mh ad
మంగళవారం, 23 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionదలాల్‌ స్ర్టీట్‌ కుదేలు

1 గంట క్రితం

Dalal Street Crashes
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 23, 2026, 10:14 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • రూ. 5.77 లక్షల కోట్ల సంపద ఆవిరి

  • సెన్సెక్స్‌ 893 పాయింట్ల పతనం

ముంబయి : అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, ఐటి షేర్ల పతనం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడితో మంగళవారం దలాల్‌ ‌స్ర్టీట్‌ కుదేలు అయ్యింది. తొలుత స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన.. బిఎస్‌ఇ సెన్సెక్స్ తుదకు 893 పాయింట్లు పడిపోయి 76,200కు పరిమితమయ్యింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 50 సూచీ 279 పాయింట్లు కోల్పోయి 23,850 స్థాయి కంటే దిగువకు చేరుకుంది. ఈ ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ. 5.77 లక్షల కోట్లు ఆవిరయ్యింది.

ప్రధాన కారణాలు..

దక్షిణ కొరియా బెంచ్‌మార్క్ సూచీ కోస్పి ఒక్కసారిగా 10 శాతం పతనం కావడం ఆసియా మార్కెట్లను భయాందోళనకు గురిచేసింది. సామ్‌‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్ 13 శాతం, ఎస్కే హైనిక్స్ 12 శాతం చొప్పున పడిపోవడంతో అక్కడ ట్రేడింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. దీని ప్రభావం ఇతర ఆసియా మార్కెట్లపై పడింది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధరలు పెరగడం ద్రవ్యోల్బణానికి దారితీస్తోంది. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది మూడు సార్లు వడ్డీ రేట్లను పెంచవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేసింది. యాక్సెంచర్ తన వార్షిక ఆదాయ వృద్ధి అంచనాలను తగ్గించుకోవడం ఐటి రంగాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. అమెరికా డాలర్ బలోపేతం కావడంతో భారత రూపాయి విలువపై ఒత్తిడి పెరిగింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 94.73 వద్ద ముగిసింది. గత ఎనిమిది సెషన్లలో ఆరు సార్లు లాభాల్లో ముగిసిన నిఫ్టీ, ప్రస్తుతం లాభాల స్వీకరణ ఒత్తిడిని ఎదుర్కొంటోందని బ్రోకర్లు పేర్కొన్నారు. హర్మూజ్‌ జలసంధి సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాకపోవడం, చమురు సరఫరాపై అనిశ్చితి కొనసాగుతుండటం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది.

​స్పేస్‌ఎక్స్ షేర్ల భారీ పతనం

రుణ సమీకరణ కోసం బాండ్లను విక్రయిస్తున్నట్లు ప్రకటించిన స్పేస్‌ఎక్స్ షేర్లు వరుసగా పతనమవుతున్నాయి. దీంతో అమెరికా నాస్‌‌డాక్‌ ఎక్సేంజీలో సోమవారం ఒక్కరోజే కంపెనీ విలువ 16 శాతం క్షీణించగా.. గత మూడు రోజుల్లో మొత్తం 600 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయింది. ప్రస్తుతం కంపెనీ విలువ 2 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్