•ఈ వారంలోనే గెజిట్ నోటిఫికేషన్ !
•సీఎస్ సాయి ప్రసాద్, మంత్రి అనగాని సత్యప్రసాద్ సంతకాలతో ముందుకు
•ఐదు రోజులుగా ఎమ్మెల్యే ఏలూరి ప్రత్యేక చొరవ.. ఎట్టకేలకు ఫలితం
•28 వేల ఎకరాల సస్యశ్యామలానికి బాట
•సీఎం చంద్రబాబు, లోకేష్ మంత్రులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు
పర్చూరు (బాపట్ల) : దశాబ్దాలుగా రైతుల కళ్లలో ఎదురుచూపులుగా నిలిచిన గుంటూరు ఛానల్ ప్రాజెక్టు మరో కీలక మలుపు తిరిగింది. ఎప్పుడెప్పుడు కాలువ వస్తుందా.. తమ పొలాలు ఎప్పుడు సస్యశ్యామలమవుతాయా అని ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాతలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. గుంటూరు ఛానల్ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ఫైలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఫైలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సంతకాలు చేయడంతో భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
ఈ పరిణామం వెనుక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చేసిన నిరంతర కృషి ప్రధానంగా నిలిచింది. గత ఐదు రోజులుగా సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ, ఫైలు కదలికపై ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తూ ఆయన చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. ఫైలు ఏ దశలో ఉంది? ఎక్కడ ఆగింది? ఏ అనుమతులు అవసరం? తదుపరి చర్య ఏమిటి? అనే అంశాలపై అధికారులతో నిరంతరం సంప్రదిస్తూ ప్రక్రియ వేగవంతం చేయడంలో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపారు.
మాట ఇచ్చారు.. నిలబెట్టుకునే దిశగా అడుగు
గుంటూరు ఛానల్‌ను పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చింది. ఆ హామీని కార్యరూపంలోకి తీసుకెళ్లడంలో భాగంగా భూసేకరణకు సంబంధించిన కీలక ఫైలు ఆమోదం పొందింది. ఇప్పటికే నోటిఫికేషన్ ప్రక్రియకు అవసరమైన అనుమతులు పూర్తయ్యాయని ఎమ్మెల్యే ఏలూరి వెల్లడించారు.
ఈ వారంలోనే గెజిట్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. నోటిఫికేషన్ విడుదలైన అనంతరం భూసేకరణకు సంబంధించిన తదుపరి చర్యలను వేగవంతం చేసి, ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగనుంది.
ఐదు రోజులుగా.. ప్రతి అడుగునా పర్యవేక్షణ ....
గుంటూరు ఛానల్ భూసేకరణ ఫైలు తుది ఆమోదానికి చేరుకునే వరకు ఎమ్మెల్యే ఏలూరి చూపిన చొరవ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత ఐదు రోజులుగా ఈ అంశంపైనే ప్రత్యేక దృష్టి సారించిన ఆయన.. అధికారులతో వరుసగా సంప్రదింపులు జరుపుతూ ఫైలు కదలికను పర్యవేక్షించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉన్న సమయంలోనూ రైతుల దశాబ్దాల కలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని వివరించి.. రైతాంగానికి కలిగే ప్రయోజనాలను తెలియజేస్తూ భూసేకరణ ప్రక్రియకు ఆమోదం లభించేలా కృషి చేశారు.
గతంలో పలుమార్లు ప్రతిపాదనలు ముందుకు వెళ్లి, వివిధ కారణాలతో వెనక్కి వచ్చిన పరిస్థితుల్లో.. ఈసారి ఎలాంటి జాప్యం లేకుండా ప్రక్రియను పూర్తి చేయించడంపై ఎమ్మెల్యే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
సీఎంకు.. మంత్రులకు కృతజ్ఞతలు ....
భూసేకరణ ఫైలుకు ఆమోదం లభించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మంత్రి నారా లోకేష్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, మంత్రి నిమ్మల రామానాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ పెద్దల సహకారంతోనే ఫైలు వేగంగా కదిలిందని, రైతుల చిరకాల స్వప్నం సాకారం దిశగా కీలక అడుగు పడిందని పేర్కొన్నారు. రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి తాజా నిర్ణయం నిదర్శనమని తెలిపారు.
28 వేల ఎకరాలకు జల కళ ....
గుంటూరు ఛానల్ పూర్తయితే సుమారు 28 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి ప్రయోజనం అందనుంది. ప్రస్తుతం వర్షాలపై ఆధారపడుతున్న అనేక ప్రాంతాలకు ఇది శాశ్వత నీటి భద్రత కల్పించనుంది. కాలువ అందుబాటులోకి వస్తే సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు పంటల దిగుబడులు, రైతుల ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. అందుకే గుంటూరు ఛానల్ కేవలం ఒక సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదని.. వేలాది రైతు కుటుంబాల భవిష్యత్తుతో ముడిపడిన జీవనాధార ప్రాజెక్టుగా రైతులు భావిస్తున్నారు.
రైతుల నిరీక్షణకు తెర పడే రోజు దగ్గరలోనే ...
ఏళ్ల తరబడి గుంటూరు ఛానల్ కోసం ఎదురుచూస్తున్న రైతుల నిరీక్షణకు తెరపడే రోజు దగ్గరపడిందన్న భావన తాజా పరిణామంతో బలపడింది. భూసేకరణ ఫైలుకు ఆమోదం.. గెజిట్ నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం కావడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఫైలు తుది దశకు చేరుకునేలా కృషి చేసిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న తమ కల నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వానికి జేజేలు ....
గుంటూరు ఛానల్ భూసేకరణ ఫైలుకు ఆమోదం లభించడంతో రైతాంగంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోందంటూ అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూసేకరణ ఫైలుకు ఆమోదం.. త్వరలో గెజిట్.. ఆ తర్వాత కార్యాచరణ ఇలా ఒక్కో అడుగు ముందుకు పడుతుండటంతో గుంటూరు ఛానల్ కల సాకారం దిశగా స్పష్టమైన మార్గం ఏర్పడింది. దశాబ్దాల రైతు నిరీక్షణకు తెరదించే ఈ ప్రయాణంలో ఎమ్మెల్యే ఏలూరి చేసిన పట్టుదలతో కూడిన ప్రయత్నాలు కీలక ఘట్టంగా నిలిచాయి. ఇన్నాళ్లూ కాగితాలపై ఉన్న గుంటూరు ఛానల్.. ఇక క్షేత్రస్థాయిలో కదలికకు సిద్ధమవుతోంది. 28 వేల ఎకరాల సస్యశ్యామలానికి ఇదే తొలి కీలక అడుగు పడింది.







కామెంట్‌లు (0)