శనివారం, 01 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పిల్లలు అబద్దాలు చెబితే...

21 గంటల క్రితం

children
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 04:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ఎదుగుతున్న చిన్నారులు కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకే అబద్ధాలు చెబుతుంటారు. అమ్మానాన్నలు మందలిస్తారనే భయంతో పెన్సిల్ పోయినా, హోంవర్క్ చేయకపోయినా ఎవరో ఒకరిపై నెపం వేసేస్తారు. ఆ మాటల వల్ల కలిగే పరిణామాలు వారికి పూర్తిగా తెలియవు. అయితే ఇది చెడు అలవాటు మాత్రమే కాదని, వారి మేధో వికాసానికి కూడా సూచిక కావచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

శిక్ష కాదు; సంభాషణ ముఖ్యం

పిల్లలు అబద్ధాలు చెప్పే ధోరణి ఎక్కువగా స్కూల్‌కు వెళ్లే వయసులో కనిపిస్తుంది. అలాంటి సందర్భాల్లో వారిని తిట్టడం, కొట్టడం సమస్యకు పరిష్కారం కాదు. ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో తెలుసుకునేందుకు వారితో ప్రశాంతంగా మాట్లాడాలి. కారణాన్ని తెలుసుకోకుండా శిక్షిస్తే, వారు నిజం చెప్పడం కంటే శిక్ష నుంచి తప్పించుకోవడానికి మరింతగా అబద్ధాలు చెప్పడం అలవాటు చేసుకుంటారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో అమ్మానాన్నలు తీసుకొచ్చిన డ్రెస్సు లేదా స్నేహితుడు గీసిన బొమ్మ నచ్చకపోయినా నచ్చిందని చెప్పే మాటలను ప్రతికూలంగా చూడాల్సిన అవసరం లేదు. ఎదుటివారిని బాధపెట్టకూడదనే ఉద్దేశంతోనే పిల్లలు అలా మాట్లాడుతుంటారు. సమాజంలో సంబంధాలను పెంపొందించుకునే క్రమంలో కనిపించే ఇలాంటి చిన్న అబద్ధాలు భావోద్వేగ మేధస్సు పెరుగుతున్న సంకేతమని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

పెద్దలే మొదటి ఆదర్శం

పిల్లలకు తొలి పాఠశాల కుటుంబమే. తల్లిదండ్రుల మాటలు, ప్రవర్తన, నిర్ణయాలను వారు నిశితంగా గమనిస్తుంటారు. పెద్దలు నిజాయితీగా వ్యవహరిస్తే పిల్లలు కూడా అదే అలవాటు చేసుకుంటారు. కానీ విషయాలను అతిశయోక్తిగా చెప్పడం, తప్పులను కప్పిపుచ్చేందుకు కొత్త కథలు అల్లడం వంటి అలవాట్లు ఉంటే వాటినే అనుకరిస్తారు. అందుకే పిల్లల ముందు పెద్దలు నిజాయితీగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల వ్యక్తిత్వ నిర్మాణంలో తల్లిదండ్రుల ప్రవర్తనే అత్యంత ప్రభావం చూపుతుందని వారు గుర్తుచేస్తున్నారు. రెండు, మూడు తరగతుల్లో చదివే పిల్లలు ఉపాధ్యాయులు చెప్పిన విషయాలను, పాఠ్యపుస్తకాలలోని ఊహాకల్పిత కథలను కూడా నిజంగానే జరిగాయని నమ్ముతారు. వయసు పెరిగే కొద్దీ వాస్తవానికి, కల్పనకు మధ్య తేడాను గుర్తించడం నేర్చుకుంటారు. అదే సమయంలో వారి ఆలోచనా శక్తి, జ్ఞాపకశక్తి, ప్రణాళికాబద్ధంగా ఆలోచించే సామర్థ్యం కూడా అభివృద్ధి చెందుతుంది. నమ్మదగ్గ అబద్ధం చెప్పాలంటే ఈ లక్షణాలన్నీ అవసరమవుతాయని, ఎదుటివారి దృక్కోణాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం కూడా అందులో భాగమేనని మనస్తత్వ నిపుణులు వివరిస్తున్నారు.

తల్లిదండ్రులు ఏం చేయాలి?

పిల్లలు పదే పదే అబద్ధాలు చెబుతున్నారని వారిపై వెంటనే ముద్ర వేయకూడదు. ముందుగా వారు చెప్పేది పూర్తిగా వినాలి. అలా మాట్లాడడానికి గల కారణాన్ని తెలుసుకుని, దాని వల్ల కలిగే పరిణామాలను ప్రశాంతంగా వివరించాలి. నిజం చెప్పడం, నిజాయితీగా ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలను వారికి అర్థమయ్యేలా చెప్పడంతో పాటు, ఇంట్లోనూ అదే విలువలు ఆచరణలో కనిపించేలా తల్లిదండ్రులే ఆదర్శంగా నిలవాలి. శిక్షలతో భయపెట్టడం వల్ల పిల్లలు నిజాయితీని నేర్చుకోరు. శిక్ష నుంచి తప్పించుకోవడానికి మరింత తెలివిగా అబద్ధాలు చెప్పడం మాత్రమే నేర్చుకుంటారు. అందుకే పిల్లల్లోని ఆలోచనా సామర్థ్యాన్ని సరైన దిశలో మలిచి, నిజాయితీని జీవిత విలువగా అలవర్చే వాతావరణాన్ని కుటుంబంలోనే కల్పించడం తల్లిదండ్రుల ప్రధాన బాధ్యత అని మనస్తత్వ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్