శుక్రవారం, 10 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వివో–డిక్సన్ భాగస్వామ్యానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్

1 గంట క్రితం

xon
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 10:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- చైనా పెట్టుబడులపై భారత్ కొత్త వ్యూహం

న్యూఢిల్లీ : వివో మొబైల్ ఇండియా–డిక్సన్ టెక్నాలజీస్ సంయుక్త సంస్థ (జాయింట్ వెంచర్) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం స్మార్ట్‌ఫోన్ తయారీ రంగానికే కాకుండా చైనా పెట్టుబడుల విషయంలో భారత్ అనుసరిస్తున్న కొత్త విధానానికి సంకేతంగా మారింది. 2020లో గల్వాన్ ఘటన తర్వాత చైనా పెట్టుబడులపై కఠిన ఆంక్షలు విధించిన కేంద్రం.. ఇప్పుడు భారత కంపెనీలకే మెజారిటీ యాజమాన్యం ఉండే విధంగా చైనా సంస్థలకు పరిమిత భాగస్వామ్యాన్ని అనుమతిస్తోంది. తాజా ఒప్పందంలో డిక్సన్‌కు 51 శాతం, వివోకు 49 శాతం వాటా ఉండనుంది. భారత్‌లోనే ఉత్పత్తి, భారత కంపెనీల ఆధ్వర్యంలో నిర్వహణ, స్థానిక ఉపాధి, ఎగుమతుల పెంపు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తూనే చైనా సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించుకోవడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇదే తరహాలో గతంలో జెఎస్‌‌డబ్ల్యు- ఎంజి మోటార్, డిక్సన్–లాంగ్‌చీర్, డిక్సన్–హెచ్‌కెసి వంటి భాగస్వామ్యాలకు కూడా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. భారత ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను కేవలం అసెంబ్లీ కేంద్రంగా కాకుండా డిజైన్, డిస్‌ప్లే, విడిభాగాల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఈ భాగస్వామ్యాలు దోహదపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా మూలధనానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వకుండా, అక్కడి సాంకేతిక పరిజ్ఞానం, తయారీ నైపుణ్యాన్ని భారత కంపెనీల ద్వారా దేశీయ పరిశ్రమకు మళ్లించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్