బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

లేటరైట్ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గం : సిపిఎం నేతలు

1 గంట క్రితం

It is atrocious to block the public consultation on laterite mining: CPM leaders.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 12:22 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

నాతావరం (అనకాపల్లి) : నాతవరం మండలం సుందరకోట పంచాయితీ కొత్త సిరిపురం గ్రామంలో లేటరైట్ తవ్వకాల కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా సిపిఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు అడిగర్ల రాజులను నాతవరం వద్ద పోలీసులు అడ్డుకోవడాన్ని సిపిఎం అనకాపల్లి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ప్రజాభిప్రాయ సేకరణకు స్థానికులను మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్పడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని నాయకులు ధ్వజమెత్తారు. బమిడికలొద్ది గ్రామంలోని 121 హెక్టార్ల లేటరైట్ తవ్వకాల ప్రాజెక్టుకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నదన్నారు.


సుందరకోట పంచాయతీ బమిడికలొద్ది గ్రామంలో సర్వే చేయని కొండ ప్రాంతంలో లేటరైట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం వల్ల గిరిజనుల జీవనాధారం, వ్యవసాయం, భూగర్భ జలాలు, పర్యావరణం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఏర్పడుతుందని సిపిఎం నాయకలు తెలిపారు. గిరిజనుల హక్కులకు రక్షణగా ఉన్న 1/70 చట్టం, పీసా చట్టం, అటవీ హక్కుల చట్టాలను అమలు చేయకుండా మైనింగ్‌కు అనుమతులు ఇవ్వడం అన్యాయమన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో అనుమతులకు మించి అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని, దీనివల్ల నాగులకొండ, అల్లూరి గృహాలు, సరుగుడు వాటర్‌ఫాల్స్‌తో పాటు వాగులు, గెడ్డలు, అటవీ సంపదకు ముప్పు ఏర్పడుతోందని తెలిపారు. కొండల తవ్వకాల వల్ల తాగునీరు, సాగునీటి సమస్యలు ఏర్పడి తాండవ, వరహా నదులపై కూడా ప్రభావం పడే ప్రమాదం పడుతుందని, అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నదన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్రజల అభిప్రాయాలను స్వేచ్ఛగా వినడమే తప్ప, ప్రజలను అడ్డుకోవడం కాదని సిపిఎం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందన్నారు. పౌరులకు తమ అభిప్రాయాన్ని చెప్పే, ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే, తమ జీవనాధారం–పర్యావరణ పరిరక్షణ కోసం నిరసన తెలిపే హక్కు ఉందని స్పష్టం చేశారు. సిపిఎం నాయకులను ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం ప్రజల గొంతును అణచివేస్తుందని, ప్రజల ప్రశ్నించే హక్కును, ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం దుర్మార్గం అని నేతలు మండిపడ్డారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్