శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆగని ఇజ్రాయిల్‌ దాడులు

20 జూన్, 2026

israel attacks
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 11:42 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- 16 మంది మృతి

- స్విట్జర్లాండ్‌కు అమెరికా ప్రతినిధి

బీరుట్‌/‌వాషింగ్టన్‌ : దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ బాంబు దాడులతో విరుచుకుపడుతుంది. శనివారం జరిగిన తాజా దాడులలో కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ ప్రాంతంలోని పలు ప్రదేశాలపై వైమానిక దాడులు జరిగాయని, పేలుడు శబ్దాలు వినిపించాయని లెబనాన్‌ అధికార వార్తా సంస్థ తెలిపింది. ఇజ్రాయిల్‌ దాడుల నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు. కాల్పుల విరమణ ఉల్లంఘనపై ఇజ్రాయిల్‌, హిజ్బల్లా పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. హిజ్బల్లా దాడులకు ప్రతిగానే తాము కూడా సైనిక చర్యకు దిగామని ఇజ్రాయిల్‌ చెబుతుంటే లెబనాన్‌లో ఇజ్రాయిల్‌ ఆగడాలు సాగనివ్వబోమని హిజ్బల్లా తేల్చి చెప్పింది. ఇరాన్‌ అణు కార్యక్రమం సహా పలు కీలక అంశాలపై చర్చించేందుకు వాషింగ్టన్‌, టెహ్రాన్‌లు 60 రోజుల గడువు నిర్దేశించుకున్న విషయం తెలిసిందే. లెబనాన్‌లో ఇజ్రాయిల్‌ దాడులు ఆగినప్పుడే ఈ చర్చలు మొదలవుతాయని ఇరాన్‌ షరతు విధించింది. దీంతో ఇరాన్‌-అమెరికా మధ్య ప్రారంభం కావాల్సిన తదుపరి చర్చలపై అనిశ్చితి నెలకొంది. అయినప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్‌ విట్‌కాఫ్‌ చర్చల నిమిత్తం స్విట్జర్లాండ్‌ బయలుదేరారు. అలాగే రెండు, మూడు రోజుల్లో తాను కూడా వెళ్తానని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తెలిపారు. అక్కడ ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీని కలుస్తారని సమాచారం. ఇదిలావుండగా ఇరాన్‌-అమెరికా ఒప్పందంలో తాను భాగస్వామిని కానని ఇజ్రాయిల్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. లెబనాన్‌లో తన సేనల మోహరింపు కొనసాగుతుందని తెలిపింది.

ఇజ్రాయిల్‌, హిజ్బల్లా మధ్య ఒప్పందం?

కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ఇజ్రాయిల్‌, హిజ్బల్లా వర్గాలు శుక్రవారం ధృవీకరించాయి. అయినప్పటికీ శనివారం ఇజ్రాయిల్‌ యుద్ధ విమానాలు, డ్రోన్లు దక్షిణ లెబనాన్‌, బెక్కా వ్యాలీలోని లక్ష్యాలపై దాడులు చేశాయి. ఈ రెండింటినీ హిజ్బల్లాకు కంచుకోటలుగా భావిస్తారు. దక్షిణ లెబనాన్‌లోని తమ సేనలపై శుక్రవారం రాత్రి హిజ్బల్లా యాభైకి పైగా దాడులు చేసిందని ఇజ్రాయిల్‌ ఆరోపించింది. మరోవైపు పాకిస్తాన్‌ ఆంతరంగిక వ్యవహారాల శాఖ మంత్రి మొహసిన్‌ నఖ్వీ టెహ్రాన్‌లో విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీతో చర్చలు జరిపారు. ఇరాన్‌-అమెరికా మధ్య తదుపరి చర్చలు స్విట్జర్లాండ్‌లో జరగాల్సి ఉంది. అయితే ట్రంప్‌ ప్రతినిధి స్టీవ్‌ విట్‌కాఫ్‌తో పాటు ట్రంప్‌ అల్లుడు జేర్డ్‌ కుష్నర్‌ కూడా చర్చలలో భాగస్వామి అవుతారని తెలుస్తోంది.

ఏం సాధించారు? : ఒబామా

ఇరాన్‌ యుద్ధం విషయంలో ట్రంప్‌ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తప్పుపట్టారు. అనేక బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసి, సైన్యాన్ని ఇబ్బంది పెట్టి, సైనికుల ప్రాణాలు బలిగొన్న యుద్ధం సాధించిందేమిటని ప్రశ్నించారు. గతంలో ఎలా ఉందో...ఇంకా చెప్పాలంటే అంతకంటే దారుణంగా పరిస్థితి మారిపోయిందని దుయ్యబట్టారు. కాల్పుల విరమణను ఒబామా స్వాగతించారు. అయితే అమెరికాలో మూడింట రెండు వంతుల మంది ఇప్పటికీ ఇరాన్‌ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇరాన్‌పై సాగించిన యుద్ధం విషయంలో అధ్యక్షుడు ట్రంప్‌ వ్యవహార శైలిని వారు అంగీకరించడం లేదని ఎపి-ఎన్‌ఒఆర్‌సి పోల్‌ వెల్లడించింది.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్