వృద్ధి 6.8 శాతమే
ఇండియా రేటింగ్స్ అంచనా
న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో కొనసాగుతున్న అనిశ్చితి, ఆహార ఇంధన ద్రవ్యోల్బణ భయాలు, రూపాయి బలహీనత, ఎల్‌నినో ప్రభావం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత జిడిపి వృద్ధి 6.8 శాతానికి పరిమితం కావచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్ రా) అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం నమోదైన 7.6 శాతంతో పోలిస్తే ఇది తక్కువ. అయితే మేలో వేసిన 6.7 శాతం అంచనాను తాజాగా 6.8 శాతానికి పెంచింది. రాబోయే నాలుగు త్రైమాసికాల్లో వృద్ధి వరుసగా 6.9, 6.6, 6.7, 6.9 శాతంగా ఉండవచ్చని పేర్కొంది. రూపాయి సగటు విలువ డాలర్‌తో పోలిస్తే రూ.93.98గా ఉండవచ్చని తెలిపింది. ముడిచమురు ధరలు తగ్గడం ఆర్థిక వ్యవస్థకు కొంత ఊరటనిచ్చినా, ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ ఉత్పత్తి, ఆహార ధరలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని ఇండ్ రా చీఫ్ ఎకనామిస్ట్ దేవేంద్ర పంత్ తెలిపారు. 2026-27లో వ్యవసాయ వృద్ధి 2 శాతానికి పరిమితం కావచ్చని, రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 4.9 శాతంగా ఉండవచ్చని అంచనా వేశారు. ఎల్‌నినో, పశ్చిమాసియా పరిణామాలు, బలహీనపడుతున్న రూపాయి, అంతర్జాతీయ వాణిజ్యంలో మందగమనం వంటి అంశాలు వృద్ధికి సవాళ్లుగా మారవచ్చని సంస్థ పేర్కొంది.







కామెంట్‌లు (0)