బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇండోనేషియాలో గల్లంతైన ఐదుగురు ఫొటో జర్నలిస్టులు.. గాలిసున్న అధికారులు

57 నిమిషాల క్రితం

Indonesia
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 12:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

జకార్తా : అగ్నిపర్వత విస్ఫోటనాన్ని కవర్‌ చేసేందుకు అనక్‌ క్రాకటౌ ద్వీపానికి వెళ్తూ గల్లంతైన ఐదుగురు ఫొటో జర్నలిస్టుల కోసం ఇండోనేషియా సహాయక బృందాలు గాలింపును వేగవంతం చేశాయి. వారితో పాటు ఇద్దరు నౌకా సిబ్బంది, ఒక గైడ్‌ కూడా గల్లంతైనట్లు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జావా, సుమత్రా దీవుల మధ్య సుండా జలసంధిలో ఉన్న అనక్‌ క్రాకటౌకు వెళ్లేందుకు ఈ బృందం బాంటెన్‌ ప్రావిన్స్‌లోని కరిటా తీరప్రాంత పట్టణం నుంచి స్పీడ్‌బోట్‌లో బయలుదేరింది. అయితే సోమవారం సాయంత్రం పడవతో అకస్మాత్తుగా సంబంధాలు తెగిపోయాయి. సోమవారం సాయంత్రం 6.13 గంటలకు బృందంలోని ఒక జర్నలిస్టు కుటుంబ సభ్యులకు ఒక సందేశాన్ని పంపారని అధికారులు తెలిపారు. తాము అనక్‌ క్రాకటౌ సమీప జలాల్లోకి చేరుకున్నట్లు తెలిపారని, ఆ తర్వాత నుండి వారి నుండి ఎలాంటి సమాచారం లేదని అన్నారు. గల్లంతైన ఐదుగురు జర్నలిస్టులు ఇండోనేషియా ప్రభుత్వ వార్తా సంస్థ అంతారా, టర్కీకి చెందిన అనడోలు ఏజెన్సీతో పాటు పలు స్థానిక, అంతర్జాతీయ మీడియా సంస్థలకు పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వారు చివరిసారిగా కనిపించిన ప్రాంతం తీరానికి సుమారు 18.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం నుంచి సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ఇప్పటివరకు గల్లంతైన బృందాన్ని గుర్తించలేదని, వారి ఆచూకీ కూడా లభించలేదని బాంటెన్‌ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఆఫీస్‌ చీఫ్‌ అల్‌ అమ్రాద్‌ తెలిపారు. ప్రతికూల పరిస్థితుల మధ్య సముద్రంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


మరోవైపు అనక్‌ క్రాకటౌ అగ్నిపర్వతం నుండి లావా, బూడిద వెలువడుతూనే ఉన్నాయి. ఆదివారం, సోమవారం అగ్నిపర్వత బూడిద కారణంగా విమానాశ్రయాలను మూసివేయడంతో 622 అంతర్జాతీయ సర్వీసులు సహా దాదాపు 2,961 విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. సుమారు 3.41 లక్షల మంది ప్రయాణికులు ప్రభావితమయ్యారు. అగ్నిపర్వతం నుండి బూడిద వెలువడుతుండటంతో .. ప్రభావిత ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థులకు తాత్కాలికంగా ఆన్‌లైన్‌ బోధన నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్