు మార్పుపై ఆయన చేసిన తాజా వ్యాఖ్య ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇటీవలి వారాల్లో హోర్ముజ్ జలసంధిపై అమెరికా సార్వభౌమాధికారాన్ని క్లెయిమ్ చేస్తామని ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు. అంతేకాకుండా ఈ జలమార్గాన్ని ‘కొత్త అమెరికా భూభాగం’గా చూపించే మ్యాప్‌ను కూడా ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఐదో వంతు ఈ మార్గం గుండా రవాణా అవుతుండటంతో హోర్ముజ్ జలసంధికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాధాన్యం ఉంది.

ఫిబ్రవరి చివర్లో ఇజ్రాయెల్‌తో కలిసి ట్రంప్ ప్రారంభించిన యుద్ధానికి ప్రతీకారంగా ఇరాన్ హోర్ముజ్ జలసంధి మీదుగా జరిగే రవాణాను అడ్డుకునే చర్యలు చేపట్టిందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ పరిణామాలతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడుతోంది.

హోర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ కొత్తగా మందుపాతరలు అమర్చేందుకు ప్రయత్నిస్తోందని ట్రంప్ ఆరోపించిన నేపథ్యంలో సెప్టెంబర్ 1న అమెరికా దళాలు అక్కడ కొత్తగా దాడులు ప్రారంభించినట్లు సమాచారం. దీంతో ముడిచమురు ధరలు మరోసారి పెరిగాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ జలమార్గంపై కొనసాగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఇంధన సరఫరాపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్