టెల్ అవీవ్: గాజాలో నిర్వహించిన భూతల ఆపరేషన్‌లో హమాస్ అంతర్గత భద్రతా విభాగం అధిపతిని ఇజ్రాయిల్ బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. మంగళవారం గాజా సిటీలో జరిగిన ఈ ఆపరేషన్‌లో హమాస్ కీలక నేతను పట్టుకున్నట్లు ఇజ్రాయిల్ సైన్యం, షిన్ బెట్ సంయుక్త ప్రకటనలో తెలిపాయి. అతడిని విచారణ కోసం ఇజ్రాయిల్‌కు తరలించినట్లు పేర్కొంది. ఇజ్రాయిల్ మీడియా అతడిని ముయీన్ అల్-అరబీద్‌గా గుర్తించింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై జరిగిన దాడిలో బందీలుగా పట్టుబడిన వారి తరలింపు, దాచివేతలో అతడు కీలక పాత్ర పోషించాడని నెతన్యాహు ఆరోపించారు. ఆపరేషన్‌కు రక్షణగా ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించగా, ఇద్దరు చిన్నారులు సహా నలుగురు పాలస్తీనియన్లు మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనతో కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ గాజాలో హింస పూర్తిగా ఆగలేదని మరోసారి స్పష్టమైంది.







కామెంట్‌లు (0)