సోమవారం, 17 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

32నెలల తరువాత గాజాలో మృతదేహాల వెలికితీత

05 ఆగస్టు, 2026

deaths gaza
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 07:49 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- 2023 వైమానిక దాడి బాధితులకు సామూహిక అంత్యక్రియలు

- శిథిలాల కింద మృతదేహాలు వేలల్లో ఉండే అవకాశం

గాజా: 2023 నవంబర్‌లో గాజా నగరంలోని సబ్రా ప్రాంతంపై జరిగిన వైమానిక దాడిలో మరణించిన వారి అవశేషాలను తాజాగా వెలికితీయడంతో మంగళవారం సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. సివిల్ డిఫెన్స్ బృందాలు ఇటీవల శిథిలాల కింద నుంచి 40 మంది చిన్నారులతో సహా 112 మంది మృతదేహాలను వెలికితీశాయి. ఇంకా 157 మంది అవశేషాలు శిథిలాల కిందే ఉన్నట్లు అధికారులు తెలిపారు.

సమాచారం ప్రకారం, 2023 నవంబర్ 22న జరిగిన దాడిలో ఒక నివాస సముదాయం పూర్తిగా ధ్వంసమై, 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక వర్గాలు పేర్కొన్నాయి. దాడి అనంతరం పనిముట్లు, ఒట్టి చేతులతో వంటి పరిమిత వనరులతో చేపట్టిన సహాయక చర్యల్లో సుమారు 40 మృతదేహాలను మాత్రమే అప్పట్లో వెలికితీయగలిగారు. బాధితుల బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "తమ ఇళ్లలోనే సురక్షితంగా ఉంటామని నమ్మిన అమాయకులే ఈ దాడికి బలయ్యారు" అని బాధిత కుటుంబ సభ్యుడు తైసిర్ అల్-హస్సేనా తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణ నేపథ్యంలో శిథిలాల తొలగింపు పనులు వేగవంతమయ్యాయి. దీంతో గతంలో గుర్తించలేకపోయిన మృతదేహాలను వెలికితీసే ప్రక్రియ కొనసాగుతోంది. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, శిథిలాల కింద ఇంకా వేలాది మంది అవశేషాలు ఉండే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఒకే బాంబు దాడిలో మొత్తం కుటుంబాలే మరణించడంతో, గల్లంతైన వారి గురించి నివేదించడానికి ఎవరూ మిగల్లేదని, అందువల్ల అసలు సంఖ్య వేలల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అల్-వాహెదీ చెప్పారు.

అక్టోబర్ 7, 2023న హమాస్ నేతృత్వంలోని దాడిలో సుమారు 1,200 మంది ఇజ్రాయిల్‌లో మరణించగా, అనంతరం ప్రారంభమైన ఇజ్రాయిల్ సైనిక చర్యల్లో గాజాలో 73 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాము హమాస్ మిలిటెంట్లనే లక్ష్యంగా చేసుకుంటున్నామని ఇజ్రాయిల్ చెబుతోంది.

యుద్ధం కారణంగా గాజాలోని భారీ స్థాయిలో మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులై తాత్కాలిక శిబిరాల్లో నివసిస్తున్నారు. కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ, ఇరుపక్షాలు పరస్పరం ఒప్పంద ఉల్లంఘనల ఆరోపణలు చేసుకుంటున్నాయి. యుద్ధానంతర పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లు, గాజా పునర్నిర్మాణంపై అంతర్జాతీయ స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. నిరాయుధీకరణ ఒప్పందాలు ఉన్నప్పటికీ ఇజ్రాయిల్ సైన్యం వెనక్కి తగ్గడానికి నిరాకరిస్తూ, ఆ భూభాగంలో సగానికి పైగా తన నియంత్రణలోనే ఉంచుకుంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్