బుధవారం, 05 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరుణ గ్రహీతలకు మళ్లీ నిరాశనే..!

3 గంటల క్రితం

RBI
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 10:55 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • నాలుగో ‘సారీ’ వడ్డీ రేట్లు యథాతథం

  • అన్ని విత్త సంస్థలకూ ఒకే వడ్డీ విధానం

  • యుపిఐ ఛార్జీలపై ప్రభుత్వానిదే నిర్ణయం..!

  • ఆర్‌‌బిఐ ఎంపిసి భేటీ నిర్ణయాలు వెల్లడి

ముంబయి : రిజర్వ్‌ ‌బ్యాంక్‌ ‌వరుసగా నాలుగోసారి రుణ గ్రహీతలకు నిరాశను మిగిల్చింది. దేశంలో అధిక ధరలతో ఆదాయాలు లేక ఒత్తిడి ఎదుర్కొంటున్న వేళ కనీసం రుణ రేట్లు అయినా తగ్గుతాయని ఆశించిన ఖాతాదారులకు ఆర్‌‌బిఐ మరోసారి షాక్‌ ఇచ్చింది. మూడు రోజుల పాటు జరిగిన ఆర్‌‌బిఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష (ఎంపిసి) నిర్ణయాలను బుధవారం వెల్లడించింది. వరుసగా నాలుగో సారి వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆర్‌‌బిఐ గవర్నర్‌ ‌సంజయ్ మల్హోత్రా మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథ స్థితిని కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని, భవిష్యత్తులోనూ వృద్ధి వేగం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రెపో రేటు 5.25 శాతమే..

రుణాలపై అమలు చేసే కీలక రెపో రేటును 5.25 శాతం వద్దే కొనసాగించాలని ​ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపిసి) ఏకగ్రీవంగా నిర్ణయించింది. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌‌బిఐ తెలిపింది. దేశీయంగా డిమాండ్ బలపడటం, తయారీ, సేవా రంగాల నుంచి వస్తున్న సానుకూల సంకేతాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జిడిపి వృద్ధి అంచనాను ఆర్‌బిఐ 6.7 శాతానికి పెంచింది. పరిస్థితులు అనుకూలిస్తే వృద్ధి రేటు 7 శాతానికి చేరే అవకాశాలున్నాయని గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. ఇక రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతంగా ఉండొచ్చని అంచనా వేయగా.. ధరల ఒత్తిడి ప్రధానంగా ఆహార, ఇంధన రంగాలకే పరిమితమైందన్నారు.

మార్కెట్‌ ‌శక్తుల చేతుల్లోనే రూపాయి విలువ ..

గత నెల రోజుల వ్యవధిలో రూపాయి విలువ 97 స్థాయి నుంచి 95 శ్రేణికి బలపడిందని మల్హోత్రా తెలిపారు. మార్కెట్ శక్తులకే రూపాయి విలువను వదిలేస్తామని, ఎటువంటి విపరీతమైన అస్థిరతలు తలెత్తకుండా, ఊహాజనిత ఒత్తిళ్లను అడ్డుకోవడానికి మాత్రమే కేంద్ర బ్యాంకు జోక్యం చేసుకుంటుందని స్పష్టం చేశారు. రూపాయి మారకం విలువ రికార్డ్‌ ‌స్థాయిలో పడిపోతుండటంతో వస్తున్న ఆందోళనలను గవర్నర్ కొట్టిపారేయడం గమనార్హం. భవిష్యత్తులో ఉద్రిక్తతలు తగ్గి రూపాయి మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారత విదేశీ మారక నిల్వలు, సేవారంగ ఎగుమతులు, ఎన్‌ఆర్‌ఐ రెమిటెన్స్‌‌లు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బలంగా ఉన్నాయన్నారు.

ఏప్రిల్‌‌లో పాలిమర్ కరెన్సీ నోట్లు..!

​కరెన్సీ నోట్ల మన్నికను పెంచేందుకు రాబోయే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికి పాలిమర్ నోట్లను దశలవారీగా ప్రవేశపెట్టాలని ఆర్‌బిఐ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాథమికంగా తక్కువ విలువ కలిగిన నోట్లను ప్లాస్టిక్‌‌లో ముద్రించి దేశ వాతావరణ పరిస్థితుల్లో వాటి పనితీరును పరిశీలిస్తామని మల్హోత్రా తెలిపారు. ఇవి ఎక్కువ కాలం మన్నికగా ఉండటంతో పాటు ఆర్థిక వ్యవస్థ అవసరాలకు తగినట్లుగా తోడ్పడతాయని పేర్కొన్నారు. దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉందని, తగినంత మూలధన నిల్వలు, ద్రవ్య లభ్యతతో ఆర్థికంగా ఆరోగ్యకరంగా కొనసాగుతోందన్నారు. భౌగోళిక రాజకీయ సవాళ్లు, కొవిడ్ వంటి సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొన్న భారత ఆర్థిక వ్యవస్థ.. ప్రతి సవాలుతో మరింత బలంగా ఎదిగిందన్నారు.

బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌‌సిలకు ఒకే నిబంధనలు

రుణాలపై వడ్డీ రేట్లకు సంబంధించి బ్యాంకులు, బ్యాంకింగేతర విత్త సంస్థలు (ఎన్‌‌బిఎఫ్‌‌సి) అనుసరించే విధానాల్లో పారదర్శకత, ఒకే విధానం తీసుకురావడానికి ఆర్‌బిఐ కొత్త ప్రతిపాదనలు తెచ్చింది. త్వరలోనే దీనికి సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు గవర్నర్ మల్హోత్రా తెలిపారు. బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌‌సిలు వడ్డీని లెక్కించడానికి ఉపయోగించే రోజులను ప్రామాణీకరించాలని ప్రతిపాదించామన్నారు. దీనివల్ల వడ్డీల్లోని వ్యత్యాసాలు తొలగిపోతాయి. ప్రస్తుతం ఫ్లోటింగ్ వడ్డీ రేట్లను వేర్వేరు కాలాల్లో మారుస్తుండటంతో ఏకరూపత కొరవడిందన్నారు. ఈ క్రమబద్ధీకరణ ద్వారా ఆర్‌బిఐ రెపోరేటు తగ్గించిన ప్రయోజనం రుణగ్రహీతలకు త్వరగా చేరుతుందన్నారు. వేర్వేరు బ్యాంకుల్లోని రుణ ఆఫర్లను పోల్చుకోవడం సులభమవుతుందని ఆర్‌‌బిఐ భావిస్తోంది.

యుపిఐ ఛార్జీలపై త్వరలో స్పష్టత..

డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను బలోపేతం చేయాలంటే దానికి అయ్యే ఖర్చును ఎవరో ఒకరు భరించాల్సిందేనని ఆర్‌బిఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా పేర్కొన్నారు. యుపిఐ లావాదేవీలపై ఛార్జీల అంశంపై అప్పుడే మాట్లాడడం తొందరపాటే అవుతుందన్నారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలని తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్