ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

దాడులపై వెనక్కి తగ్గిన ట్రంప్

1 గంట క్రితం

trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 09:30 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- అడుగంటుతున్న ఆయుధ నిల్వలపై ఆందోళన

వాషింగ్టన్/ఏథెన్స్ : దాడులకు అమెరికా సేనలు విరామం ఇచ్చినప్పటికీ ఇరాన్ యుద్ధం మరింతగా విస్తరిస్తోంది. యెమన్‌కు చెందిన హౌతీలు ఎర్ర సముద్రం తీరం వెంబడి ఉన్న సౌదీ చమురు క్షేత్రాలపై దాడులు చేశారు. మరోవైపు కాస్పియన్ సముద్రంలో తమ నౌకను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ దాడి చేసిందని ఇరాన్ ఆరోపించింది. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం ‘పూర్తి స్థాయి’లో కొనసాగుతోందని అమెరికా చెప్పుకుంది. అయితే దాడులను ఎందుకు నిలిపివేసిందీ వివరించలేదు. అటు ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలపై ఎలాంటి ప్రతీకార దాడులకు పాల్పడలేదు. దాడులకు ఎందుకు విరామం ఇచ్చారని ట్రంప్ ప్రభుత్వంలోని సీనియర్ అధికారిని విలేకరులు ప్రశ్నించగా ‘మా ప్రాధాన్యత దౌత్యానికేనని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ స్పష్టం చేస్తూనే ఉన్నారు. ఒకవేళ ఇరాన్ కనుక సీరియస్‌గా చర్చలకు రాకపోతే ఏం జరుగుతుందో వారికి ఆయన ఇప్పటికే చూపించారు’ అని అన్నారు.

కారణాలు ఇవే

ఇరాన్‌పై దాడులను తీవ్రతరం చేయాలన్న నిర్ణయం నుంచి వెనక్కి తగ్గాలని ట్రంప్ నిర్ణయించుకున్నారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. ఘర్షణలు విస్తరించడం, ఆయుధ నిల్వలు క్షీణించడం, మధ్యప్రాచ్యంలోని గల్ఫ్ మిత్రులను దూరం చేసుకోవడం, ఇంధన సరఫరాలు`ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడడం వంటి విషయాలపై ట్రంప్, ఆయన సలహాదారులు ఆందోళనలో ఉన్నారని ఆ పత్రిక వివరించింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కెయిన్ రెండు రోజుల క్రితం అధ్యక్షభవనంలో జరిగిన సమావేశంలో ఆయుధ నిల్వలు అడుగంటుతున్న విషయాన్ని ట్రంప్ దృష్టికి తెచ్చారని అమెరికా అధికారి ఒకరు సీఎనఎన్ వార్తా సంస్థకు తెలియజేశారు. ‘సైనిక కార్యకలాపాలు నిలిచిపోయాయి’ అని రక్షణ శాఖ వర్గాలు ఓ ప్రసార సంస్థకు చెప్పాయి.

హౌతీ - సౌదీ మధ్య కొనసాగుతున్న దాడులు

ఇరాన్ - అమెరికా మధ్య రెండు రోజులుగా ఎలాంటి దాడులు జరగనప్పటికీ హౌతీలు, సౌదీ అరేబియా మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ పోరు రెండో ప్రధాన నౌకా రవాణా మార్గాన్ని కూడా ప్రభావితం చేస్తుందని, యెమన్‌లో అంతర్యుద్ధం తిరిగి రాజుకునేలా చేస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలావుండగా కాస్పియన్ సముద్రంలో తమ వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ దాడి చేసిందని ఇరాన్ విదేశాంగ శాఖ ఆరోపించింది. ఈ దాడిలో ఓ నావికుడు మరణించగా మరొకరు గాయపడ్డారని తెలిపింది. ఈ దాడిని శత్రుపూరితమైనదిగా, నేరపూరితమైనదిగా అభివర్ణించింది. టెహ్రాన్‌లోని ఉక్రెయిన్ ఛార్జ్ డి అఫైర్స్‌ను పిలిపించి తన నిరసన తెలియజేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్