- గాజాలో ఇజ్రాయిల్ దాడులు
- తొమ్మిది మంది మృతి
రఫా : కాల్పుల విరమణ జరిగాక కూడా ఇజ్రాయిల్ విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నది. ట్రంప్ సూచనల్ని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ఖాతరే చేయటంలేదు. అమెరికా అధ్యక్షుడు, ఇజ్రాయిల్ ప్రధాని లోపాయికారిగా ఒప్పందం చేసుకున్నాకే... పాలస్తీనాలో క్షిపణులతో తెగబడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాజా నగరంలో ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ముగ్గురు చిన్నారులతో సహా కనీసం తొమ్మిది మంది పాలస్తీనియన్లు మరణించారని ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఇజ్రాయిల్ యుద్ధ నిబంధనలకు విరుద్ధంగా జనావాసాలపై బాంబుదాడులకు పాల్పడుతుందని యూఎన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.
అపార్ట్‌మెంట్‌పై దాడిలో చిన్నారులు మృతి
నస్ర ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌పై జరిగిన దాడిలో 8 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు గల ముగ్గురు పిల్లలతో సహా కనీసం ఐదుగురు మరణించారని, మృతదేహాలను తరలించిన షిఫా ఆస్ప త్రి డైరెక్టర్ మహమ్మద్ అబు సెల్మియా తెలిపారు. 8 నుంచి 16 ఏళ్ల వయసు గల నలుగురు పిల్లలతో సహా మరో ఆరుగురు గాయపడ్డారని ఆయన చెప్పారు.
జైటౌన్ ప్రాంతంలోని ఒక గుంపుపై ఇజ్రాయిల్ జరిపిన మరో దాడిలో నలుగురు మరణించగా, ఇంకొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని ఆరోగ్య అధికారులు తెలిపారు. ఆ దాడిలో వారు ఒక "హమాస్ ఉగ్రవాది"ని లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయిల్ సైన్యం బుకాయిస్తున్నది.
గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటి నుంచి కనీసం 260 మంది పిల్లలతో సహా 1,127 మంది పాలస్తీనియన్లు మరణించగా, అదే కాలంలో ఐదుగురు ఇజ్రాయిల్ సైనికులు కూడా మరణించారు. ఇజ్రాయిల్ దాడిలో మొత్తంగా 73,250 మంది పాలస్తీనియన్లు మరణించారు. మరణించిన వారిలో దాదాపు సగం మందికిపైగా మహిళలు, పిల్లలే.








కామెంట్‌లు (0)